close

తాజా వార్తలు

Published : 22/01/2021 13:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరింత దృఢంగా.. భారత్‌-అమెరికా బంధాలు

 చైనా సవాళ్లే ప్రాతిపదిక  

దిల్లీ, బీజింగ్‌: బైడెన్‌ రాకతో భారత్‌-అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాలకూ చైనాయే సవాళ్లు విసురుతున్నందున కలిసి పనిచేయాల్సిన అవసరం మునుపటికన్నా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఆర్థిక, మిలటరీ, సాంకేతిక రంగాల్లో చైనా ఎదుగుతున్న దృష్ట్యా ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన అరుణ్‌ సింగ్‌ అన్నారు. అమెరికా అనుసరించే చైనా, ఆసియా విధానాలు ఎలా ఉంటాయో తెలిసిన తరువాతే ఇరు దేశాల సంబంధాలపై స్పష్టత వస్తుందని మరో దౌత్యవేత్త రాజీవ్‌ భాటియా అన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతాల్లో చైనాను అడ్డుకోవాలంటే రెండు దేశాలు కలిసి పనిచేయక తప్పదని చెప్పారు. చైనాపై కఠిన వైఖరి అవలంభిస్తామని నూతన విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అప్పుడే చెప్పినందున భారత్‌ అవసరం అమెరికాకు తప్పకుండా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హయాంలో చాలా ఆసియా దేశాలు ఒత్తిడికి గురవుతున్నాయని మరో నిపుణుడు జి.పార్థసారధి చెప్పారు. చైనాతో ఇబ్బందికర సంబంధాలను భారత్, అమెరికాలు కోరుకోవడం లేదని, స్వీయ ప్రయోజనాల ఆధారంగా విధానాలు ఉంటాయని తెలిపారు. 

అమెరికాపై చైనా వైఖరి ఏమిటో...?

ట్రంప్‌ హయాంలో చైనాతో సంబంధాలు దెబ్బతినగా, బైడెన్‌ పాలనలో ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా పట్ల చైనా వైఖరిలో పెద్దగా మార్పులు ఉండబోవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో నెలకొన్న ప్రస్తుత అస్తవ్యస్థ పరిస్థితులు చైనా కమ్యూనిస్టుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ట్రంప్‌ తెచ్చిన వాణిజ్య యుద్ధం కారణంగా ఇరు దేశాల్లోని రైతులు, కార్మికులు నష్టపోయారు. మధ్యలో వియత్నాం, ఇతర దేశాల వారు లబ్ధిపొందారు. చైనాపై ట్రంప్‌ విధించిన అధిక పన్నులను ఇప్పుడిప్పుడే తగ్గిస్తే ఆ దేశం విషయంలో మెతకగా వ్యవహరిస్తున్నారని బైడెన్‌ విమర్శలకు గురయ్యే ప్రమాదం ఉంది. బైడెన్‌ తొలుత అంతర్గత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తుండడంతో కొంతకాలంపాటు చైనాపై దృష్టి పెట్టే అవకాశాలు లేవని కూడా అంటున్నారు. కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో చైనాలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. అందువల్ల ఒత్తిళ్లకు లొంగబోదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ట్రంప్‌లా దూకుడుతో కాకుండా బైడెన్‌ కొంత సామరస్యంతో వ్యవహరించే అవకాశం ఉందని చైనా అధికారులు భావిస్తున్నారు. కొందరు నాయకులు చేసిన దుష్ప్రచారం కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ వ్యాఖ్యానించడం ఇందుకు ఉదాహరణ. 

ఇవీ చదవండి

కరోనాపై యుద్ధంలో బైడెన్‌ అస్త్రాలివే..

కేంబ్రిడ్జి అనలిటికాపై సీబీఐ కేసు
 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని