close

తాజా వార్తలు

వివేకా హత్య వెనుక ఐదుగురు రాజకీయ పెద్దలు

ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించ తగినది
హైకోర్టుకు విన్నవించిన  వివేకానందరెడ్డి భార్య, కుమార్తె, అల్లుడు
హత్య కేసును సీఎం తారుమారు చేయొచ్చు
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి  తరఫు న్యాయవాది వెల్లడి
కేసు డైరీ, జనరల్‌ డైరీ సమర్పించాలని  ప్రభుత్వానికి న్యాయమూర్తి స్పష్టీకరణ
సీఎం తరఫు వాదనల కోసం  విచారణ సోమవారానికి వాయిదా

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెనుక ఐదుగురు రాజకీయ పెద్దల జోక్యం ఉందని మృతుని భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె ఎన్‌.సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి గురువారం హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసు.. సీబీఐ దర్యాప్తునకు అప్పగించడానికి తగినదని విన్నవించారు. ఈ మేరకు వారి తరఫున సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టును ఆశ్రయించిన జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక తన వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదంటున్నారని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది ఆర్‌.బసంత్‌ కోర్టుకు తెలిపారు.

వివేకా హత్య కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు లేదా సీబీఐకి అప్పగించాలని మృతుడి భార్య వైఎస్‌ సౌభాగ్యమ్మ, అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇదే అంశంపై తెదేపా ఎమ్మెల్సీ రవీంద్రనాథ్‌రెడ్డి(బీటెక్‌ రవి), మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మృతుని కుమార్తె ఎన్‌.సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాల్లో విచారణ తుది దశకు చేరింది. ముఖ్యమంత్రిపై పిటిషనర్లు లేవనెత్తిన ఆరోపణలపై వాదనలు వినిపించేందుకు విచారణ సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు వివేకా హత్య కేసు జనరల్‌ డైరీ, కేసు డైరీలను తమ ముందు ఉంచాలని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌కు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు గురువారం స్పష్టం చేశారు.

బలవంతుడి పాత్రపై సమాధానం ఏంటి?
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది బసంత్‌ ప్రతివాదనలు వినిపిస్తూ.. ‘ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరగడంలేదు. వివేకా హత్య వెనుక అత్యంత బలవంతుడైన (పవర్‌ఫుల్‌ పర్సన్‌) దగ్గరి బంధువు పాత్ర ఉందని మృతుని కుటుంబ సభ్యులు చెబుతున్నదానికి ఏమి సమాధానం చెబుతారు? హత్య జరిగి 11నెలలు పైనే గడుస్తోంది. అసలు నేరస్థులు ఎవరో కనుగొనలేకపోయారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిపాలన యంత్రాంగం అంతా ఆయన చేతుల్లో ఉన్నందున హత్య కేసును తారుమారు చేయొచ్చు. దర్యాప్తును సీబీఐకి అప్పగించండి’ అని కోరారు.

జాప్యానికి కారణం మేమేనని నిందమోపుతోంది: మృతుని కుటుంబ సభ్యులు
మృతుని భార్య, కుమార్తె, అల్లుడు తరఫున సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మృతుని భార్య సౌభాగ్యమ్మ గతంలో వ్యాజ్యం దాఖలు చేసినప్పుడు ప్రభుత్వం మౌనంగా ఉంది. తాజాగా కుమార్తె, అల్లుడు సీబీఐ దర్యాప్తు కోసం వ్యాజ్యం దాఖలు చేశాక దర్యాప్తులో జాప్యానికి కారణం మేమేనని ప్రభుత్వం నిందమోపుతోంది’ అని వాదనలు వినిపించారు.

దర్యాప్తు కొనసాగింపునకు అనుమతించండి: ఏజీ
ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ..‘వివేకా హత్య కేసు దర్యాప్తు మరో రెండు నెలల్లో పూర్తి అవుతుంది. దర్యాప్తులో జాప్యం జరగుతోందన్న కారణంతో సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదు. సందేహాలుంటే మొదట మెజిస్ట్రేట్‌ ముందు దరఖాస్తు చేసుకోవాలి. దర్యాప్తు పురోగతిని, సిట్‌ సభ్యుల వివరాల్ని వేర్వేరుగా సీల్డ్‌ కవర్లో అందజేస్తున్నాం. దర్యాప్తు కొనసాగింపునకు అనుమతించండి’’ అని కోరారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.