కరోనా మృతుల కుటుంబాలకు ఈఎస్‌ఐ పింఛను

ప్రధానాంశాలు

కరోనా మృతుల కుటుంబాలకు ఈఎస్‌ఐ పింఛను

ఈనాడు, దిల్లీ: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ కింద నమోదైన కార్మికులు కరోనాతో చనిపోయి ఉంటే.. వారు పొందే వేతనంలో 90% మొత్తాన్ని రెండేళ్లపాటు వారి కుటుంబసభ్యులకు పింఛనుగా అందించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. బుధవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2020 మార్చి 24 నుంచి ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయనున్నట్లు పేర్కొన్నారు. ‘ఈ బీమా పరిధిలో ఉన్న కార్మికులు తనకు కొవిడ్‌ సోకడానికి 3నెలల ముందుగానే ఈఎస్‌ఐసీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. కరోనా సోకినట్లు గుర్తించిన నాటికి ఉద్యోగంలో ఉండటంతోపాటు, అంతకుముందు 70 రోజులు ఈఎస్‌ఐ చందా చెల్లించి ఉండాలి. మహిళా ఉద్యోగి మరణిస్తే పింఛను ఆమె భర్తకు లభిస్తుంది. వితంతు భార్య పింఛను తీసుకొనే నాటికి మరొకరిని వివాహం చేసుకున్నా కొవిడ్‌ పింఛను కొనసాగుతుంద’ని మంత్రి వివరించారు.

తెలంగాణలో 63.1%, ఏపీలో 70.2% సిరో పాజిటివిటీ రేటు

భారత వైద్య పరిశోధన మండలి ఇటీవలి సిరో సర్వేలో  తెలంగాణలో 63.1%, ఏపీలో 70.2% సిరో పాజిటివిటీ రేటు వచ్చినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. తెలంగాణలో 1,373, ఏపీలో 1,260 మందిని పరీక్షించినట్లు తెలిపింది. స్థానికంగా ప్రజారోగ్యపరమైన చర్యలు తీసుకోవడానికి, జిల్లాస్థాయి పరిస్థితులను తెలుసుకోవడానికి రాష్ట్రాలు సైతం సిరో సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

విద్యుత్‌ కేంద్రాలకు తగ్గుతున్న బొగ్గు సరఫరా

రాష్ట్రంలోని 7 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా ఏటా తగ్గుతున్నట్లు లోక్‌సభలో ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ సమాధానం ఇచ్చారు.

పెరుగుతున్న న్యాయాధికారుల ఖాళీలు

తెలుగు రాష్ట్రాల్లో జిల్లాస్థాయి న్యాయవ్యవస్థలో పనిచేసే న్యాయాధికారుల ఖాళీలు ఏటేటా పెరుగుతూ పోతున్నాయి. జులై 22 నాటికి ఏపీలో 113, తెలంగాణలో 96 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజూ బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.

మోటుమర్రి-విష్ణుపురం మధ్య ప్రయాణికుల రైళ్లు సాధ్యంకాదు

మోటుమర్రి-విష్ణుపురం సెక్షన్‌లో ప్రయాణికుల రైళ్లు నడపడం సాధ్యం కాదని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సెక్షన్‌ ప్రయాణికుల రైళ్లు నడపడానికి అనువుగా లేదని, అందువల్ల ఇక్కడ అలాంటి రైలు సేవలు అందుబాటులోకి తేవడం సాధ్యం కాదన్నారు.

పెట్రో ఉత్పత్తులతో ఖజానాకు రూ.6.71 లక్షల కోట్ల ఆదాయం

పెట్రో ఉత్పత్తుల విక్రయాల ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్రాల ఖజానాలకు రూ.6,71,461 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. బుధవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌తోపాటు, పలువురు సభ్యులు అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ‘పెట్రో ఉత్పత్తుల అమ్మకం ద్వారా 2016-17లో రూ.5,24,945 కోట్ల మేర ఉన్న ఆదాయం ఐదేళ్లలో 27% పెరిగి రూ.6,71,461 కోట్లకు చేరింద’ని మంత్రి వివరించారు. ‘పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌, కేంద్ర ప్రభుత్వం సెస్‌, ఎక్సైజ్‌ సుంకాలు విధిస్తున్నాయి. పెట్రో ఉత్పత్తులపై వసూలు చేసే సెస్‌ మౌలిక వసతులు, ఉపాధి కల్పనకు ఉపయోగిస్తున్నామ’ని మంత్రి వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని