close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
18 ఏళ్లుదాటిన వారికి ఉచితం కాదు

 ఒకవేళ చేయాలంటే రాష్ట్రాలే భరించాలి
సగం భారాన్ని దించుకున్న కేంద్రం
 బహిరంగ మార్కెట్‌లో పెరగనున్న పోటీ

ఈనాడు, దిల్లీ: మే 1 నుంచి టీకా తీసుకోవడానికి 18 ఏళ్ల పైబడిన వారందరూ అర్హులేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో.. వీరికీ ఇప్పటిలాగే ఉచితంగా వ్యాక్సిన్‌ అందుతుందేమోనని అందరూ భావించారు. కానీ ప్రభుత్వ ప్రకటనను తరిచిచూస్తే అందులో ఉన్న గూడార్థం బోధపడుతుంది. 18 ఏళ్లపైబడిన వారు వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటే బహిరంగ మార్కెట్లో కొనాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలనేది ఆ ప్రకటన సారాంశం. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో కేంద్రీకృతంగా జరుగుతున్న వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం నుంచి కేంద్ర ప్రభుత్వం కొంతమేర తప్పుకొంది. 50% భారాన్ని తాను తీసుకొని మిగిలిన 50% భారాన్ని రాష్ట్రాలపైకి నెట్టేసింది. దీనివల్ల తమ రాష్ట్ర పరిధిలోని ప్రజల డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యతను ఇక రాష్ట్ర ప్రభుత్వాలు మోయాల్సి ఉంటుంది.
‘‘కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఇదివరకటిలాగానే కొనసాగుతుంది, వైద్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 45 ఏళ్లపైబడిన వారికే ఉచితంగా టీకా అందిస్తాం’’ అని కేంద్రం సోమవారం జారీచేసిన ప్రకటనలో పేర్కొంది. 18 ఏళ్లపైబడిన వారందర్నీ కేంద్రం అర్హులుగా ప్రకటించింది తప్పితే వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తానని చెప్పలేదు. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టింది. వ్యాక్సిన్‌ సంస్థలకు మార్కెట్‌ను తెరవడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రం ప్రకటన వల్ల రాష్ట్రాల్లో ప్రజలు తమకు టీకా ఇవ్వాలని స్థానిక యంత్రాంగాలపై ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు రాష్ట్రాలు సొంత డబ్బుపెట్టి వ్యాక్సిన్‌ కొనాల్సి వస్తుందనేది నిపుణుల అభిప్రాయం. టీకా ఉత్పత్తి సంస్థలు తమ ఉత్పత్తిలో 50% మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగ మార్కెట్‌కు ముందుగా నిర్ధారించిన ధర ప్రకారం విక్రయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. అందులో రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి, బహింగ మార్కెట్‌కు ఎంత సరఫరా చేయాలన్న స్పష్టమైన లక్ష్మణ రేఖలు గీయలేదు. అందువల్ల అందుబాటులో ఉండే ఆ 50% కోసం రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు, కార్పొరేట్‌ సంస్థలు పోటీపడితే ధరలు పెరిగిపోయి సామాన్యుడు కొనలేని స్థితి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

అవి నేరుగా అమ్ముకోవచ్చు..

కేంద్రం సోమవారం చేసిన ప్రకటన ప్రకారం.. భారత్‌లో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసే సంస్థలు మాత్రమే 50% కేంద్రానికి ఇచ్చి, మిగిలిన 50% రాష్ట్రాలు, బహిరంగ మార్కెట్లకు అమ్ముకోవచ్చు. అలా కాకుండా పూర్తిగా విదేశాల్లోనే తయారుచేసుకొని, రెడీటు యూజ్‌ కింద భారత్‌కు తీసుకొచ్చే వ్యాక్సిన్‌ను వాటి తయారీదారులు ప్రభుత్వాలకు ఇవ్వకుండా నేరుగా పూర్తిగా బహిరంగ మార్కెట్‌లోనే అమ్ముకొనే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల మెడెర్నా, ఫైజర్‌, స్పుత్నిక్‌-వి, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌లాంటి విదేశీ వ్యాక్సిన్లు పూర్తిగా విదేశాల్లోనే తయారై వయల్స్‌ రూపంలో భారత్‌లోకి దిగుమతి అయితే మాత్రం ఆ సంస్థలు ప్రభుత్వానికి ఇవ్వకుండా పూర్తిగా బహిరంగ మార్కెట్‌లో ముందుగా ప్రకటించిన ధరకు అమ్ముకొనే వీలుంటుంది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌తో పోటీపడి ప్రజలకు వ్యాక్సిన్‌ కొనుగోలుచేసి అందించడమో, లేదంటే చేతులెత్తేయడమో చేయాల్సి వస్తుందన్న ఆందోళన ఉంది. ఇప్పటివరకూ వ్యాక్సిన్‌ కార్యక్రమం అంతా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే సాగింది. ఇప్పుడా పరిస్థితి మారిపోతుంది. తాజా మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కేవలం 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించడానికే పరిమితం కానుంది. మిగిలిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలుకానీ, లేదంటే ప్రజలే సొంతంగా డబ్బులు పెట్టికానీ వ్యాక్సిన్‌ సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

కేంద్రానిది వివక్షపూరిత టీకా విధానం

విపక్షాల ధ్వజం

దిల్లీ: పద్దెనిమిదేళ్లు దాటిన వారికి టీకా ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధానం వివక్షా పూరితంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. కొవిడ్‌ కట్టడి, టీకా పంపిణీ విషయంలో మోదీ సర్కారు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య, ధనిక-పేదల మధ్య అసమానతలు మరింతగా పెరిగిపోతాయని మండిపడ్డారు. 18-45 ఏళ్ల మధ్య వయస్కుల వారికి ఉచితంగా టీకా ఇవ్వకపోవడానికి కారణమేంటని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. మధ్యవర్తుల కారణంగా వాక్సిన్‌ ధరలకు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. పేదలకు వ్యాక్సిన్‌ ఇవ్వడంపై స్పష్టత లేదని, కేంద్రానిది వివక్షపూరిత టీకా విధానమని ట్వీట్‌ చేశారు రాహుల్‌. ఒకే దేశం, ఒకే ధరల విధానంపై ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదని కాంగ్రెస్‌ మరో నేత జైరామ్‌ రమేష్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యాక్సిన్‌ విధానం వివక్షాపూరితంగా, అస్పష్టంగా, సమానత్వ సూత్రానికి భిన్నంగా ఉందని సీపీఎం ఒక ప్రకటనలో మండిపడింది. కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనాల్సిన సమయంలో అన్ని బాధ్యతల నుంచి తప్పుకునేలా కేంద్రం విధానం ఉందని విమర్శించింది.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు