వైద్య విద్య అఖిల భారత కోటాలో 27% ఓబీసీలకు 10% ఈడబ్ల్యూఎస్‌కు

ప్రధానాంశాలు

వైద్య విద్య అఖిల భారత కోటాలో 27% ఓబీసీలకు 10% ఈడబ్ల్యూఎస్‌కు

రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

5,550 మందికి ప్రయోజనం
ఈనాడు, దిల్లీ

రాష్ట్రాల్లోని అన్నిరకాల వైద్య విద్య ప్రవేశాల్లో అఖిల భారత కోటాలోకి వచ్చే సీట్లలో వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) 27%, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) 10% రిజర్వేషన్లు వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ రిజర్వేషన్లు ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌, డిప్లొమా, బీడీఎస్‌, ఎండీఎస్‌ కోర్సుల్లో 2021-22 విద్యా సంవత్సరం నుంచే వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించారు. ఈ నిర్ణయం కారణంగా ఎంబీబీఎస్‌ కోర్సుల్లో 1,500 మంది ఓబీసీ, 550 మంది ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు; పీజీ కోర్సుల్లో 2,500 ఓబీసీ, 1,000 మంది ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రం పేర్కొంది. మొత్తంగా 5,550 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది.

ప్రతిభావంతులకు అవకాశాలు అందించాలని ప్రతిభావంతులైన విద్యార్థులు స్థానికతతో సంబంధం లేకుండా, ఏ రాష్ట్రంలోని వైద్య కళాశాలలోనైనా చదువుకునేందుకు వీలుగా... సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి 1986లో వైద్య విద్య ప్రవేశాల్లో అఖిల భారత కోటాను ప్రవేశపెట్టారు. దీని పరిధిలోకి ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో 15%, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో 50% సీట్లు వస్తాయి. అయితే- 2007 వరకూ ఈ అఖిల భారత కోటా కింద ఏ రిజర్వేషన్లనూ అమలు చేయలేదు. ఆ ఏడాది సుప్రీంకోర్టు ఈ కోటాలో 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు సీట్లు కేటాయించాలని ఆదేశించింది. 2007 నుంచి అమల్లోకి వచ్చిన ‘కేంద్ర వైద్య సంస్థల (ప్రవేశాల్లో రిజర్వేషన్ల) చట్టం’ కింద సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌, లేడీ హార్డింగ్‌ మెడికల్‌ కాలేజీ, అలిగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేశారు. ఆ ప్రయోజనాన్ని రాష్ట్రాల్లోని వైద్య, దంతవైద్య కళాశాలల్లోని ఆలిండియా కోటా సీట్లకు వర్తింపజేయలేదు. ఈ విషయమై వివిధ ఓబీసీ సంఘాల నాయకులు, ఎంపీలు ఇటీవల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయం వెలువడింది.

ఓబీసీ కేంద్ర జాబితా ప్రకారమే

ఈ రిజర్వేషన్ల వర్తింపునకు ఓబీసీ కేంద్ర జాబితాను అనుసరిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ల కోసం 2019-20, 2020-21 సంవత్సరాల్లో అన్‌-రిజర్వ్‌డ్‌ సీట్లను పెంచినందున రిజర్వ్‌డ్‌ కేటగిరీ సీట్లు తగ్గవని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. గత ఆరేళ్లలో దేశంలో ఎంబీబీఎస్‌ సీట్లు 54,348 నుంచి 84,649 (56%)కి, పీజీ సీట్లు 30,191 నుంచి 54,275 (80%)కి పెరిగినట్టు కేంద్రం తెలిపింది. 179 కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పినట్లు వివరించింది. దీనివల్ల దేశంలో ఈ కళాశాలలసంఖ్య 558 (ప్రభుత్వం 289, ప్రైవేటు 269)కి చేరినట్లు వెల్లడించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని