అప్రతిహతంగా ఔషధరంగం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్రతిహతంగా ఔషధరంగం

భారీగా ప్రాణాధార మందుల ఉత్పత్తి
రాష్ట్ర పారిశ్రామిక రంగం వార్షిక నివేదికలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో 2020-21లో ఔషధరంగం అత్యంత ప్రాధాన్యరంగంగా మారింది. కరోనా వేళ ఈ రంగం అప్రతిహత ప్రగతిని సాధించిందని, కరోనా నివారణలో కీలకపాత్ర పోషించిందని ప్రభుత్వ వార్షిక నివేదిక వెల్లడించింది. దీంతో పాటు వైమానిక, ఎలక్ట్రానిక్స్‌, జౌళి, ఆహారశుద్ధి తదితర రంగాల్లో సాధించిన ప్రగతిని వెల్లడించింది. ‘ఔషధరంగంలో తెలంగాణ జాతీయంగా, అంతర్జాతీయంగా ఖ్యాతిని సాధించింది. ప్రాణాధార ఔషధాలైన రెమ్‌డెసివిర్‌, హైడ్రాక్సి క్లోరోక్విన్‌, ఫావిపిరవిర్‌ల ఉత్పత్తిని తెలంగాణలోని పరిశ్రమలు పెద్దఎత్తున పెంచి, దేశ, విదేశాలకు ఎగుమతి చేశాయి. హైదరాబాద్‌లో రూపొందించిన మొట్టమొదటి ఆర్‌టీపీసీఆర్‌ కిట్‌ను ఐసీఎంఆర్‌ ఆమోదించింది. ఆ తర్వాత చాలా సంస్థలు పీసీఆర్‌ కిట్లతో పాటు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లను, ఇతర పరికరాలను ఉత్పత్తి చేశాయి. రాష్ట్రానికి చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ కరోనాకు తొలి టీకా కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేసింది. బయోలాజికల్‌-ఇ తదితర సంస్థలు సైతం టీకాల అభివృద్ధికి ముందుకొచ్చాయి. జినోమ్‌వ్యాలీ టీకాల రాజధానిగా మరోసారి నిరూపించుకుంది. దేశంలోని అయిదు టీకాల తయారీ సంస్థల్లో నాలుగు ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తున్నాయి’ అని తెలిపింది. ప్రగతి నివేదికలోని మరిన్ని అంశాలు ఇలా..
2020-21లో అమీన్‌పూర్‌లోని వైద్యపరికరాల పార్కులో 19 పరిశ్రమలు కొత్తగా ప్రారంభమయ్యాయి. రూ. 204 కోట్ల పెట్టుబడులతో 2400 మందికి ఉపాధి కల్పించాయి. హైదరాబాద్‌కు చెందిన లక్సాయి జీవశాస్త్రాల సంస్థ రూ.440 కోట్లు, గ్రాన్యూల్స్‌ ఇండియా రూ.400 కోట్లు, లారస్‌ ల్యాబ్స్‌ రూ.300 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. మెడ్‌ట్రానిక్స్‌ సంస్థ రూ.1200 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించింది. సాయి లైఫ్‌సైన్సెస్‌ సంస్థ సైతం 83 వేల చదరపు అడుగుల్లో కొత్త ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. జినోమ్‌వ్యాలీ రెండో దశ, బయో హబ్‌ పనులు ప్రారంభమయ్యాయి.  

విద్యుత్తు వాహనాల తయారీ
ఈ ఏడాది ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలను పెద్దఎత్తున ఉత్పత్తి చేసేందుకు 2020-30కి ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. కొత్త విధానం ప్రకటించిన రోజే ఆరు సంస్థలు రూ.4500 కోట్ల మేర పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఫియట్‌ క్రిస్లర్‌ సంస్థ రూ. 1100 కోట్లతో హైదరాబాద్‌లో గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ ఏర్పాటుకు నిర్ణయించింది.
కాకతీయ జౌళిపార్కులో పరిశ్రమలు
జౌళి రంగంలోనూ ఆశాజనక ఫలితాలు వచ్చాయి. వెల్‌స్పన్‌ సంస్థ రంగారెడ్డి జిల్లాలో రూ.415 కోట్లతో కొత్త ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. వరంగల్‌ కాకతీయ జౌళి పార్కులో గణేశ ఎకోస్పియర్‌ సంస్థ రూ.500 కోట్లతో రెండు పరిశ్రమల నిర్మాణాలు చేపట్టింది. యంగ్యావన్‌ సంస్థ ఒకేసారి ఎనిమిది పరిశ్రమలను ప్రారంభించే దిశగా పనులు చేపట్టింది. సిరిసిల్ల మండలం పెద్దూరులో 83 ఎకరాల్లో మరమగ్గాల పార్కు పనులు ప్రారంభమయ్యాయి. 4416 మరమగ్గాల ఏర్పాటుకు 50 పారిశ్రామిక షెడ్లు నిర్మించారు. 60 వార్పింగ్‌ యంత్రాలు, ఇతర సౌకర్యాలను కల్పించారు.
2020-21లో తెలంగాణలో తమ పరిశ్రమలను ప్రారంభిస్తామని ప్రసిద్ధ వైమానిక తయారీ సంస్థలు బోయింగ్‌, సఫ్రాన్‌లు ప్రకటించాయి. రాష్ట్రంలోని పార్కులు, సెజ్‌లలో వైమానిక ఉత్పత్తులు ముమ్మరమయ్యాయి.
తెలంగాణకు చెందిన మేధో సర్వో డ్రైవ్స్‌ సంస్థ రూ. 100 కోట్లతో దేశంలో ప్రైవేటు రంగంలో అతిపెద్ద రైల్వేకోచ్‌ల కర్మాగార నిర్మాణాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 2200 మందికి ఉపాధి లభించనుంది.
డాటా, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు
అమెజాన్‌ డాటా సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ. 20761 కోట్లతో చేపట్టిన మూడు డాటా కేంద్రాల పనులు ప్రారంభమయ్యాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) రూ. 500 కోట్లతో స్మార్ట్‌ డాటా సెంటర్‌ను ప్రకటించింది. సేల్స్‌ఫోర్స్‌ సంస్థ రూ. 1,119 కోట్ల పెట్టుబడితో వచ్చే అయిదేళ్లలో 2500 మందికి ఉపాధిని, గోల్డ్‌మన్‌ సాచ్స్‌, మసాచుసెట్స్‌ మ్యూచువల్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ (మాస్‌ మ్యూచువల్‌) గ్లోబల్‌ సంస్థలు తమ ప్రాంగణాల ఏర్పాటును ప్రకటించాయి. ఒప్పో సంస్థ తమ మొట్టమొదటి 5జి ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ప్రారంభించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని