డ్రాగన్‌ రుణపాశం
close

తాజా వార్తలు

Updated : 12/07/2020 10:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రాగన్‌ రుణపాశం

అప్పులిచ్చి పేద దేశాలకు ఎర 

ఆపై వేర్వేరు రూపాల్లో పాగా 

డ్రాగన్‌ బుసలకు అనేక పేద దేశాలు విలవిల్లాడుతున్నాయి. రుణాలు ఇచ్చి, పేద దేశాలను తన జేబులో పెట్టుకుని, ఆ తర్వాత వాటిని తనకు కావాల్సినట్లు ఆడించుకోవడం డ్రాగన్‌కు డాలర్లతో పెట్టిన విద్య. ఈ బుసల్లో ఆయా దేశాలు గిలగిలా కొట్టుకుంటున్నాయి. హాంకాంగ్, టిబెట్‌లలో మానవహక్కుల్ని హరించడం, దక్షిణ చైనా సముద్రంలో విస్తరణవాదం, ప్రధాన  దేశాలతో వాణిజ్యపరమైన గిల్లికజ్జాలు, కరోనా   వైరస్‌ వ్యాప్తిపై సమాచారాన్ని తొక్కిపెట్టడం, భారతదేశ భూభాగంలో చొరబడే కుయత్నాలు, నేపాల్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యానికి ప్రయత్నించడం వంటి అనేక విషయాల్లో డ్రాగన్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవన్నీ ఒక ఎత్తు.. రుణ పాశం మరో ఎత్తు..!

ఏమిటీ విధానం?: రుణాలు ఇచ్చి ఉచ్చు బిగించే దౌత్య విధానం గురించి దాదాపు దశాబ్దం క్రితం ప్రచారంలోకి వచ్చింది. ఆఫ్రికా దేశాల్లో అభివృద్ధి పనులకు నిధుల పేరిట చైనా అనుసరిస్తున్న పోకడను మొదట్లో అలా పిలిచేవారు. ఇప్పుడు దానిని ప్రపంచమంతటికీ రుణాల రూపంలో డ్రాగన్‌ విస్తరిస్తోంది. రుణం ఇచ్చేటప్పుడే చైనా ఒక వ్యూహం ప్రకారం షరతులు విధిస్తుంది. రుణాన్ని తీసుకున్న దేశంలో కొంతకొంత చొప్పున వాటాలను పొంది, క్రమంగా ఆ దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ స్వీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం డ్రాగన్‌ పన్నాగం. 

ఎలా పనిచేస్తుంది?
అల్పాదాయాలతో సరిపెట్టుకుంటున్న వర్ధమాన దేశాలపై డ్రాగన్‌ ముందుగా దృష్టి పెడుతుంది. అభివృద్ధి పనులకు కావాల్సిన నిధుల కోసం వెంపర్లాడుతూ, అంతర్జాతీయ సంస్థల కఠిన నిబంధనల్ని పాటించలేని స్థితిలో ఉన్న దేశాలను ఎంచుకుంటుంది. ఇలాంటి దేశాలు సహజంగానే విదేశీ కంపెనీలు భాగస్వాములుగా వస్తాయేమో అన్వేషిస్తుంటాయి. ఇక్కడే చైనా కంపెనీలు రంగ ప్రవేశం చేస్తాయి. చైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థిక సంస్థలతో పాటు రకరకాల కంపెనీలు ఆయా బిడ్డింగ్‌ ప్రక్రియల్లో పాల్గొనేలా నిధుల్ని గుమ్మరిస్తాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వంటివి 3-4% వడ్డీని తీసుకుంటే ఇవి మాత్రం 6% వరకు వసూలు చేస్తాయి. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. తీసుకున్న రుణానికి పూచీ కత్తుగా భూముల్ని, గనుల ఒప్పందాలను, ఇతరత్రా వాణిజ్య ప్రాధాన్యాలను తమకు ఇవ్వాలని షరతు పెడతాయి. నిధులు వస్తున్నాయనే ఆశతో వీటిని కంపెనీలు పెద్దగా పట్టించుకోవు. చైనా కంపెనీకే పని ఇవ్వాలని, చైనా పరికరాలనే వాడాలని, చాలాసార్లు చైనా నుంచే కార్మికులను తీసుకోవాలని కచ్చితంగా చెప్పేస్తాయి. ఇదంతా తడిసిమోపెడు అవుతుంది. 

ఇలా కబళిస్తుంది: చైనా కంపెనీల షరతుల వల్ల చాలా ప్రాజెక్టులు కుదేలవుతాయి. వ్యయం పెరిగిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతాయి. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయినా, వాయిదాలు చెల్లించకపోయినా.. పూచీ కత్తుగా చూపినవాటిని చైనా కంపెనీలు స్వాధీనం చేసుకుంటాయి. మన దేశంలోని గ్రామాల్లో ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు ఎలా వ్యవహరిస్తాయో ఇవి కూడా అచ్చం అలాగే చేస్తాయి. 

ఎంత ఇచ్చిందంటే?: హోవార్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం చైనా ఇప్పటి వరకు 152 దేశాలకు దాదాపు 1.50 లక్షల కోట్ల డాలర్ల మేర (సుమారు రూ. 112 లక్షల కోట్లు) రుణాలు ఇచ్చింది. ఇది 5 లక్షల కోట్ల డాలర్ల పైమాటేననే అంచనాలూ ఉన్నాయి. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) ప్రాజెక్టుల్లో భాగంగా కొన్ని, విడిగా మరికొన్ని ఉన్నాయి. కాంగో, కాంబోడియా, నైగర్, లావోస్, మంగోలియా వంటి దేశాలైతే తమ జీడీపీలో 20 శాతానికి సమానమైన మొత్తాలు చైనాకు రుణపడ్డాయి.

ప్రతిఫలంగా ఏం కొట్టేసింది?: ఆర్థిక ఉచ్చును బిగిస్తున్న డ్రాగన్‌ దానికి బదులుగా చాలా ప్రయోజనం పొందుతోంది. జిబౌతి దేశం తమ భూభాగంలో చైనా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించడం దీనికొక ఉదాహరణ. శ్రీలంక ఇలాంటి రుణాన్ని తీర్చలేకనే హంబన్‌తోట ఓడరేవును 99 ఏళ్ల కాలానికి చైనాకు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది. భారీగా చమురు నిల్వలు ఉన్న అంగోలా అయితే చైనా రుణాన్ని చమురు సరఫరా రూపంలో తీర్చాల్సి వస్తోంది. ఆ దేశ రాజధాని లువాండాకు సమీపంలో పూర్తిగా ఓ కొత్త నగరాన్నే చైనా నిర్మించుకుంది. అక్కడ ఎవరూ నివాసం ఉండరు..! రుణాన్ని తీర్చలేమనే భయంతో టాంజానియా, మలేసియా, పాకిస్థాన్‌ వంటి దేశాలు పలు ప్రాజెక్టుల్ని మధ్యలోనే నిలిపేశాయి. పాకిస్థాన్‌లో సీపెక్‌ ప్రాజెక్టు అసలు విలువ మొదట 3600 కోట్ల డాలర్లు కాగా అది ఇప్పుడు 6400 కోట్ల డాలర్లకు చేరిపోయింది. నేపాల్‌ కూడా ఉక్కిరిబిక్కిరి కాబోతోంది. రుణపాశంలో ఇరుక్కున్న దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాయి. 

భారత్‌ పరిస్థితి ఏమిటి?
రుణాలు, గ్రాంట్ల రూపంలో భారతదేశానికి వివిధ దేశాలతో సంబంధ బాంధవ్యాలున్నాయి. చైనా అంత విస్తృతంగా కాకపోయినా మన దేశం కూడా అనేక దేశాలకు రుణాలు ఇచ్చింది. తద్వారా మంచిపేరే తెచ్చుకుంది గానీ చైనా మాదిరిగా అప్రతిష్ఠ మూటగట్టుకోలేదు. ప్రస్తుతం డ్రాగన్‌ బుసలపై రగిలిపోతున్న దేశాలకు తక్కువ వడ్డీకి కొంతమేర రుణాలు ఇవ్వగలిగితే దీర్ఘకాలంలో మనకు మంచి ప్రయోజనమే కలగనుంది. 

జె.కె.త్రిపాఠి, మాజీ దౌత్యవేత్త
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని