యూకే ప్రయాణికుల్లో కరోనా..భారత్‌ అప్రమత్తం

తాజా వార్తలు

Updated : 22/12/2020 14:49 IST

యూకే ప్రయాణికుల్లో కరోనా..భారత్‌ అప్రమత్తం

దిల్లీ: బ్రిటన్ నుంచి భారత్‌కు వస్తున్న ప్రయాణికుల్లో వైరస్‌ కేసులు వెలుగుచూస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. యూకేలో కొత్త రకం కరోనా వైరస్‌ బయటపడిన నేపథ్యంలో భారత్‌ చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. డిసెంబరు 31 వరకు ఆ దేశానికి విమాన సర్వీసులను నిలిపివేసిన ప్రభుత్వం.. మంగళవారం అర్ధరాత్రిలోగా భారత్‌ చేరుకుంటున్నవారికి ఎయిర్‌పోర్టుల్లో వైరస్‌ పరీక్షలు తప్పనిసరి చేసింది. అయితే, ఈ పరీక్షల్లో కొంతమంది ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అవడం కలవరపెడుతోంది. ఓవైపు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో ఈ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. 

కోల్‌కతా ఎయిర్‌పోర్టుల్లో ఇద్దరికి..

సోమవారం రాత్రి యూకే నుంచి కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇంటర్నేషనల్‌కు వచ్చిన విమానంలోని ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఇద్దరికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని సంస్థాగత క్వారంటైన్‌కు పంపారు. అయితే వీరిలో బయటపడిన వైరస్‌ కొత్త రకానిదా? కాదా? అనే విషయం ఇంకా తెలియరాలేదు. మరోవైపు లండన్‌ నుంచి ఎయిరిండియా విమానంలో దిల్లీ చేరుకున్న ప్రయాణికుల్లో ఆరుగురికి కరోనా సోకినట్లు తేలింది. తదుపరి పరీక్షల నిమిత్తం వీరి నమూనాలను నేషనల్ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ చెన్నై వాసికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. 

ఏ రాష్ట్రాల్లో ఎలా..

కరోనా కొత్త రకం భయాల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వం ఇంటింటి సర్వేకు సిద్ధమైంది. గత రెండు వారాలుగా యూకే నుంచి నగరానికి వచ్చిన అందరి ఇళ్లకు వెళ్లి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. యూకే నుంచి వచ్చినవారు వారం పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. 

 బ్రిటన్‌ నుంచి చెన్నైకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులందరికీ 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది. 

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గత 15 రోజులుగా యూకే నుంచి నగరానికి వచ్చినవారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. 

మహరాష్ట్రలోని అన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. పంజాబ్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. గత రాత్రి విదేశాల నుంచి పంజాబ్‌కు వచ్చిన ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించింది.

తెలంగాణలోని హైదరాబాద్‌ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌-పీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేసింది. పాజిటివ్‌ వచ్చిన వారిని సంస్థాగత క్వారంటైన్‌కు తరలించనున్నారు. అంతేగాక, ఇప్పటికే యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారి వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. 

ఇవీ చదవండి..

బ్రిటన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్‌!

కొత్తరకం కరోనా అదుపునకూ అదే మార్గం!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని