లాక్‌డౌన్‌ వేళ ఇళ్లలోనే ప్రార్థనలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ వేళ ఇళ్లలోనే ప్రార్థనలు

రంజాన్‌ సందర్భంగా పాతబస్తీపై పోలీసుల ప్రత్యేక దృష్టి
ఫలించిన ముందస్తు ప్రణాళికలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడో రోజు శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మానుష్య వాతావరణం రాజ్యమేలింది. రహదారులపై అక్కడక్కడా వాహనాలు కనిపించాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రాల వద్ద ఉదయం ఆరింటికే జనం బారులు తీరుతున్నారు. చాలా చోట్ల నిర్వాహకులు 9 గంటల నుంచే వినియోగదారుల్ని అనుమతించడం లేదు. తర్వాత పది గంటలకు దుకాణాలు పూర్తిగా మూసివేస్తున్నారు. కూరగాయల మార్కెట్లలో పదింటి వరకు రద్దీ ఉంటోంది. కాలనీల్లో మాత్రం పదకొండు గంటల వరకు జనసంచారం కనిపించింది. శుక్రవారం రంజాన్‌ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్లు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌ ఉదయం నుంచే మసీదుల వద్ద పరిస్థితిని సమీక్షించారు. 2వేల మంది వరకు సిబ్బందితో కీలక ప్రదేశాల్లో బందోబస్తు నిర్వహించారు. జనసంచారం పెరగకుండా ప్రణాళికలు రూపొందించారు. ఉదయం 9.45 గంటలకే డీసీపీ, ఆపై స్థాయి అధికారులు ముఖ్య ప్రాంతాలకు చేరుకొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంపై దృష్టిపెట్టారు. కమిషనర్‌ అంజనీకుమార్‌ చార్మినార్‌, మక్కామసీదు పరిసరాల్లో పర్యటించారు. ఉదయం పది గంటల్లోపు ఈ ప్రాంతాల్లో జనసంచారం కనిపించినా తర్వాత  నిర్మానుష్యంగా మారింది. మసీదుల్లో ఇమామ్‌లు సహా ముగ్గురు, నలుగురు మతపెద్దలు మాత్రమే ఉండి ప్రార్థనలు నిర్వహించారు. మిగతా అంతా ఇళ్లలోనే ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. ముందు నుంచే మతపెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్ని ఇచ్చాయి. కొన్ని మసీదులు, ఈద్గాల వద్ద ఉదయం 10 గంటల వరకు జనసంచారం కనిపించింది. మరోవైపు వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, ఖమ్మం.. తదితర ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది.

కేసుల నమోదు
పోలీసులు లాక్‌డౌన్‌ పరిస్థితుల్ని సమీక్షిస్తూనే మరోవైపు ఉల్లంఘనులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉదయం 10 గంటల తర్వాత అనుమతుల్లేకుండా సంచరిస్తున్న వారిపై, దుకాణాలు మూయని నిర్వాహకులపై, మాస్క్‌లు ధరించని, గుంపులుగా తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టంతో పాటు ఐపీసీ 188 సెక్షన్లను ప్రయోగిస్తున్నారు. ఈ-పెట్టీ కేసులతో పాటు ఈ-టికెట్‌ యాప్‌ ద్వారా కేసులు నమోదు చేస్తున్నారు. తొలిసారి కౌన్సెలింగ్‌తో వదిలేస్తూ.. పునరావృతమైతే వాహనాలను జప్తు చేస్తున్నారు.
4 గంటలు..5,850 వాహనాలు ఎన్‌హెచ్‌-65పై ఉదయం రద్దీ ఇదీ
చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య వాహనాల రద్దీ కొనసాగింది. శుక్రవారం ఈ సమయంలో 5,850 వాహనాలు వెళ్లాయి. వీటిలో దాదాపు 70 శాతం లైట్‌ మోటారు వాహనాలే ఉన్నాయి. ఈ సమయంలో రద్దీ  రెట్టింపు పెరిగినా ఫాస్టాగ్‌ విధానం అమలులో ఉండటంతో వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి. గురువారం రోజు మొత్తం 15 వేల వాహనాలు వెళ్లినట్లు టోల్‌ప్లాజా అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఈ జాతీయ రహదారిపై ఒక రోజులో 50 శాతం వాహనాలు తగ్గాయి. ఉదయం 10 గంటల తర్వాత టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నారు. అనుమతి ఉన్న వాహనాలను, సరకు రవాణా వాహనాలను మాత్రమే పంపిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు