మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి

ప్రధానాంశాలు

మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి

వారి ఏరివేతకు దాడులను ఉద్ధృతం చేయాలి  
సీఎంల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
దేశంలో వామపక్ష తీవ్రవాదం తగ్గుతోందని వ్యాఖ్య

దిల్లీ: వామపక్ష తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. ఈ అంశంలో ఆయన రెండంచెల పోరును ప్రతిపాదించారు. మావోయిస్టుల కోసం వేటను ఉద్ధృతం చేయడంతో పాటు, వారి ఆర్థిక మూలాలనూ దెబ్బతీయాలని పేర్కొన్నారు. వారికి నిధులొచ్చే మార్గాలను మూసివేయాలని, ఇందుకోసం రాష్ట్రాలు ఈడీ, ఎన్‌ఐఏ లాంటి కేంద్ర సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. మావోయిస్టులకు అనుబంధంగా పనిచేస్తున్న సంఘాల విషయంలో ఉదాసీనత పనికిరాదని, కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. దేశంలో వామపక్ష తీవ్రవాదంపై అమిత్‌ షా.. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన 10 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులతో ఆదివారం దిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో ఒడిశా, తెలంగాణ, బిహార్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ సీఎంలు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, కేరళ తరఫున మంత్రులు, ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు. దాదాపు మూడు గంటలసేపు జరిగిన ఈ సమీక్షలో.. మావోయిస్టుల హింసకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలపై షా సూచనలు చేశారు.

దేశంలో వామపక్ష తీవ్రవాదం విషయంలో రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై హోంమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మావోయిస్టుల హింస గణనీయంగా తగ్గిందన్నారు. అయితే ఇప్పటివరకు సాధించిన విజయాలతో తృప్తి చెందకుండా.. ఈ తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలన్నారు. మిగిలిన కొద్దిమందిని కూడా ఏరివేయాలని రాష్ట్రాలకు సూచించారు. మావోయిస్టుల కారణంగా.. ఈ ఏడాది 200 హింసాత్మక ఘటనలు మాత్రమే జరిగాయి. అత్యధికంగా 2009లో 2,258 కేసులు నమోదయ్యాయి. అప్పటితో పోలిస్తే వామపక్ష తీవ్రవాద హింస దాదాపు 70% తగ్గింది. వారి ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా తగ్గుతోంది. 2010లో 96 జిల్లాల్లో కార్యకలాపాలు కొనసాగితే.. ఇప్పుడు ఆ సంఖ్య 53కి పరిమితమైంది. ఈ గణాంకాలను హోంమంత్రిత్వశాఖ విడుదల చేసింది.

వచ్చే 18 నెలల్లో 2,542 మొబైల్‌ టవర్లు

మావోయిస్టుల ఏరివేతలో సమాచార సేకరణ కీలకమని అమిత్‌ షా అన్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో 2,542 టవర్లను వచ్చే 18 నెలల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలో 3,114 పోస్టాఫీసులను తెరుస్తామని పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో విద్యపై కూడా దృష్టి పెట్టామని, ఇందుకోసం మరిన్ని ఏకలవ్య పాఠశాలల తెరుస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, గిరిరాజ్‌ సింగ్‌, అర్జున్‌ ముండా, నిత్యానంద్‌ రాయ్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ అరవింద్‌కుమార్‌.. ఇతర కేంద్ర, రాష్ట్ర సీనియర్‌ పోలీసు, పౌర అధికారులు పాల్గొన్నారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని