Vijay Diwas: పాక్‌కు చివరికి అవమానమే మిగిలింది..!

తాజా వార్తలు

Updated : 26/07/2021 13:18 IST

Vijay Diwas: పాక్‌కు చివరికి అవమానమే మిగిలింది..!

 అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌కి తెలియకుండా ముషరఫ్‌ నిర్ణయ ఫలితం


   

 ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఎక్కడైనా ప్రతి దేశానికి ఓ సైన్యం ఉంటుంది.. కానీ, పాకిస్థాన్‌లో సైన్యానికి ఒక దేశం ఉందనేది ప్రపంచ వ్యాప్తంగా తెలిసిందే. ఇక్కడ ఆర్మీచీఫ్‌కు ప్రధాని అంటే  అస్సలు లెక్కే ఉండదు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్య దేశాలు వెలివేస్తాయనే భయంతో అక్కడి సైన్యం ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడిపించడం ఆనవాయితీ. కార్గిల్‌ యుద్ధ విషయంలో ఈ అంశం మరోసారి రుజువైంది. ఆ దేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు తెలియకుండా ఆర్మీచీఫ్‌ ఈ  వ్యవహారం నడిపించారు. సైన్యాన్ని పురమాయించి భారత భూభాగాలను ఆక్రమించారు. విషయం తెలుసుకొన్న భారత్‌ భీకర దాడి చేయడంతో తోకముడిచారు. చివరికి పాక్‌కు పుట్టెడు అవమానం మిగిల్చారు.

* 22 ఏళ్ల క్రితం పాక్‌ సైన్యం అక్రమించుకున్న జమ్ము కశ్మీర్‌లోని కార్గిల్‌ జిల్లాలోని పర్వత శిఖరాలను భారత్‌ సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకున్న రోజుకు గుర్తుగా జులై 26న ‘విజయ్‌ దివస్‌’ జరుపుకొంటాం.  ఈ యుద్ధం భారత సైన్యం తీరుతెన్నులను మార్చేసింది. 1999 మే నుంచి జులై వరకూ ఇది జరిగింది.

* అప్పటి పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌కు తెలియకుండానే ఆ దేశ ఆర్మీ జనరల్‌ పర్వేజ్‌ ముషరఫ్‌ కార్గిల్‌ ఆక్రమణకు ప్రణాళిక రచించి అమలు చేశాడు. పాక్‌ ఉగ్రవాదులతో కలిసి ఆ దేశ సైన్యం భారత భూభాగంలోకి ప్రవేశించింది. వారంతా యుద్ధ సమయంలో అనుకూలంగా ఉండేలా ఎత్తైన పర్వత శిఖరాలపై బంకర్లు నిర్మించుకొని తిష్ఠవేశారు.

* గొర్రెల కాపర్లు ఇచ్చిన సమాచారంతో భారత సైన్యం అప్రమత్తమై ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో సైనిక చర్యను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌ పేరుతోనే ‘విజయ్‌ దివస్‌’(దినోత్సవం)ను జరుపుకొంటాం.

* శిఖరాలను ఖాళీ చేయించడానికి మన సైన్యం భీకర యుద్ధమే చేయాల్సి వచ్చింది. శత్రువులు ఎత్తైన పర్వత శిఖరాల్లో ఉండటంతో భారత్‌ దళాలు వారిపై గురిపెట్టడం కష్టమైంది. ఈ యుద్ధంలో భారత్‌ రెండు ఫైటర్‌జెట్‌ విమానాలను కూడా కోల్పోయింది. కానీ, ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

* భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటకుండా దాడులు చేసేందుకు మే25వ తేదీన వాజ్‌పేయి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాయుసేన సరిహద్దులు దాటేందుకు అనుమతి కోరినా.. ప్రధాని అంగీకరించలేదని నాటి వాయుసేన చీఫ్‌ వై టిప్నిస్‌ తెలిపారు. పూర్తి స్థాయి యుద్ధానికి భారత్‌ కవ్వించిందనే చెడ్డపేరు వస్తుందని ప్రభుత్వం భావించింది.

* వాయుసేన ఆపరేషన్ ‘సఫేద్‌ సాగర్‌’ను మే26వ తేదీన ప్రారంభించి సైన్యానికి అండగా నిలిచింది. మిగ్‌ 21,23,25, 27,29, మిరాజ్‌ -2000, జాగ్వార్‌ విమానాలు దీనిలో పాల్గొన్నాయి. ఎంఐ-17 హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి.

* అత్యంత తక్కువ వ్యవధిలో 18,000 అడుగుల ఎత్తున ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ను నిర్వహించారు.

భారత అత్యుత్తమ స్క్వాడ్రన్‌గా పేరున్న ‘గోల్డెన్‌ యారోస్‌’ పైలట్లు మిగ్‌-21 విమానాలతో శత్రు బంకర్లను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో వీరికి రివాల్వర్లు, పాకిస్థాన్‌ కరెన్సీని కూడా సైన్యం సమకూర్చింది. ప్రమాదవశాత్తు శత్రుభూభాగంలో దిగినా సురక్షితంగా వచ్చేందుకే ఈ ఏర్పాట్లు. ఇప్పుడు భారత్‌ కొనుగోలు చేసిన రఫేల్‌ విమానాలను తొలుత ఈ స్క్వాడ్రన్‌కే కేటాయించారు.

* పాక్‌ వాయుసేన తమ సైన్యానికి సహకారం అందించేందుకు నిరాకరించింది. ఒక దశలో ఎఫ్‌-16 కాంబాక్ట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించాలని ప్రయత్నించినా.. భారత్‌ మిగ్‌ 29లు వాటిని తరిమికొట్టాయి.

* ఈ క్రమంలో అమెరికా జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్‌ అభ్యర్థించింది. కానీ, పాక్‌ దళాలు ఆ శిఖరాలను ఖాళీ చేసేవరకూ తాము ఏమీ చేయలేమని నాటి బిల్‌క్లింటన్‌ సర్కారు తేల్చిచెప్పింది. మరోపక్క భారత్‌ భీకరమైన దాడులు చేస్తుండటంతో పాక్‌ దళాలు తోకముడిచాయి. చివరికి కీలక శిఖరాన్ని జులై 26న భారత్‌ స్వాధీనం చేసుకొంది.

* ఈ సైనిక చర్యలో పాక్‌ సైన్యంతో పాటు  భారత దళాలు కూడా భారీ నష్టాన్ని చవిచూశాయి. భారత్‌ వైపు 527 యోధులు ప్రాణాలు కోల్పోగా.. పాక్‌ వైపు అత్యధికంగా 400 నుంచి 4,000 మంది మరణించి ఉంటారని అంచనా. అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ లెక్కలు మాత్రం పాక్‌వైపు 700 మంది మరణించినట్లు చెబుతున్నాయి. పాకిస్థాన్‌ తమ సైనికుల మృతదేహాలకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. వాటిని స్వీకరించేందుకు అంగీకరించకపోతే.. భారత్‌ సగౌరవంగా వాటికి అంత్యక్రియలు నిర్వహించింది. శత్రువు అయినా సరే.. ఒక సైనికుడికి భారత్‌ ఇచ్చిన గౌరవం అది.

* ఈ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి, త్యాగాలు చేసిన గ్రెనేడియర్‌ యోగేంద్ర సింగ్‌ యాదవ్‌, లెఫ్టినెంట్‌ మనోజ్‌కుమార్‌ పాండే, కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా, రైఫిల్‌మన్‌ సంజయ్‌ కుమార్‌, కెప్టెన్‌ అంజూ నాయర్‌, మేజర్‌ రాజేష్‌సింగ్‌ అధికారి, కెప్టెన్‌ హనీఫ్‌ ఉద్దీన్‌, మేజర్‌ మరియప్పన్‌ శరవణన్‌,హవాల్దార్‌ చూని లాల్‌ను పురస్కారాలతో భారత ప్రభుత్వం గౌరవించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని