close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆసుపత్రి నిండినది!

ప్రైవేటు వైద్యశాలల్లో వెయిటింగ్‌ లిస్ట్‌
ఇతర రాష్ట్రాల నుంచి వేలమంది రాక
కరోనా రోగులకు ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు దొరక్క విలవిల
ఈనాడు - హైదరాబాద్‌

* గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి. కొవిడ్‌ రోగులకు అందులో 200 పడకలున్నాయి. ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ బెడ్లు అన్నీ కొవిడ్‌ రోగులతో నిండిపోయాయి. 38 మంది వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నారు. పడకలు ఎప్పుడు ఖాళీ అవుతాయోనని పడిగాపులు కాస్తున్నారు.
* రాయదుర్గం సమీపంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలోనూ పడకలు దొరక్క కొవిడ్‌ రోగులు నిరీక్షిస్తున్నారు. ఇక్కడ చేరుతున్న వారిలో దాదాపు 80 శాతంమంది మహారాష్ట్రకు చెందినవారే. అక్కడి నుంచి రావడానికి రూ. 50,000 చెల్లిస్తే కాని అంబులెన్స్‌ దొరకలేదని కొవిడ్‌ రోగి బంధువు ఒకరు తెలిపారు.
* సికింద్రాబాద్‌లో ఓ ప్రముఖ ఆసుపత్రిలో 345 కొవిడ్‌ పడకలు ఉంటే ఒక్కటీ ఖాళీ లేదు. 180 రెగ్యులర్‌, 120 ఆక్సిజన్‌, 45 ఐసీయూ పడకలు.. అన్నీ నిండిపోయాయి. 40 మంది వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నారు. కొందరు తాత్కాలికంగా ఇతర ఆసుపత్రుల్లో చేరి.. ఖాళీ అయితే మెరుగైన చికిత్స కోసం ఇక్కడ చేరాలనుకుంటున్నారు. పడకలు ఖాళీ అయ్యాయా.. అంటూ ఒక్కో రోగి నుంచి రోజుకు రెండు, మూడుసార్లు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి.

హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రులు ఖాళీలేవు. కొవిడ్‌ రోగులు చేరాలంటే పడకలు లభించని పరిస్థితి. కరోనా రెండోదశ ఉద్ధృతి వేగం పెరుగుతుండటంతో మెరుగైన వైద్యం కోసమంటూ చాలామంది కార్పొరేట్‌ చికిత్సకు మొగ్గుచూపుతుండడంతో వాటికి డిమాండ్‌ బాగా పెరుగుతోంది. చాలా ఆసుపత్రుల్లో వెయిటింగ్‌లిస్ట్‌ నమోదవుతోంది. కొన్ని ఆసుపత్రులు పడకల్లేవంటూ కృత్రి కొరత సృష్టిస్తున్నాయనే ఆరోపణలు కూడా వినపిస్తున్నాయి. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకలలో కొవిడ్‌ కేసులు భారీగా నమోదవుతుండటంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రులపై ఆ ప్రభావం పడుతోంది. జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రోగులు నగరంలో మూడు, నాలుగు ఆసుపత్రులు తిరిగితే కాని పడకలు లభించడంలేదు. కొందరు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఒకటి రెండు గంటలపాటు అంబులెన్సులో ఉండి ఎదురుచూస్తున్నారు. జిల్లాల్లోనూ కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పడకలు నిండిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పడకల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర సెలబ్రిటీల నుంచి సిఫార్సులు వస్తున్నాయని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు.

రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సాధారణ పడకలు 5,072 ఉండగా.. ఆక్సిజన్‌ పడకలు, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ పడకలు కలిపి 8,222 ఉన్నాయి. మొత్తం 13,294 పడకల్లో ఇంకా సగం వరకు ఖాళీ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అవన్నీ సాధారణ ప్రైవేటు ఆసుపత్రుల్లోనివే. కార్పొరేట్‌లో మాత్రం దాదాపుగా నిండిపోయాయి. కొందరు కృత్రిమకొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి 30 శాతం!
ఇక్కడి కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేరుతున్న కొవిడ్‌ రోగుల్లో 30 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉంటున్నట్లు అంచనా. ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్‌ నుంచి.. మహారాష్ట్ర.. కర్ణాటకలలోని సరిహద్దు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇటీవల కొవిడ్‌ కేసులు భారీగా నమోదవుతుండటం, ఆసుపత్రులు నిండిపోవడంతో పాటు హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స లభిస్తుందన్న నమ్మకం ప్రధాన కారణాలు. ఏపీలో కరోనా బారినపడ్డ మహిళా ఎమ్మెల్యే ఒకరు గురువారం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరారు. మహారాష్ట్ర సరిహద్దులోని చంద్రాపూర్‌ ఆసుపత్రుల్లో పడకలు దొరక్కపోవడంతో పాటు ఇక్కడ మంచి చికిత్స లభిస్తుందన్న ఉద్దేశంతో హైదరాబాద్‌కు వచ్చామని.. రెండు ఆసుపత్రులు తిరిగాక మూడోచోట పడక దొరికిందని అక్కడి నుంచి వచ్చిన ఓ కొవిడ్‌ రోగి బంధువు ‘ఈనాడు’కు తెలిపారు. విశేషమేమిటంటే.. కొన్ని ఆసుపత్రులు ఇతర రాష్ట్రాల రోగులకే ప్రాధాన్యమిస్తున్నాయి. బిల్లులు తగ్గించాలనో.. డిస్కౌంట్‌ ఇవ్వాలనో ఒత్తిడి చేయరన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది.

వసతులు పెంచడమే పరిష్కారం 

ఆసుపత్రుల్లోని మొత్తం పడకల్లో మూడోవంతు వరకే కొవిడ్‌ చికిత్సకు అనుమతిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి కనీసం 50 శాతం పడకల్లో కొవిడ్‌ చికిత్సకు అనుమతివ్వాలని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు