Covid మరణాలను సరిగా లెక్కించడం లేదు

తాజా వార్తలు

Updated : 28/04/2021 11:52 IST

Covid మరణాలను సరిగా లెక్కించడం లేదు

వైరస్‌ శాస్త్రజ్ఞుడు షాహీద్‌ జమీల్‌ వెల్లడి

దిల్లీ: ‘‘భారత్‌లో మరణాలను సరిగా లెక్కించడం లేదు. దేశంలో సాధారణంగా రోజూ 28వేల మరణాలు (మరణాల రేటు 1000/7.3 ప్రకారం) సంభవిస్తుంటాయి. ఇప్పుడు మహమ్మారి వల్ల 2,300 నుంచి 2,800 మంది చనిపోతున్నట్లు చెబుతున్నారు. రోజువారీ మరణాలతో పోలిస్తే ఇది 10% మాత్రమే. అదే నిజమైతే దేశంలోని శ్మశానాల్లో ఇంతలా రద్దీ ఉండకూడదు’’ అని ప్రముఖ వైరస్‌ శాస్త్రజ్ఞుడు, శాంతిభట్నాగర్‌ అవార్డు గ్రహీత, అశోకా విశ్వవిద్యాలయంలోని త్రివేదీ స్కూల్‌ ఆఫ్‌ బయోసైన్సెస్‌ అధిపతి డాక్టర్‌ షాహిద్‌ జమీల్‌ పేర్కొన్నారు. అశోకా విశ్వవిద్యాలయం ప్రముఖ శాస్త్రవేత్తలతో మంగళవారం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో మరణాలు తక్కువగా కనిపించడానికి కారణాలున్నాయి. మా బంధువుకు ఈనెల 13న పరీక్ష చేస్తే 23న చనిపోయారు. అప్పటి వరకు అతని ఫలితాలు రాలేదు. దానివల్ల ఆ మరణం కొవిడ్‌ లెక్కలోకి రాదు. ఇలాంటి అంశాలు తప్పితే గణాంకాలను  ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారని నేను భావించడంలేదు. సరిగా పరీక్షలు నిర్వహించకపోతే కేసుల సంఖ్య కూడా కచ్చితంగా తెలియదు. ప్రస్తుతం ఉన్న వైరస్‌ లక్షణాలను జన్యుపరిణామక్రమాం ద్వారా విశ్లేషిస్తే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెలుస్తుంది. గత డిసెంబర్‌ నాటికి భారత్‌లో కోటి కేసులు వచ్చినప్పటికీ జన్యుపరిణామక్రమ విశ్లేషణ 5,000 (0.05%) వరకే జరిగింది. కేంద్రం జనవరిలో వైరస్‌ జన్యుపరిణామక్రమాన్ని విశ్లేషించడానికి ఇండియన్‌ సార్స్‌ కన్సార్షియం జీనోమిక్స్‌ (ఇన్సాకాగ్‌)ను ఏర్పాటుచేసింది. రోజువారీ 5% కేసులను విశ్లేషించాలన్నది దాని లక్ష్యం. ఫిబ్రవరి మధ్య నుంచి కన్సార్షియం తన పని మొదలుపెట్టింది. ఇప్పటివరకు 20వేల రకాల వైరస్‌ల జన్యుపరిణామక్రమాన్ని విశ్లేషించింది. ఫిబ్రవరి తర్వాత నమోదైన కేసుల్లో ఈ విశ్లేషణ పరిమాణం 1% మాత్రమే. భారత్‌లో మహమ్మారి పూర్తి భిన్నంగా ఉన్నట్లు అందులో తేలింది. పంజాబ్, హరియాణా, జమ్మూ-కశ్మీర్, దిల్లీల్లో యూకే రకం బి-117 ప్రబలంగా ఉందని, మహారాష్ట్రలో ఇండియా రకం బి-1617 35-40% వరకు ప్రబలిందని వెల్లడైంది. అక్కడ కొన్ని జిల్లాల్లో ఇండియా రకం 60% వరకు ఉన్నట్లు వెల్లడైంది. ఈ బి-1617రకాన్నే మీడియా డబుల్‌ మ్యూటెంట్‌గా పిలుస్తోంది. అది ఇప్పుడు ట్రిపుల్‌ మ్యూటెంట్‌గా పరిణామం చెందిందని కొందరు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అది పూర్తిగా అసత్యం. ఇప్పుడు వైరస్‌లో దాదాపు 15 మ్యూటేషన్లు ఏర్పడ్డాయి. అందులో రెండు మ్యూటేషన్లు తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు కారణం అవడంతోపాటు, కొన్ని యాంటీబాడీలనూ తప్పించుకోగలుగుతున్నాయి. మరో రకం వైరస్‌కూడా మానవ కణజాలంలోకి ప్రభావశీలంగా చొరబడగలుగుతోంది. దానివల్ల ఇన్‌ఫెక్షన్‌ పెరుగుతోంది’’ అని చెప్పారు. 

అందరూ టీకా తీసుకోవాలి..
‘‘మహమ్మారి అంతం బహుళ అంశాలపై ఆధారపడి ఉంటుంది. టీకా లభ్యత, దాని కవరేజి, ఎంత కాలం దాని రక్షణ ఉంటుంది అన్న విషయాలతోపాటు మన ప్రవర్తనపైనా ఆధార పడి ఉంటుంది. రోగనిరోధకశక్తి ఏడాదిలోపే అంతర్ధానమైతే దేశంలో ప్రతి శీతాకాలంలో మహమ్మారి విస్ఫోటం జరుగుతుంది. ఇది పూర్తిగా కొత్త వైరస్‌. దీన్ని ఎదుర్కొనే ముందస్తు రోగనిరోధక శక్తి మన దగ్గర లేదు. అందువల్ల అందరూ టీకా తీసుకోవాలి. జంతువుల్లో తలెత్తే మహమ్మారులను ముందుగా గుర్తించడానికి ఇప్పటికే గ్లోబల్‌వైరోం ప్రాజెక్టు మొదలుపెట్టారు. జంతుజాతుల నుంచి 5లక్షల కొత్త వైరస్‌లను కనిపెట్టడమే దాని లక్ష్యం. ఆ ప్రాజెక్టు వ్యయం 5 బిలియన్‌ డాలర్లు. 2018, 2019 నాటి పరిస్థితులతో చూస్తే ఇది భారీ మొత్తం. 2020-21లో మనకు కొవిడ్‌ ద్వారా 25 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక నష్టం జరగనుంది. ఆ దృష్ట్యా 5 బిలియన్‌ డాలర్ల వ్యయం పెద్దదేమీ కాదు. ఇప్పటివరకు వాస్తవాలను సరిగా చెప్పకపోవడమే సమస్యకు కారణమైంది. పారదర్శకంగా చెబితే మహమ్మారులను అరికట్టడానికి వీలవుతుంది. ఇలాంటి వాటిని ఎప్పుడైనా నమ్మకంతో అరికట్టాలి తప్పితే పోలీసు చర్యల ద్వారా కాదు. భారత్‌లో ప్లాస్మాథెరపీలో లోపాలున్నాయి. ప్లాస్మా.. యాంటీబాడీలను వృద్ధి చేస్తోందా? లేదా? అని సరిగా అధ్యయనం చేయకుండానే ఇస్తున్నారు. ఇలాంటి చర్యలే మ్యూటేషన్లకు దోహదం చేస్తున్నాయి. గుడ్డిగా ప్లాస్మాను ఉపయోగించడం వల్ల మనం అన్యాయం చేస్తున్నాం. ప్లాస్మాను సరిగా పరీక్షించి ఉపయోగించినప్పుడే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు అలాంటిది జరగడం లేదన్నది నా ఉద్దేశం. వైరస్‌ గొలుసును నిరోధించాలంటే లాక్‌డౌన్‌ వంటి చర్యలు తప్పవు’’ అని పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని