close

తాజా వార్తలు

వదిలేశారు..

కొంప ముంచిన ఫీల్డింగ్‌ తప్పిదాలు
రెండో టీ20లో భారత్‌కు తప్పని ఓటమి
సిరీస్‌లో విండీస్‌ బోణీ
తిరువనంతపురం

‘‘క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి’’ అని క్రికెట్లో ఒక నానుడి! భారత్‌, వెస్టిండీస్‌ రెండో టీ20 చూస్తే ఇది నిజమే అనిపించకమానదు! ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిందంటే అందుకు ప్రధాన కారణం ఫీల్డింగ్‌ వైఫల్యమే!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు క్యాచ్‌లు చేజారాయి తొలి టీ20లో. అయితే ఉప్పల్‌లో పిచ్‌ బ్యాటింగ్‌ స్వర్గధామం కావడం, విరాట్‌ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 209 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించేసింది   టీమ్‌ఇండియా. దీంతో ఫీల్డింగ్‌ తప్పిదాలు మరుగున పడిపోయాయి!

ఇక్కడ పిచ్‌ అంత అనుకూలంగా లేదు. కోహ్లి కూడా రెచ్చిపోలేదు. పేలవ ఫీల్డింగ్‌ మాత్రం కొనసాగాయి. కీలకమైన క్యాచ్‌లు చేజారాయి. ఫలితం.. విండీస్‌ అలవోక విజయం. సిరీస్‌ 1-1తో సమం. నిర్ణయాత్మక చివరి టీ20లో అయినా తప్పులు దిద్దుకోకుంటే సిరీస్‌పై ఆశలు వదులుకోవాల్సిందే

టీమ్‌ఇండియాకు పంచ్‌ పడింది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించి బయటపడ్డ కోహ్లీసేనకు.. రెండో మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. బ్యాటింగ్‌లో మంచి స్థితిలో ఉన్నపుడు పట్టు విడవడం, ఫీల్డింగ్‌ పేలవంగా సాగడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఆదివారం తిరువనంతపురంలో జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 171 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకో 9 బంతులుండగానే ఛేదించింది. ఓపెనర్‌, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లెండిల్‌ సిమన్స్‌ (67 నాటౌట్‌; 45 బంతుల్లో 4×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన సిమన్స్‌.. కుదురుకున్నాక రెచ్చిపోయాడు. మరో ఓపెనర్‌ లూయిస్‌ (40; 35 బంతుల్లో 3×4, 3×6)తో కలిసి అతను తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశాడు. ఆ తర్వాత హెట్‌మయర్‌ (23) అతడికి సహకారమందించాడు. రెండో వికెట్‌ పడ్డాక సిమన్స్‌తో కలిసి పూరన్‌ (38 నాటౌట్‌; 18 బంతుల్లో 4×4, 2×6) మెరుపులు మెరిపించడంతో భారత్‌కు అవకాశమే లేకుండా పోయింది. అంతకుముందు భారత్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. కొత్త కుర్రాడు శివమ్‌ దూబె (54; 30 బంతుల్లో 3×4, 4×6) ఆకట్టుకున్నా.. మిగతా బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేదు. నిర్ణయాత్మక చివరి టీ20 బుధవారం ముంబయిలో జరుగుతుంది.

దూబె ఉన్నంతసేపు..
అంతకుముందు భారత ఇన్నింగ్స్‌ ఒడుదొడుకులతో సాగింది. తొలి టీ20లో 208 పరుగులు చేసినా ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ ఛేదనకు మొగ్గు చూపింది. ఉప్పల్‌లో మాదిరి ఇక్కడ పరుగుల వరద పారే అవకాశం లేదని ఆరంభ ఓవర్లలోనే అర్థమైపోయింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (15), రాహుల్‌ (11) పరుగులు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆచితూచి ఆడిన ఓపెనర్లు క్రీజులో కుదురుకుంటున్న దశలో వెనుదిరిగారు. రాహుల్‌ను పియర్‌ ఔట్‌ చేయగా.. హోల్డర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ బౌల్డయ్యాడు. ఈ దశలో శివమ్‌ దూబె సంచలన ఇన్నింగ్స్‌తో భారత అభిమానుల్లో ఉత్సాహం తీసుకొచ్చాడు. కోహ్లి తాను వెనక్కి తగ్గి.. దూబెను మూడో స్థానంలో పంపగా.. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఈ ముంబయి కుర్రాడు కుదురుకున్నాక రెచ్చిపోయాడు. పొలార్డ్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో అతను మూడు సిక్స్‌లు కొట్టడం విశేషం. 10.1 ఓవర్లకు 97/2తో భారత్‌.. 200 స్కోరుపై కన్నేసినట్లు కనిపించింది. అయితే ప్రతి బంతినీ బాదే ఆలోచనతో కనిపించిన దూబెను హేడెన్‌ వాల్ష్‌ (2/28) బోల్తా కొట్టించాడు. ఆఫ్‌ వికెట్‌కు దూరంగా విసిరిన బంతికి సరిగా షాట్‌ ఆడలేకపోయిన దూబె.. హెట్‌మయర్‌కు దొరికిపోయాడు. అయినా కోహ్లి ఉండటంతో భారీ స్కోరు ఖాయమనే అనిపించింది. కానీ అతను జోరు పెంచకముందే 19 పరుగులకే వెనుదిరిగాడు. గత మ్యాచ్‌లో కోహ్లి ధాటికి బెంబేలెత్తిన విలియమ్స్‌ (2/30)యే అతణ్ని ఔట్‌ చేశాడు. అయ్యర్‌ (10), జడేజా (9), సుందర్‌ (0) విఫలం కాగా.. రిషబ్‌ పంత్‌ (33 నాటౌట్‌; 22 బంతుల్లో 3×4, 1×6) సమయోచితంగా ఆడి జట్టుకు ఓ మోస్తరు స్కోరు అందించాడు.


5 పరుగులకే ఔటవ్వాల్సిన వాడు..

రెండో టీ20లో 67 పరుగులతో అజేయంగా నిలిచి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గెలుచుకున్న సిమన్స్‌ కేవలం 5 పరుగుల వద్దే వెనుదిరగాల్సింది. భువనేశ్వర్‌ వేసిన అయిదో ఓవర్లో అతడి క్యాచ్‌ను మిడాఫ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ వదిలేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సిమన్స్‌.. చివరి దాకా క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. సుందర్‌ తొలి టీ20లోనూ ఓ తేలికైన క్యాచ్‌ వదిలేశాడు. సిమన్స్‌ క్యాచ్‌ను సుందర్‌ వదిలేశాక.. ఇంకో రెండు బంతులకే లూయిస్‌ క్యాచ్‌ను పంత్‌ విడిచిపెట్టాడు. అది కాస్త కష్టమైందే. అప్పటికి 16 పరుగులతో ఉన్న లూయిస్‌.. 40 పరుగులు చేశాడు. మ్యాచ్‌ చివర్లో అయ్యర్‌ సైతం ఒక కష్టమైన క్యాచ్‌ (పూరన్‌ది) అందుకోవడంలో విఫలమయ్యాడు.


కెప్టెన్‌ ఒక్కడు..

మైదానంలో మిగతా ఫీల్డర్లు తప్పుల మీద తప్పులు చేస్తుంటే.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. మరీ ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌ అతడి అద్భుత క్యాచ్‌ వల్లే కాస్త పోటాపోటీగా మారింది. జోరుమీదున్న హెట్‌మయర్‌.. జడేజా బౌలింగ్‌ లాంగాఫ్‌ వైపు లాఫ్టెడ్‌ షాట్‌ ఆడాడు. ఫోరో, సిక్సరో ఖాయం అనుకుంటుంటే.. దూరం నుంచి మెరుపు వేగంతో దూసుకొచ్చిన విరాట్‌ డైవ్‌ చేస్తూ అమాంతం క్యాచ్‌ పట్టేశాడు. బంతిని అందుకున్నాక బౌండరీ లైన్‌కు తాకకుండా భారత కెప్టెన్‌ నియంత్రించుకున్న తీరు ప్రశంసనీయం. ఇలాంటి పట్టుదల మిగతా ఫీల్డర్లలో ఉంటే ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచేదే. అతడి స్ఫూర్తితో అయినా తర్వాతి మ్యాచ్‌ నుంచి మిగతా ఆటగాళ్లు మారతారేమో చూడాలి.


భారత్‌ ఇన్నింగ్స్‌:   రోహిత్‌ (బి) హోల్డర్‌ 15; రాహుల్‌ (సి) హెట్‌మయర్‌ (బి) పియర్‌ 11; దూబె (సి) హెట్‌మయర్‌ (బి) వాల్ష్‌ 54; కోహ్లి (సి) సిమన్స్‌ (బి) విలియమ్స్‌ 19; పంత్‌ నాటౌట్‌ 33; అయ్యర్‌ (సి) కింగ్‌ (బి) వాల్ష్‌ 10; జడేజా (బి) విలియమ్స్‌ 9; సుందర్‌ (సి) అండ్‌ (బి) కాట్రెల్‌ 0; చాహర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 18 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 170;
వికెట్ల పతనం: 1-24, 2-56, 3-97, 4-120, 5-144, 6-164, 7-167;
బౌలింగ్‌: కాట్రెల్‌ 4-0-27-1; పియర్‌ 2-0-11-1; హోల్డర్‌ 4-0-42-1; కెస్రిక్‌ విలియమ్స్‌ 4-0-30-2; పొలార్డ్‌ 2-0-29-0; హేడెన్‌ వాల్ష్‌ 4-0-28-2

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: సిమన్స్‌ నాటౌట్‌ 67; లూయిస్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) సుందర్‌ 40; హెట్‌మయర్‌ (సి) కోహ్లి (బి) జడేజా 23; పూరన్‌ నాటౌట్‌ 38; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 173
వికెట్ల పతనం: 1-73, 2-112
బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3.3-0-35-0; భువనేశ్వర్‌ 4-0-36-0; సుందర్‌ 4-0-26-1; చాహల్‌ 3-0-36-0; శివమ్‌ దూబె 2-0-18-0; జడేజా 2-0-22-1


బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేయగానే.. జేబులో నుంచి బుక్‌ తీసి టిక్కు పెట్టి ఓ పనైపోయినట్లు సంబరాలు చేసుకోవడం వెస్టిండీస్‌ బౌలర్‌ విలియమ్స్‌కు అలవాటు. రెండేళ్ల క్రితం కోహ్లి వికెట్‌ తీసినప్పుడు అలానే చేశాడు. అది గుర్తుపెట్టుకున్న కోహ్లి.. తొలి టీ20లో అతడి బౌలింగ్‌ను ఉతికారేసి విలియమ్స్‌కు అతడి తరహాలోనే బదులు ఇచ్చాడు. రెండో టీ20లో విరాట్‌ వికెట్‌ను విలియమ్సే తీశాడు.. కాకపోతే తనదైన శైలిలో సంబరాలు మాత్రం చేసుకోలేదు. మరోసారి కోహ్లి కోపాన్ని రుచి చూడాల్సి వస్తుందనేనేమో.. నోటిపై వేలు వేసుకుని వెళ్లిపోయాడు!


ఫీల్డింగ్‌ చెత్తగా ఉంటే.. లక్ష్యం ఎంత ఉన్నా ఇట్టే కరిగిపోతుంది. గత రెండు మ్యాచ్‌ల్లో మా ఫీల్డింగ్‌ నాసిరకంగా ఉంది. ఒకే ఓవర్లో రెండు క్యాచ్‌లు జారవిడిచాం. ఆ రెండు క్యాచ్‌లు పట్టివుంటే వారిపై ఎంత ఒత్తిడి పెరిగేదో ఒక్కసారి ఊహించండి. ఫీల్డింగ్‌ కచ్చితంగా మెరుగుపడాలి.

- విరాట్‌ కోహ్లి


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.