ప్రియాంక అమ్మిన పెయింటింగ్‌ సీజ్‌

తాజా వార్తలు

Updated : 10/03/2020 13:43 IST

ప్రియాంక అమ్మిన పెయింటింగ్‌ సీజ్‌

ముంబయి: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ గతంలో యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌కు విక్రయించిన పెయింటింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఈడీ అధికారులు ముంబయిలోని రాణా కపూర్‌ నివాసం నుంచి దానిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పెయింటింగ్‌ విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌పై భాజపా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో జరుగుతున్న ప్రతి ఆర్థిక నేరానికి గాంధీ కుంటుంబానికి సంబంధాలున్నాయని భాజపా ఆరోపించింది.

1985లో ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ గీసిన ఈ చిత్రపటాన్ని కాంగ్రెస్‌ పార్టీ శతాబ్ది వేడుకల సమయంలో రాజీవ్‌ గాంధీకి బహూకరించారు. ఆ తర్వాత 2010లో దాన్ని రాణాకపూర్‌ రూ.2 కోట్లు వెచ్చించి ప్రియాంక గాంధీ నుంచి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి అప్పట్లో ఆమె రాణా కపూర్‌కు లేఖ రాస్తూ ‘‘మా నాన్న గారి పెయింటింగ్‌ను కొనుగోలు చేసినందుకు మీకు ధన్యవాదాలు. ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్‌ గీసిన ఈ చిత్రపటాన్ని మా నాన్నకు 1985లో కాంగ్రెస్‌ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బహూకరించారు. ప్రస్తుతం ఇది నా స్వాధీనంలో ఉంది’’ అని లేఖలో పేర్కొన్నారు. దానితో పాటు జూన్‌ 3, 2010న హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు ఖాతాలో పెయింటింగ్ కోసం రూ.2 కోట్లు చెక్‌ ద్వారా చెల్లింపులు జరిగిన దానికి సంబంధించి రశీదు వివరాలు ఆ లేఖలో పేర్కొన్నట్లు వెల్లడించారు. అయితే ఈ మొత్తాన్ని ప్రియాంక తన ఆదాయ పన్ను రిటర్నుల్లో వెల్లడించారని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. తాజా పరిస్థితులను తప్పుదోవ పట్టించేందుకే ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది. 

యెస్‌ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో బ్యాంకు కార్యకలాపాల్లో ఆర్థిక అవకతవకలు, అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో ఆ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఈడీ నిన్న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచింది. విచారణ అనంతరం కపూర్‌కు న్యాయస్థానం ఈ నెల 11 వరకు రిమాండ్ విధించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని