Pulitzer: భారత సంతతి జర్నలిస్టులకు పులిట్జర్‌
close

తాజా వార్తలు

Updated : 12/06/2021 21:58 IST

Pulitzer: భారత సంతతి జర్నలిస్టులకు పులిట్జర్‌

న్యూయార్క్‌: భారత సంతతి జర్నలిస్టు మేఘా రాజగోపాలన్‌ తన మరో ఇద్దరు సహచరులతో కలిసి పులిట్జర్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. చైనాలోని షింజియాంగ్‌ ప్రాంతంలో లక్షలాది మంది ముస్లింల కోసం ఏర్పాటు చేసిన నిర్బంధ గృహాలు, జైళ్లు సహా వారితో పనిచేయించుకునేందుకు నిర్మించిన భారీ కర్మాగారాలకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా బయటకు తీసుకొచ్చినందుకుగానూ వారికి ఈ పురస్కారం ప్రకటించారు. ‘బజ్‌ఫీడ్ న్యూస్‌’ అనే డిజిటల్‌ మీడియా సంస్థలో పనిచేస్తున్న మేఘా రాజగోపాలన్ ఇంటర్నేషనల్‌ రిపోర్టింగ్‌ కేటగిరీలో పురస్కారం అందుకోనున్నారు.

‘తంపాబే టైమ్స్‌’లో పనిచేస్తున్న మరో భారత సంతతి జర్నలిస్టు నీల్‌ బేడీని సైతం పులిట్జర్‌ వరించింది. తన సహచరి కత్లీన్‌ మెక్‌గ్రోరీతో కలిసి ఆయన లోకల్‌ రిపోర్టింగ్‌ విభాగంలో ఈ పురస్కారం అందుకోనున్నారు. ఫ్లోరిడాలోని పాస్కో కౌంటీలో షెరీఫ్‌ ఆఫీస్‌ (శాంతి భద్రతల అధికారి కార్యాలయం) అమల్లోకి తెచ్చిన ఓ విధానాన్ని వీరు వెలుగులోకి తెచ్చారు. ఓ కంప్యూటర్‌ మోడలింగ్‌ విధానంలో కొంతమందిని భవిష్యత్తు నేరగాళ్ల పేరిట గుర్తించి వారిపై అసాధారణ స్థాయిలో నిఘా వేసి తీవ్రంగా వేధించారు. ఈ దురాగతాలను ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన నీల్‌ బేడీ, కత్లీన్‌ మెక్‌గ్రోరీని పులిట్జర్ వరించింది.

అమెరికాలో జర్నలిజంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం పుటిట్జర్‌. జోసెఫ్‌ పులిట్జర్‌ అనే వార్తాపత్రిక ప్రచురనకర్త రాసుకున్న వీలునామా ప్రకారం 1917 నుంచి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. మొత్తం 21 కేటగిరీల్లో ఈ అవార్డును అందజేస్తారు. దీన్ని గెలుచుకున్న వారికి 15 వేల డాలర్ల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని ఇస్తారు. ప్రపంచంలో అత్యంత ప్రతష్ఠాత్మక పురస్కారాల్లో పులిట్జర్‌ ఒకటి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని