Covaxin: పిల్లలపై ప్రయోగాలకు DCGI ఓకే

తాజా వార్తలు

Updated : 13/05/2021 11:32 IST

Covaxin: పిల్లలపై ప్రయోగాలకు DCGI ఓకే

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పిల్లలకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కీలక ముందడుగు పడింది. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశీయ ఔషధ దిగ్గజం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాను రెండేళ్ల చిన్నారుల నుంచి 18ఏళ్ల యువతపై వరకు క్లినికల్‌ ప్రయోగ పరీక్షలు జరిపేందుకు డ్రగ్‌ కంట్రోలర్ జనరల్ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతించింది. కొవాగ్జిన్‌ను 2-18ఏళ్ల వయసు వారిపై రెండు, మూడు దశల్లో క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించేలా నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు డీసీజీఐ ఈ అనుమతులు మంజూరు చేసింది. 525 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై భారత్‌ బయోటెక్‌ ఈ ప్రయోగాలు జరపనుంది.

2 నుంచి 18ఏళ్ల వారిపై కొవాగ్జిన్‌ క్లినికల్‌ పరీక్షలు జరిపేందుకు అనుమతి కోరుతూ భారత్‌ బయోటెక్‌ ఇటీవల దరఖాస్తు చేసింది. దీనిపై కేంద్ర ఔషధ ప్రమాణ స్థాయి సంస్థ(సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ మంగళవారం సమావేశమై చర్చలు జరిపింది. అనంతరం 2-18 ఏళ్ల వయసు చిన్నారులపై టీకా క్లినికల్‌ ప్రయోగాలు జరపొచ్చని ఈ కమిటీ సిఫార్సు చేసింది. అయితే, మూడో దశ ప్రయోగాలు జరపడానికి ముందే రెండో దశ క్లినికల్‌ పరీక్షల భద్రతా డేటా, డీఎస్‌ఎంబీ సిఫార్సులను సీడీఎస్‌సీవోకు సమర్పించాలని కమిటీ భారత్‌ బయోటెక్‌కు షరతు విధించింది. 

ఈ సిఫార్సులను అంగీకరించిన డీసీజీఐ.. పిల్లలపై టీకా ప్రయోగాలకు ఓకే చెప్పింది. దిల్లీ ఎయిమ్స్‌, పట్నా ఎయిమ్స్‌, నాగ్‌పూర్‌ మెడిట్రినా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ క్లినికల్‌ ప్రయోగాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 28 రోజుల వ్యవధిలో వాలంటీర్లకు రెండో డోసులను ఇవ్వనున్నారు. 

ఐసీఎంఆర్‌ సహకారంతో భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకాను ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 18ఏళ్ల పైబడిన వారందరికీ ఇస్తోన్న విషయం తెలిసిందే. దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ చిన్నారులకు ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్‌ లేదు. ఇదిలా ఉండగా అగ్రరాజ్యం అమెరికాలో చిన్నారులకు కూడా టీకాలు వేసేందుకు ఫైజర్‌కు బుధవారం అత్యవసర అనుమతులు లభించాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని