JK: రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మోదీ సానుకూలం!
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 22:25 IST

JK: రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మోదీ సానుకూలం!

సమావేశం అనంతరం విపక్ష నేతల వెల్లడి

3 గంటల పాటు సాగిన అఖిలపక్ష భేటీ

ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమని ప్రధాని మోదీ ఉద్ఘాటన

దిల్లీ: జమ్మూకశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో జరిగిన ఈ సమావేశం మూడు గంటల పాటు సాగింది. మొత్తం 8 పార్టీల నుంచి 14 మంది నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే అంశంపై ఈ భేటీలో ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని విపక్ష నేతలు తెలిపారు. అలాగే జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి గురించి నేతలు ప్రస్తావించిన పలు అంశాలను మోదీ ఓపిగ్గా విన్నారని చెప్పారు. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన మెహబూబా ముఫ్తీ, ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, గులాంనబీ ఆజాద్‌, యూసఫ్‌ తరిగామి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిలో భాగంగా ఐదు డిమాండ్లు ఈ సమావేశం ముందుంచినట్లు కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. రాష్ట్ర హోదా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజకీయ ఖైదీల విడుదల, కశ్మీర్‌ పండిట్లకు పునరావాసం తదితర అంశాలను లేవనెత్తినట్లు చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని హోంమంత్రి అమిత్‌షా చెప్పినట్లు తెలిపారు. హోదా పునరుద్ధరణకు మోదీ సానుకూలంగా ఉన్నారని, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారని ఈ భేటీకి హాజరైన ఆప్నీ పార్టీ నేత అల్తాఫ్‌ బుఖారీ తెలిపారు. పునర్విభజన ప్రక్రియలో భాగస్వాములు కావాలని చెప్పారని అన్నారు.

ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యం: ప్రధాని

జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. ఆ దిశగా అఖిలపక్ష భేటీ జరిగిందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి చెందాలంటే ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వం అవసరమని, అందుకోసం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అంతకంటే ముందు నియోజకవర్గాల త్వరితగతిన జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు భేటీ అనంతరం ఆయన ట్వీట్‌ చేశారు. 

జమ్మూకశ్మీర్‌ సమగ్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. అఖిలపక్ష భేటీలో జమ్మూకశ్మీర్‌ భవిష్యత్‌ గురించి చర్చించామని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణలో నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ మైలురాళ్లు అని ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని