Delta Plus: డెల్టా ప్లస్‌ అప్‌డేట్స్‌..
close

తాజా వార్తలు

Updated : 28/06/2021 20:35 IST

Delta Plus: డెల్టా ప్లస్‌ అప్‌డేట్స్‌..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ దేశాలను దాదాపు ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌ కొత్త రూపాలు భయపెడుతున్నాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్‌.. ఇలా అనేకనేక రూపాలతో ఈ మహమ్మారి కల్లోలం రేపుతోంది.తాజాగా వచ్చిన డెల్టాప్లస్‌ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 12 దేశాలకు, మన దేశంలోనే 12 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్‌ను కట్టడిచేసేలా పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే సడలిస్తున్న ఆంక్షలను మళ్లీ కఠినతరం చేస్తున్నాయి. దేశంలో  ఇప్పటివరకు దాదాపు 50కి పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

* డెల్టా ప్లస్‌ రకం వేగంగా వ్యాప్తి చెందడం, టీకా సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపించడం వంటి అంశాలపై ఇప్పటివరకు శాస్త్రీయమైన సమాచారమేమీ లేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ స్పష్టంచేశారు. కరోనా మరో దశ ఏ స్థాయిలో వస్తుందనేది కొవిడ్‌ నిబంధనల అమలు, టెస్టింగ్‌, కట్టడి వ్యూహాలు, వ్యాక్సినేషన్‌ రేటు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం వినియోగంలోకి వచ్చిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు కరోనా వైరస్‌తో పాటు డెల్టా వేరియంట్‌పైనా సమర్థంగా పనిచేస్తున్నాయన్నారు.

* విజయనగరం జిల్లాలో ఓ మహిళకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినట్టు వచ్చిన వార్తలపై జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించారు. అది డెల్టా రకమే తప్ప ‘డెల్టా ప్లస్‌’ కాదని స్పష్టంచేశారు. ప్రజలెవరూ భయాందోళనకు గురికావొద్దని సూచించారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 23 ఏళ్ల మహిళతో పాటు ఆమె భర్తకు గతంలో కొవిడ్‌ పాజిటివ్‌  రాగా.. ఇద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారన్నారు. ప్రతీ 15 రోజులకొకసారి పంపించిన శాంపిల్‌లో ఆ మహిళకి మాత్రమే డెల్టా వేరియంట్‌గా నిర్ధారణ అయిందని వివరించారు. ప్రస్తుతం ఆమె కోలుకొని ఆరోగ్యంగానే ఉన్నట్టు డీఎంహెచ్‌వో ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో ఇప్పటికే తిరుపతిలో తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే.

* డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కలకలం కొనసాగుతున్న వేళ దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వర్చువల్‌గా కొనసాగుతున్న అత్యవసర కేసుల విచారణను జులై 23 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. పెండింగ్‌లో ఉన్న సాధారణ, అత్యవసరంకాని కేసులను జులై 3 నుంచి 23 మధ్య విచారించాలని లిస్టింగ్‌ చేసినప్పటికీ వాటిని ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 9కు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.

* థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలు, డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు అధికంగా ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. సోమవారం నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అన్ని రోజుల్లోనూ నిత్యావసర దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకే తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, డెల్టా ప్లస్‌ వైరస్‌పై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజలకు హెచ్చరించారు.  కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, రోజుకు 15లక్షల మందికి టీకా పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు చెప్పారు.

* చార్‌ధామ్‌ యాత్రను పరిమితమైన భక్తులతో పాక్షికంగా నిర్వహించేలా ఉత్తరాఖండ్‌ కేబినెట్‌ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది. చమోలీ, రుద్రప్రయాగ్‌, ఉత్తర కాశీ జిల్లాలకు చెందిన ప్రజలు జులై 1 నుంచి బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రికి వెళ్లేందుకు అవకాశం కల్పించడంపై స్టే విధించింది. కరోనా వైరస్‌కు తోడు కొత్తగా డెల్టా ప్లస్‌ ముప్పు పొంచి ఉండటంతో పర్యాటకులు, యాత్రికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తంచేసింది. కరోనా డెల్టాప్లస్‌ నుంచి ప్రతిఒక్కరినీ కాపాడటం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అలోక్‌ కుమార్‌ వర్మ ధర్మాసనం వ్యాఖ్యానించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని