
ప్రధానాంశాలు
ప్రభుత్వ రంగంలో 1,33,899 ఉద్యోగాలు
ప్రైవేటు రంగంలో 14 లక్షల కొలువులు
నిజాలను జీర్ణించుకోలేని విపక్షాలు
మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల భర్తీలో తిరుగులేని ప్రగతిని సాధించి దేశంలో మొదటి స్థానంలో ఉందని, నిజాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్, భాజపా, ఇతర విపక్షాలు దుష్ప్రచారానికి పూనుకున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రజలను, యువతను అయోమయానికి, గందరగోళానికి చేస్తున్నాయన్నారు. జానారెడ్డి లాంటి సీనియర్ రాజకీయ నేత కూడా ఈ అసత్యాలను వల్లె వేసేందుకే మొగ్గు చూపడం బాధాకరమని అన్నారు. 2014 నుంచి 2020 వరకు 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. తమ ప్రభుత్వ నిబద్ధతపై ఎవరికైనా అనుమానం ఉంటే ఆయా శాఖల్లో ధ్రువీకరించుకోవచ్చన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే ప్రైవేటు రంగంపైనా దృష్టి సారించామని, విప్లవాత్మకమైన టీఎస్ఐపాస్ విధానంతో ప్రైవేటులో సుమారు 14 లక్షల ఉద్యోగాలను కల్పించామన్నారు. తెరాస హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో ఆయన గురువారం బహిరంగ లేఖను విడుదల చేశారు. వీటిని చూసైనా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు.
కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ నియామకాలు
‘‘తాజాగా సీఎం కేసీఆర్ మరో 50 వేల ఉద్యోగాలను భర్తీకి నిర్ణయం తీసుకుని, ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికల కోడ్ ముగిసిన ముగిసిన వెంటనే ఈ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేస్తాం. కొన్ని పార్టీలు, నాయకులు పనిగట్టుకొని చేసే అసత్య ప్రచారాల ప్రభావానికి యువత లోనుకావద్దు’’ అని కేటీఆర్ కోరారు.
భర్తీ అయిన ఉద్యోగాల జాబితా
‘‘టీఎస్పీఎస్సీ 30,594, రాష్ట్ర పోలీసు నియామక సంస్థ 31,972, రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ 3,623, వ్యవసాయ విశ్వవిద్యాలయం 179, ఉద్యాన విశ్వవిద్యాలయం 80, మైనారిటీ సంక్షేమ శాఖ 66, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 9,355, ఆయుర్వేద, యునాని, హోమియోపతి (ఆయుష్)శాఖ 171, ఇంధనశాఖ పరిధిలోని జెన్కో 856, ట్రాన్స్‌కో 206, ఎన్పీడీసీఎల్164, ఎస్పీడీసీఎల్ 201, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు జెన్కో, ట్రాన్స్‌కో, మరో రెండు సంస్థలు చేపట్టిన నియామకాలు 6,648, విద్యుత్ ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ 22,637, హైదరాబాద్ జలమండలి 807, రాష్ట్ర సహకార బ్యాంకు 243, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు 1,571. భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉన్న ఉద్యోగాలు 6,258లతో మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,32,899’’ అని కేటీఆర్ లేఖలో వెల్లడించారు.
ఉత్తమ ఐటీ మంత్రి కేటీఆర్
తెలంగాణకు 2 స్కోచ్ పురస్కారాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ 2020లో ఉత్తమ ఐటీ మంత్రిగా ప్రతిష్ఠాత్మక స్కోచ్ గ్రూపు సంస్థ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయనకు ఈ అవార్డు లభించడం రెండోసారి. 2016లో ఉత్తమ ఐటీ మంత్రిగా దేశంలో మొదటి స్థానంలో నిలిచి, ఈ అవార్డును పొందారు. హరియాణాలోని గుడ్‌గావ్‌కు చెందిన స్కోచ్ సంస్థ 1997 నుంచి ఏటా పాలన, ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో ప్రభుత్వాలకు, వ్యక్తులకు పురస్కారాలను అందజేస్తోంది. ఈ ఏడాది తెలంగాణకు రెండు ప్రతిష్ఠాత్మక స్కోచ్ పురస్కారాలు లభించాయి. 2020లో తన సేవలతో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు కేటీఆర్‌ను పురస్కారానికి ఎంపిక చేసినట్లు స్కోచ్ ప్రకటించింది. ఇ-పాలనలో ప్రత్యేకతను చాటిన తెలంగాణను (స్టేట్ ఆఫ్ ది ఇయర్)కు ఎంపిక చేసినట్లు తెలిపింది. ‘తెలంగాణ ఐటీ కరోనా సమయంలో ఆధునిక సాంకేతికతలతో కూడిన సేవలను కల్పించింది. రెండుసార్లు తమ పురస్కారాన్ని పొందిన మంత్రి కేటీఆర్‌యే’ అని స్కోచ్ అధ్యక్షుడు సమీర్ కొచ్చర్ తెలిపారు. ఈ పురస్కారాన్ని సంస్థ హైదరాబాద్‌కు పంపించగా.. గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్.. మంత్రికి అందజేశారు. కేటీఆర్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్జాని ఘోష్, సెయింట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డిలు అభినందనలు తెలిపారు.
భారత జట్టుకు కేటీఆర్ అభినందనలు
అహ్మదాబాద్ టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టును కేటీఆర్ అభినందించారు. టెస్టుల్లో 400 వికెట్లు తీసిన అశ్విన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- కార్చిచ్చులా కరోనా
- భారత్‌లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల..!
- India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ