కోర్టులనే అనుమానిస్తారా?

ప్రధానాంశాలు

కోర్టులనే అనుమానిస్తారా?

ఎంపీ రఘురామకు తెలంగాణ హైకోర్టు ప్రశ్న
సీబీఐ కోర్టు నుంచి పిటిషన్‌ బదిలీ చేయాలనడంపై వ్యాఖ్య
ఉత్తర్వులు నేటికి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: నిందితులు ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతించినంత మాత్రాన కోర్టులనే అనుమానిస్తారా అని ఎంపీ రఘురామ కృష్ణరాజును తెలంగాణ హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. పరిస్థితులకు అనుగుణంగా నిందితులకు విదేశాలకు వెళ్లడానికి ప్రత్యేక కోర్టులు అనుమతించడం సాధారణమేనని వ్యాఖ్యానించింది. అంతమాత్రాన కోర్టులను సందేహిస్తూ కేసు బదిలీ చేయాలని ఎలా కోరతారంటూ... బదిలీకి సరైన కారణాలు చెప్పాలని పేర్కొంది. అక్రమాస్తుల కేసులో నిందితులైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిలు రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్లను ప్రధాన సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి అనుమతించిన న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మధ్యాహ్నం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌.శ్రీవెంకటేశ్‌ వాదనలు వినిపిస్తూ విదేశీ పర్యటన కోసం విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసిందన్నారు. ఈ కేసుల్లో పారదర్శకంగా విచారణ కొనసాగడం లేదని, రోజువారీ విచారణ కొనసాగించాల్సి ఉండగా నిందితులు కోరినట్లు వాయిదాలు వేస్తున్నారన్నారు. ఇవన్నీ అనుమానాస్పదంగా ఉన్నందున పిటిషన్లను బదిలీ చేయాలన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ... ఊహాజనిత కారణాలతో బదిలీ కోరుతున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తర్వులను బుధవారం జారీ చేస్తామంటూ వాయిదా వేశారు.

కోర్టు ధిక్కరణ కేసులో ముగిసిన వాదనలు

సాక్షి మీడియాపై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలుచేసిన కోర్టుధిక్కరణ కేసుపై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు బుధవారం ఉత్తర్వులు వెలువరించనున్నారు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, ఇందూ గృహనిర్మాణ మండలి వ్యవహారాల్లో సీబీఐ నమోదుచేసిన కేసుల్లో ప్రధాన నిందితులైన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయడానికి సీబీఐ గడువు కోరడంతో కోర్టు అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసు ఈ నెల 20కి, ఇందూ గృహనిర్మాణ మండలిపై కేసును బుధవారానికి వాయిదా వేసింది.


బెయిలు రద్దు పిటిషన్లపై నేడు తీర్పు

క్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిలు రద్దు చేయలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని