Sara Blakely: ₹7.5 లక్షల బోనస్, విమాన టికెట్లు.. ఉద్యోగులకు లేడీ బాస్ సర్​ప్రైజ్​!

తాజా వార్తలు

Published : 28/10/2021 01:31 IST

Sara Blakely: ₹7.5 లక్షల బోనస్, విమాన టికెట్లు.. ఉద్యోగులకు లేడీ బాస్ సర్​ప్రైజ్​!

వాషింగ్టన్‌: వ్యాపారం లాభాల బాట పడితేనో లేక ఏదైనా కీలక ఒప్పందం కుదిరితేనో ఉద్యోగులకు కంపెనీలు బోనస్​లు ఇస్తుంటాయి. ఉద్యోగుల నెల జీతం బట్టి కొంత మొత్తాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. కానీ, అమెరికాకు చెందిన సారా బ్లేక్లీ (Sara Blakely) అనే మహిళా బాస్‌ మాత్రం తమ ఉద్యోగులకు కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చారు. ఒక్కో ఉద్యోగికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లివచ్చేందుకు రెండు ఫస్ట్​క్లాస్​ విమాన టికెట్లు (Flight Tickets) ఇచ్చారు. అంతేకాకుండా ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.7.5 లక్షల చొప్పున బోనస్ (Bonus)​ ప్రకటించారు.

సారా బ్లేక్లీకి చెందిన స్పాన్​క్స్ (SpanX) కంపెనీ.. బ్లాక్​స్టోన్​ (Black Stone) అనే మరో సంస్థతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. స్పాన్​క్స్​లో మెజార్టీ వాటాను బ్లాక్​స్టోన్ కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ 1.2 బిలియన్​ డాలర్లు (రూ.8.93 వేల కోట్లు). అయితే స్పాన్‌క్స్‌ను స్థాపించేందుకు తాను పడిన కష్టాలు.. సంస్థను నిలబెట్టేందుకు చేసిన కృషిని ఉద్యోగులకు తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. బ్లాక్‌స్టోన్‌తో ఒప్పందం జరిగిన ఆనందాన్ని ఉద్యోగులతో పంచుకోవాలనుకున్నారు.

ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ (Instagram)​లో ఆమె ఓ వీడియోను పంచుకున్నారు. ‘ఈ క్షణాలను సెలబ్రేట్​ చేసుకునేందుకు నేను మీకు ఈ ఆఫర్​ ఇస్తున్నాను. ఇందుకోసం ప్రతి ఉద్యోగికి రెండు చొప్పున ఫస్ట్​క్లాస్​ విమాన టికెట్లు ఇస్తున్నాను. మీరు ట్రిప్​కు వెళ్తే మంచి డిన్నర్​ చేయాలి. మంచి హోటల్​లో బస చేయాలి. కాబట్టి ఆ ఖర్చుల కోసం రూ.7.5 లక్షలు (7.5 Lakhs Rupees) ఇస్తున్నా. ప్రతి ఉద్యోగి ఈ క్షణాన్ని వారి జీవితంలో మరచిపోలేనిదిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ సారా బ్లేక్లీ పేర్కొన్నారు. తమ బాస్‌ ఇచ్చిన ఆఫర్​కు ఉద్యోగులు ఆనందంలో తేలిపోతున్నారు. ఈ టికెట్లు, డబ్బుతో ప్రపంచాన్ని చుట్టేస్తామంటున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని