Amit Shah: సరిహద్దు వివాదాలపై కీలక చర్చ

తాజా వార్తలు

Published : 25/07/2021 14:41 IST

Amit Shah: సరిహద్దు వివాదాలపై కీలక చర్చ

షిల్లాంగ్‌: అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు, కొవిడ్‌ కేసుల నియంత్రణ అంశాలపై కేంద్రం హోం మంత్రి అమిత్‌ షా.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం షిల్లాంగ్‌లో సమావేశమయ్యారు. అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, సిక్కిం రాష్ట్రాల సీఎంలు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు హాజరయ్యారు. ఆయా రాష్ట్రాలను దీర్ఘకాలంగా పీడిస్తున్న సరిహద్దు వివాదాల గురించి ఈ సందర్భంగా అమిత్‌ షా తెలుసుకున్నారు. గత కొన్నేళ్లుగా అస్సాం, మిజోరం సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతుండటంపై ఆరా తీశారు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి కేంద్రం కృతనిశ్చయంతో ఉందని, సంబంధీకులందరి భాగస్వామ్యం, సమష్టి ప్రయత్నాలతో వచ్చే కొన్నేళ్లలోనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఈశాన్య భారతంలో ప్రశాంతత నెలకొల్పి, జీడీపీలో ఈ ప్రాంత వాటాను 20 శాతానికి పైగా పెంచడమే తమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా షిల్లాంగ్‌లో కేంద్ర ఆర్థిక సహకారంతో నిర్మించిన అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే మేఘాలయలో ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ కోసం గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్న పౌర సంఘాలతో పాటు ఖాసి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరచాలని కోరుతున్న సంఘాలతోనూ షా సమావేశమయ్యారు. ఆదివారం సోహ్రా (చిరపుంజి)లో ఆయన పర్యటించనున్నారు.

మేఘాలయ-అస్సాం సీఎంల చర్చలు

ఈనాడు, గువాహటి: మరోవైపు అస్సాం- మేఘాలయ సరిహద్దు వివాదాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య షిల్లాంగ్‌లోనే జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. మరోసారి చర్చలు జరిపేందుకు గువాహటికి ఆగస్టు 6న రావాల్సిందిగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. మేఘాలయ సీఎం కాన్రాడ్‌ సంగ్మాను ఆహ్వానించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని