కరోనా ‘కొత్తరకం’.. మరిన్ని దేశాలకు..

తాజా వార్తలు

Updated : 24/12/2020 15:09 IST

కరోనా ‘కొత్తరకం’.. మరిన్ని దేశాలకు..

వ్యాక్సిన్లు పనిచేస్తాయంటున్న తయారీ సంస్థలు

జెరూసలెం: బ్రిటన్‌లో ఇటీవల వెలుగుచూసిన కరోనా వైరస్‌ ‘కొత్త రకం’ తాజాగా మరిన్ని దేశాలకు పాకింది. ఇజ్రాయెల్‌తో పాటు ఉత్తర ఐర్లాండ్‌లో ఈ రకం వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇజ్రాయెల్‌లో నలుగురు మార్పుచెందిన వైరస్ బారినపడగా.. వీరిలో ముగ్గురు ఇటీవల ఇంగ్లాండ్‌ నుంచి వచ్చిన వారే. ప్రస్తుతం వీరంతా ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక ఉత్తర ఐర్లాండ్‌లోనూ ఓ కేసు నమోదైంది. 

ఇక భారత్‌లోనూ మార్పుచెందిన వైరస్‌ కలవరపెడుతోంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి 31 వరకు బ్రిటన్‌కు కేంద్రం విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, అంతకుముందు యూకే నుంచి వచ్చిన వారిలో పలువురికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో అలజడి మొదలైంది. అయితే, వీరికి సోకిన వైరస్‌ కొత్త రకమా? కాదా అన్నది తెలియరాలేదు. ప్రస్తుతం అడ్వాన్స్‌ పరీక్షల నిమిత్తం వీరి రక్త నమూనాలను వైరాలజీ ల్యాబ్‌లకు పంపారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన వారంతా కొన్ని వారాల పాటు ఐసోలేషన్‌లోనే ఉండాలని ప్రజలకు సూచిస్తున్నాయి.

మా టీకా పనిచేస్తుంది..

కాగా.. కొత్త రకం వైరస్‌పై తమ టీకా విజయవంతంగా పనిచేసే అవకాశాలున్నాయని మోడెర్నా ఆశిస్తోంది. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు త్వరలోనే మ్యూటేషన్‌కు గురైన వైరస్‌పై పరీక్షలు జరపనున్నట్లు ఈ సంస్థ తెలిపింది. మోడెర్నాతో పాటు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా కూడా తమ టీకాలు పనిచేస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

ఇదిలా ఉండగా.. కరోనా వైరస్‌ జన్యువులను స్వల్పంగా మార్చుకోవడంతో బ్రిటన్‌కు మరో కొత్త ముప్పు ఎదురైంది. దక్షిణాఫ్రికాలో రూపాంతరం చెంది అక్కడ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న మరో రకం కొవిడ్‌ వైరస్‌ తాజాగా లండన్‌ చేరింది. ఇప్పటికే ఇద్దరు పౌరులు దీని‌ బారిన పడటంతో బ్రిటన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశానికి విమానాల రాకపోకలను తక్షణమే నిలిపివేసింది. కాగా.. దక్షిణాఫ్రికాలో బయటపడిన రకం వైరస్‌ బ్రిటన్‌లో వెలుగుచూసిన రకం వైరస్‌‌ కంటే వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి..

మరో వేషంలో మహమ్మారి! 

నిమ్స్‌లో జన్యువిశ్లేషణ కేంద్రం! 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని