పల్లకీనెక్కి ఉరికంబానికి..

ప్రధానాంశాలు

పల్లకీనెక్కి ఉరికంబానికి..

తెల్లదొరల జ్యుడీషియల్‌ హత్య

గవర్నర్‌ జనరల్‌పై అవినీతి ఆరోపణలు చేసినందుకు ఉరికంబం ఎక్కాడో భారతీయుడు. భారత్‌లో తెల్లదొరలు అమలు చేసిన తొలి ఉరిశిక్షే కాకుండా.. న్యాయస్థానం చేసిన హత్యగా (జ్యుడీషియల్‌ మర్డర్‌) దీన్ని అభివర్ణిస్తుంటారు.

నందకుమార్‌... బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ నవాబ్‌ వద్ద పనిచేసేవారు. పదిహేడో మొఘల్‌ చక్రవర్తి షా ఆలమ్‌ ఈయనకు మహారాజ బిరుదిచ్చారు. ప్లాసీ యుద్ధంలో బెంగాల్‌ నవాబు ఓటమి తర్వాత నందకుమార్‌ బ్రిటిష్‌వారి వద్ద చేరారు. ఈస్టిండియా కంపెనీ తరఫున బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో పన్నులు వసూలు చేసేందుకు ఈయన్ను 1764లో దివాన్‌గా నియమించారు. అప్పటిదాకా ఆ పదవిలో ఉన్న వారెన్‌ హేస్టింగ్స్‌ను తొలగించి మరీ మహారాజా నందకుమార్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు.

అలా వెళ్లిన హేస్టింగ్స్‌ 1773లో ఏకంగా బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా వచ్చాడు. బెంగాల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లోని సభ్యులకు (అంతా తెల్లవారే) హేస్టింగ్స్‌కు సరిపడేది కాదు. ఈ సమయంలోనే నందకుమార్‌ గవర్నర్‌ జనరల్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. హేస్టింగ్స్‌ భారీస్థాయిలో (సుమారు పది లక్షల రూపాయలు) ముడుపులు తీసుకున్నట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు. నందకుమార్‌ ఆరోపణలను పరిశీలించిన బెంగాల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు కూడా హేస్టింగ్స్‌పై విచారణకు మద్దతిచ్చారు. కానీ గవర్నర్‌ జనరల్‌ హోదాలో హేస్టింగ్స్‌ వీరి ఆరోపణలను కొట్టిపారేశారు. అంతటితో ఆ వ్యవహారం సద్దుమణిగిందనుకున్నా... హేస్టింగ్స్‌ వదల్లేదు. కొన్నాళ్ల తర్వాత 1775లో మహారాజా నందకుమార్‌పై దస్తావేజు ఫోర్జరీ కేసు పెట్టించి విచారణ జరిపించారు. చీఫ్‌ జస్టిస్‌ ఎలిజా ఇంపే ఈ కేసును విచారించి నందకుమార్‌కు ఉరిశిక్ష విధించారు. 1775 ఆగస్టు 5న నందకుమార్‌ను ఉరితీశారు. ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉరికంబమెక్కిన తొలి భారతీయుడు మహారాజ నందకుమారే! ఆగస్టు 5న జైలు నుంచి ఉరితీసే చోటికి తీసుకువస్తుంటే... నవ్వుతూ పల్లకీ ఎక్కి వచ్చారని శిక్ష అమలును పర్యవేక్షించిన కోల్‌కతా షరీఫ్‌ అలెగ్జాండర్‌ మక్రబీ రాశారు. ఈస్టిండియా పాలనలో తొలి ఉరిశిక్షను చూసి భయపడ్డ చాలామంది ప్రజలు బెంగాల్‌ నుంచి బనారస్‌కు పారిపోయారు.


ఆ ఇద్దరికీ అభిశంసన 

ఈ శిక్షపై లండన్‌లోనూ దుమారం చెలరేగింది. నందకుమార్‌కు ఉరి విధించిన ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్‌ జనరల్‌ హేస్టింగ్స్‌- చిన్ననాటి స్నేహితులు కావటం గమనార్హం! బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదించిన 1728నాటి ఫోర్జరీ చట్టం ప్రకారం నందకుమార్‌కు ఉరి శిక్ష విధిస్తున్నట్లు చీఫ్‌ జస్టిస్‌ తన తీర్పులో పేర్కొన్నారు. నిజానికి ఆ చట్టం బ్రిటన్‌కే పరిమితం. భారత్‌లో వర్తించదనేది నిపుణుల మాట! తన స్నేహితుడి (హేస్టింగ్స్‌) కోసం చీఫ్‌ జస్టిస్‌ ఈ తీర్పు ఇచ్చారని ఆరోపించారు. పదవి నుంచి దిగి స్వదేశానికి తిరిగి వెళ్లాక కూడా హేస్టింగ్స్‌, చీఫ్‌ జస్టిస్‌ ఎలిజా ఇంపేలను ఈ కేసు వెంటాడింది. ఈ కేసు ఆధారంగా బ్రిటన్‌ పార్లమెంటు ఈ ఇద్దరినీ అభిశంసించింది. ‘‘ఇంగ్లాండ్‌ గౌరవమర్యాదలను మంటగలిపినందుకు యావత్‌ ఇంగ్లాండ్‌ తరఫున, భారత ప్రజల హక్కులను కాలరాసినందుకు భారతీయులందరి తరఫున, న్యాయాన్ని హత్యచేసి, మానవత్వాన్ని మంటగలిపినందుకు సకల మానవాళి తరఫున వీరిని నేను అభిశంసిస్తున్నాను’’ అంటూ బ్రిటన్‌ పార్లమెంటు సభ్యుడు రిచర్డ్‌ బర్క్‌ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని