బైడెన్‌ రిహార్సల్‌ వాయిదా!

ప్రధానాంశాలు

బైడెన్‌ రిహార్సల్‌ వాయిదా!

ఎఫ్‌బీఐ హెచ్చరిక నేపథ్యంలోనే

వాషింగ్టన్‌: అగ్రరాజ్యానికి కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారానికి ముందు అమెరికాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మరోసారి నిరసనకారుల నుంచి ముప్పు పొంచి ఉందని ఎఫ్‌బీఐ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించతలపెట్టిన బైడెన్‌ ప్రమాణస్వీకార రిహార్సల్‌ కార్యక్రమాలన్నీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అమెరికాలోని 50 రాష్ట్రాల రాజధానుల్లో, వాషింగ్టన్‌ డీసీలో నిరసనకారులు ఆయుధాలతో అల్లర్లకు పాల్పడే అవకాశముందని ఎఫ్‌బీఐ పేర్కొంది. ప్రమాణస్వీకార మహోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అగ్రరాజ్య రక్షణ విభాగం పెంటగాన్‌ 20 వేల మంది నేషనల్‌ గార్డ్స్‌ను ఆయుధాలతో క్యాపిటల్‌ చుట్టూ మోహరిస్తోంది. జనవరి 6 నాటి దాడిలో పాల్గొన్న వందమందిని అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ క్రిస్టోఫరక్‌ రే చెప్పారు. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌తో రే భేటీ అయ్యారు. క్యాపిటల్‌పై దాడిలో పాల్గొన్న నౌకాదళ మాజీ అధికారి ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని టెక్సాస్‌ న్యాయస్థానం ముందు హాజరుపరచగా.. గృహనిర్బంధం విధిస్తూ తీర్పు వెలువడింది. క్యాపిటల్‌ భవనంపై దాడి ఘటనలో అమెరికాలోని భద్రతా అధికారులు పాల్గొన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో చిత్రాలు బహిర్గతమయ్యాయి. ఈ మేరకు 21 మంది అమెరికా భద్రతా అధికారులను గుర్తించినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ వార్తా సంస్థ తెలిపింది. క్యాపిటల్‌ భవనంపై దాడి సమయంలో నిరసనకారులు.. భవనంలోకి చొరబడినప్పుడు వారిని దీటుగా ఎదుర్కొని, బయటకు వెళ్లాలని సూచించిన భద్రతాదళ అధికారి యుగెన్‌ గుడ్‌మ్యాన్‌ను సామాజిక మాధ్యమాల్లో అందరూ ప్రశంసిస్తున్నారు.
సీమ వర్మ రాజీనామా
కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో గత నాలుగేళ్లుగా ట్రంప్‌ బృందంలో సెంటర్స్‌ ఆఫ్‌ మెడికేర్‌ అండ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (సీఎంఎస్‌) అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ఇండియన్‌ అమెరికన్‌ సీమ వర్మ (50) తన పదవికి రాజీనామా చేశారు.


క్యాపిటల్‌పై దాడితో నలుగురికి కరోనా: బైడెన్‌

అమెరికా క్యాపిటల్‌ భవనంపై జనవరి 6న దాడి జరిగినపుడు కరోనా వైరస్‌ భయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రిపబ్లికన్‌ సభ్యులు మాస్కులు ధరించేందుకు నిరాకరించడాన్ని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్‌ తప్పుబట్టారు. ట్రంపు మద్దతుదారులు జరిపిన ఈ దాడిలో అయిదుగురు మృతిచెందగా.. డెమోక్రటిక్‌ నాయకులైన ప్రమీలా జయపాల్‌, బ్రాడ్‌ ష్నీడర్‌, బోనీ వాట్సన్‌ కోల్‌మన్‌తోపాటు యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులు నలుగురికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిందన్నారు. దుండగుల ముఠా పాలనా భవనాన్ని చుట్టుముట్టినపుడు కాంగ్రెస్‌ సభ్యులు మాస్కులు పెట్టుకునేందుకు తిరస్కరించడం చూసి షాకయ్యానంటూ బైడెన్‌ వాషింగ్టన్‌లో విలేకరులకు తెలిపారు. డలవేర్‌ రాష్ట్రానికి చెందిన తనతోటి సభ్యురాలు లిసా బ్లంట్‌ రోచెస్టర్‌ దాడి సమయంలో వారు వద్దంటున్నా అందరికీ మాస్కులు ఇచ్చేందుకు ప్రయత్నించారని, ఆమెను చూసి గర్వపడుతున్నట్టు తెలిపారు. మాస్కులు వద్దన్నదానికి పర్యవసానమే నలుగురు సభ్యులు కరోనా బారినపడటమన్నారు. మాస్కులు పెట్టుకోనివారికి స్పీకర్‌ నాన్సీ పెలోసీ మొదటి అపరాధం కింద 500 డాలర్లు, ద్వితీయ అపరాధం కింద 2,500 డాలర్లు జరిమానాలు విధించినట్లు వెల్లడించారు.


 


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని