
తాజా వార్తలు
అలా అయితే..పాక్షిక లాక్డౌన్లోకి ముంబయి!
ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాజధాని నగరం ముంబయిలో పాజిటివ్ కేసులు నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. దాంతో ఆ ప్రాంతంలో పాక్షికంగా లాక్డౌన్ విధించే అవకాశాలపై అక్కడి ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది, పది రోజుల్లో కరోనా కేసులు అదుపులోకి రాకపోతే, నగరంలో పాక్షికంగా లాక్డౌన్ విధించే అవకాశం ఉంటుందని మంత్రి అస్లామ్ షేక్ అన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు చెప్పారు. క్రియాశీల కేసులు సెప్టెంబర్ స్థాయికి చేరుకోవడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారని మీడియాతో వెల్లడించారు.
‘మాస్క్ ధరించని వారిపై, పబ్బుల్లో, వేడుకల్లో భారీగా జనాలు గుమిగూడకుండా జరిమానాలు విధించడం వంటి కరోనా నియంత్రణ చర్యలను తీసుకుంటాం. సంస్థాగత క్వారంటైన్, టెస్టింగ్, సాధ్యమైనంత ఎక్కువమందికి టీకా అందించడం వంటి వాటిని అమలు చేస్తాం. అయినా కూడా కేసులు పెరుగుతుంటే.. చివరిగా పాక్షికంగా లాక్డౌన్ విధించొచ్చు’ అని అస్లాం షేక్ తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికి లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటివి ఉండకపోవచ్చని బీఎంసీ తెలిపింది.
కొద్ది రోజులుగా మహారాష్ట్రలో 10 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఆ కేసులు సంఖ్య 11,141కి చేరుకుంది. ముంబయిలో 131 రోజుల తరవాత భారీగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజాగా 1,361 మంది వైరస్ బారిన పడ్డారు. ఆ రాష్ట్రంలో మహమ్మారి ఈ తీరుగానే విజృంభిస్తే..ఏప్రిల్ నాటికి క్రియాశీల కేసులు రెండు లక్షలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.