vaccination: రెండు డోసులు తీసుకుంటేనే పూర్తి రక్షణ

తాజా వార్తలు

Updated : 18/08/2021 23:11 IST

vaccination: రెండు డోసులు తీసుకుంటేనే పూర్తి రక్షణ

సింగిల్‌ డోసు టీకా ప్రభావం అంతంత మాత్రమే!
అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రపంచ దేశాలు కొంత వరకు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే, వైరస్‌ను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్లు ఏమేరకు సమర్థత చూపిస్తున్నాయో తెలుసుకునేందుకు అధ్యయనాలు కొనసాగుతున్నాయి. సింగిల్ డోసు, డబుల్‌ డోసు, బూస్టర్‌ డోసు ఏది తీసుకుంటే పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందనే దానిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా దిల్లీలోని గంగారామ్‌ హాస్పిటల్లో ఓ అధ్యయనం చేపట్టారు. సింగిల్‌ డోసు టీకా తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్‌ నుంచి పూర్తి రక్షణ లభించలేదని ఈ అధ్యయనం ద్వారా వెల్లడించారు. ప్రముఖ జర్నల్‌ అంతర్జాతీయ యూరోపియన్ జర్నల్‌ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది.

‘ఇటీవల డెల్టా వేరియంట్ విజృంభణతో భారత్‌లో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గత 13 నెలల్లో నమోదైన కేసులతో పోల్చితే దిల్లీలో ఏప్రిల్-మే నెలల్లో నమోదైన కేసులే చాలా అధికం. ఈ సమయంలో కొవిషీల్డ్‌ టీకా ఎంత మేర ప్రభావం చూపుతుందో అంచనా వేశాం’ అని అధ్యయనం తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్న వారిలో 30 రోజుల వ్యవధిలో 28 శాతం మంది సాధారణం నుంచి తీవ్రమైన లక్షణాలతో వైరస్‌ బారిన పడ్డారు. అలాగే 67 శాతం మంది సాధారణ లక్షణాలు, 76 శాతం మంది ఆక్సిజన్‌పై చికిత్స తీసుకునేంతగా వైరస్‌కు గురయ్యారు. అయితే, రెండు డోసులు టీకా తీసుకున్న వారిలో 97 శాతం మంది మరణాన్ని జయించినట్లుగా ఈ అధ్యయనం వెల్లడించింది.

అధ్యయనం చేపట్టారిలా..

దిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో పనిచేసే సిబ్బందిలో టీకా పనితీరుపై అధ్యయనం చేపట్టింది. వీరిలో రెండు డోసుల టీకా తీసుకున్న 2,716 మంది, ఒకే డోసు టీకా తీసుకున్న 623 మంది, ఏప్రిల్ 30 వరకు టీకా తీసుకోని 927 మందిపై టీకా ప్రభావాన్ని పోల్చి చూశారు. మొత్తం 4,276 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 560 (13.1 శాతం) మందికి మార్చి-మే నెలల్లో పాజిటివ్‌ వచ్చింది. వారిలో 61 మంది ఆసుపత్రిలో చేరగా.. 499 మంది ఇంట్లో ఉండి చికిత్స పొందారు. వీరిలో 9 (1.6 శాతం) మంది అధ్యయనం నుంచి తప్పుకున్నారు. 10 (1.8 శాతం) మందికి ఎటువంటి లక్షణాలు లేవు. 458 (81.79 శాతం) మందికి స్వల్ప లక్షణాలు, 57 (10.2 శాతం) మంది మధ్యస్థంగా, 26 (4.64 శాతం) మందికి తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా నిపుణులు గుర్తించారు. వీరిలో ఆరుగురు (1.06 శాతం) మరణించినట్లుగా అధ్యయనంలో తేలింది. గతంలో వైరస్‌ సోకిన వారికి వ్యాక్సినేషన్‌ ద్వారా పూర్తి రక్షణ లభించిందని అధ్యయనం పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని