కొవిడ్‌ బాధిత కుటుంబాలకు పింఛన్లు

ప్రధానాంశాలు

కొవిడ్‌ బాధిత కుటుంబాలకు పింఛన్లు

మరణించిన కార్మికుల వారసులకు నెలవారీ చెల్లింపు
ఈఎస్‌ఐ పరిధిలోని వారికే..
నోటిఫికేషన్‌ జారీ

దిల్లీ, ఈనాడు-హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు అనుగుణంగా కార్మికుల కుటుంబాలకు అదనపు ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు ఆదివారం కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు లబ్ధి కలిగించేందుకు కార్మికరాజ్య బీమా (ఈఎస్‌ఐసీ), ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిబంధనల్లో ప్రస్తుతం కొన్ని మార్పులు చేసింది. యజమానులపై అదనపు భారం వేయకుండానే ఈ ఆర్థిక ప్రయోజనం కలిగించనుంది. కార్మికుల్లో భయాందోళనలు తగ్గించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.
ఇవీ నిబంధనలు...
ఈఎస్‌ఐసీ పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులు కరోనాతో మరణిస్తే అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ నెలవారీ పింఛను చెల్లించనున్నట్లు కార్మికశాఖ ప్రకటించింది. కార్మికుని సర్వీసులో సగటు దినసరి వేతనంలో 90 శాతం మేర ఆ కుటుంబ సభ్యులకు పింఛనుగా ఇవ్వనుంది. ప్రస్తుత నిబంధనల మేరకు ఉద్యోగి సర్వీసులో ఉండి, ప్రమాదవశాత్తు మరణిస్తే ఈఎస్‌ఐసీ చట్టంలోని 58వ నిబంధన కింద అర్హులైన కుటుంబ సభ్యులకు ఈఎస్‌ఐసీ పింఛను చెల్లిస్తోంది. ప్రమాదాల్లోనే కాకుండా కరోనాతో చనిపోయిన కార్మికులకు ఈ సదుపాయం వర్తిస్తుందని తాజాగా కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం అమలవుతున్న నిబంధనల మేరకు కార్మికుడి జీవిత భాగస్వామి, వితంతు తల్లికి, పిల్లలకు 25 ఏళ్లు వచ్చేవరకు, ఆడపిల్లలైతే వివాహమయ్యే వరకు ఈ పింఛను ఇస్తోంది. పింఛనుగా నిర్ణయించిన 90 శాతం కార్మికుడి సగటు దినసరి వేతనాన్ని కుటుంబ సభ్యుల మధ్య నిష్పత్తిలో విభజించి చెల్లిస్తోంది. సవరించిన నిబంధన మేరకు కరోనా నిర్థరణకు ముందుగా ఈఎస్‌ఐసీ పోర్టల్‌లో కార్మికుడిపై ఆధారపడిన కుటుంబ సభ్యులుగా నమోదైన వారందరికీ ఈ పింఛను సదుపాయం వర్తింపచేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కార్మికుడికి కరోనా నిర్థరణకు ముందు మూడు నెలలుగా ఈఎస్‌ఐసీ పోర్టల్‌లో కార్మికుడి పేరు నమోదై ఉండాలి. ఉద్యోగంలో చేరి ఏడాదయి ఉండాలి. కనీసం 78 రోజుల బీమా ప్రీమియం చెల్లించినవారికే సదుపాయం వర్తిస్తుంది. ఈ నిబంధనల ప్రకారం అర్హత కలిగి కరోనాతో చనిపోయిన కార్మికుల వారసులకు కార్మికుడి సర్వీసు సగటు రోజు వారీ వేతనంలో 90 శాతం పింఛనుగా లభిస్తుంది. ఈ సదుపాయం 2020 మార్చి 24 నుంచి రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుందని కార్మికశాఖ స్పష్టం చేసింది.
బీమా పరిహారం ఇలా..
ఈపీఎఫ్‌ఓ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగుల డిపాజిట్‌ ఆధారిత బీమా పథకం (ఈడీఎల్‌ఐ) చేయించుకున్న కార్మికుల కుటుంబాలకు చెల్లించే గరిష్ఠ ప్రయోజనాన్ని ఇప్పటికే రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కనిష్ఠ ప్రయోజనం రూ.2.5 లక్షలుగా నిర్ణయించింది. గత ఏడాది నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినట్లుగా ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. రానున్న మూడేళ్లలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఈడీఎల్‌ఐ కింద రూ.2185కోట్ల మేరకు అదనపు ప్రయోజనం కల్పించనున్నట్లు కార్మికశాఖ వెల్లడించింది. ఏడాదికి ఈ పథకం కింద కనీసం 50వేల కుటుంబాలు లబ్ధిపొందే అవకాశముందని, ఇందులో కరోనాతో చనిపోయిన కార్మికుల కుటుంబాలు 10వేల వరకు ఉంటాయని అంచనా.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని