శాసనసభ కుస్తీ పోటీలకు కాదు

ప్రధానాంశాలు

శాసనసభ కుస్తీ పోటీలకు కాదు

అర్థవంతమైన చర్చలకు వేదిక

ప్రభుత్వంతో పాటు విపక్షాల అంశాలపైనా మాట్లాడదాం

బడ్జెట్‌ సమావేశాల నుంచి ప్రైవేటు మెంబర్‌ బిల్లులను పరిశీలించాలి

బీఏసీ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

అయిదో తేదీ వరకు సభ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, శాసనసభ నిర్వహణలోనూ అదే ఒరవడి కొనసాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. గౌరవ మర్యాదలతో సభ సాగాలన్నారు. గొప్ప సంప్రదాయాలు నెలకొల్పడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆలోచన చేయాలన్నారు. వీలయినన్ని ఎక్కువ రోజులు సభను నడిపించాలని, అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించాలని అన్నారు. ప్రభుత్వం తరఫున సూచించిన పరిశ్రమలు, ఐటీ, హరితహారం, వ్యవసాయం, పాతబస్తీ అభివృద్ధి, మైనారిటీలు అనే అంశాలతో పాటు ప్రతిపక్షం చర్చించాలనుకున్న వాటిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. శుక్రవారం శాసనసభ వాయిదా అనంతరం కమిటీ హాలులో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభా కార్యకలాపాల కమిటీ (బీఏసీ) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శాసనసభ ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలకు వేదిక మాత్రమేనని, కుస్తీ పోటీలకు కాదనే విషయాన్ని సభ్యులు గుర్తుంచుకోవాలన్నారు.

శాసనసభలోనూ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌

పార్లమెంటులో మాదిరి శాసనసభలో కూడా కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ని ఏర్పాటు చేయాలని, తద్వారా నూతన సభ్యులకు, మాజీ సభ్యులకు కార్యశాలలు, బోధనకోసం వేదికను కల్పించాలని సీఎం కేసీఆర్‌ స్పీకర్‌కు సూచించారు. త్వరలోనే క్లబ్‌ నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని, పార్టీలకతీతంగా శాసనసభ్యులను తీసుకొని సభాపతి దిల్లీ పర్యటన చేపట్టాలని కోరారు. ‘‘ప్రతి రోజు ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్‌, వాయిదా తీర్మానాల వంటి సంప్రదాయాలను విధిగా పాటిస్తూ సభ జరగాలి. బిల్లులను సభ్యులకు ముందుగా పంపించాలి. సభ్యులకు గౌరవమర్యాదల నిబంధనలను పాటించేలా సభాపతి చర్యలు చేపట్టాలి. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రతి శుక్రవారం ప్రయివేటు మెంబర్‌ బిల్లుపై చర్చ జరిగే అంశాన్ని పరిశీలించాలి. రూల్‌ బుక్‌ను సమీక్షించాలి. శాసనసభా కమిటీ సమావేశాలు క్రమంతప్పకుండా జరగాలి. వీలైతే కమిటీలు దేశంలో, బయటి దేశాల్లో పర్యటనలు చేపట్టాలి. నూతన అంశాలను నేర్చుకునేలా అవి సాగాలి’’ అని కేసీఆర్‌ సూచించారు.

మరో ఏడు పనిదినాలు

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల అయిదో తేదీ వరకు జరగనున్నాయి. సెలవులు పోనూ ఏడు పనిదినాలుంటాయి. బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఉపసభాపతి పద్మారావు, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్‌ ఒవైసీ ఇందులో పాల్గొన్నారు. ఈనెల 25, 26 (శని, ఆదివారాలు) తేదీల్లో, అక్టోబరు 2న(గాంధీ జయంతి), 3వ తేదీ(ఆదివారం) సభకు సెలవు దినాలు. 8 పనిదినాల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 20 రోజుల పాటు నిర్వహించాలని, 12 అంశాలపై చర్చించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. అందుకు సంబంధించిన జాబితాను సంఘానికి అందజేశారు. చర్చించాల్సిన అంశాలపై అన్ని పక్షాల నుంచి జాబితా రావాలని స్పీకర్‌ సూచించారు. అంశాల ఆధారంగా మరోసారి బీఏసీ సమావేశం నిర్వహిద్దామని, అవసరమైనన్ని రోజులు సభను జరుపుతామని తెలిపారు. బీఏసీ సమావేశానికి ఆహ్వానం అందలేదని భాజపా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనమండలి సమావేశాలు సైతం వచ్చే నెల అయిదో తేదీ వరకు జరగనున్నాయి. ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో దీనిని నిర్ణయించారు.


దిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. మూడురోజులపాటు కేంద్ర మంత్రులతో జరిగే వివిధ సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన ఇక్కడికొచ్చారు. ఆయనతోపాటు రాష్ట్ర ప్రణాళికామండలి ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ దిల్లీ చేరుకున్నారు. హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రికి తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఇక్కడి ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి శనివారం కేంద్ర మంత్రులు షెకావత్‌, పీయూష్‌ గోయల్‌లను కలిసే అవకాశం ఉంది. ఆదివారం హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో జరిగే వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారని అధికార వర్గాలు చెప్పాయి.


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని