Tata Motors: టాటా మోటార్స్‌ రయ్‌రయ్‌.. లాభం మూడింతలు

Tata Motors Q4 results: టాటా మోటార్స్‌ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో మూడింతల లాభాన్ని నమోదుచేసింది. 

Updated : 10 May 2024 21:21 IST

Tata Motors Q4 results | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ (Tata Motors) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. మార్చితో నాలుగో త్రైమాసికంలో రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,496.04 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు వృద్ధి నమోదైంది.

గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,05,932.35 కోట్లుగా ఉన్న టాటా మోటార్స్‌ ఏకీకృత ఆదాయం.. ఈ ఏడాదిలో రూ.1,19,986.31 కోట్లకు చేరినట్లు తెలిపింది. కార్యకలాపాల ద్వారా వచ్చే కంపెనీ ఆదాయం 11శాతం పెరిగింది. పూర్తి వార్షిక సంవత్సరానికి కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.31,806.75 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే లాభం రూ.2,689.87 కోట్లకే పరిమితమైంది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఏకీకృత ఆదాయం కూడా పూర్తి సంవత్సరానికి రూ.4,37,927.77 కోట్లుగా నమోదైంది.

ఈ లేఆఫ్‌లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్‌ సమాధానమిదే..!

ఈ ఏడాదిలో టాటా మోటార్స్‌ 73,800 ఈవీలను విక్రయించి 1.5 లక్షల మైలురాయిని అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 48శాతం ఎక్కువ.  ప్రయాణికులు, ఎస్‌యూవీ వాణిజ్య వాహన విభాగంలో విక్రయాలు ఊపందుకున్నాయి. ‘‘ 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాలు ఆర్జించాం. రానున్న ఏళ్లలోనూ ఇదే వృద్ధిని కనబర్చనున్నాం’’ అని టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పీబీ బాలాజీ అన్నారు. నాలుగో త్రైమాసికంలో కమర్షియల్‌, పీవీ, ఈవీ మూడు ఆటో విభాగాలు పుంజుకున్నాయని.. ముఖ్యంగా జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌ బలంగా పనితీరు కనబర్చాయన్నారు. ఈ ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్‌ షేరు విలువ ఎన్‌ఎస్‌ఈలో 1.62శాతం పెరిగి రూ.1,047.00 వద్ద స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని