
తాజా వార్తలు
బంగారు గనిలో 21 మంది.. 2వారాలుగా
ప్రాణాల కోసం పోరాడుతున్న కూలీలు
చైనాలో ఘటన
బీజింగ్: చైనాలోని ఓ బంగారు గనిలో దాదాపు రెండు వారాల క్రితం జరిగిన ప్రమాదంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడం కోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. జనవరి 10న షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని క్విజియా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ బంగారు గనిలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో అందులో పనిచేస్తున్న 22 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు.
అయితే, ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత గానీ.. గని నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఆ తర్వాత హుటాహుటిన సహాయక సిబ్బంది అక్కడకు చేరుకోగా.. గని పూర్తిగా మూసుకుపోయింది. కూలీలు వంద అడుగుల లోతులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించడం కష్టంగా మారింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. శిథిలాలను తొలగించి వారికి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో గని లోపలికి గాలి, వెలుతురు వెళ్లేలా.. మరోవైపు డ్రిల్లింగ్ చేపట్టారు. ఇందులో నుంచి కూలీలతో మాట్లాడుతూ.. వారికి ఆహారం, మందులు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా.. గని కింద చిక్కుకున్న కూలీల్లో 11 మంది ఒక ఛాంబర్లో ఉండగా వీరిలో ఓ వ్యక్తి తలకు బలమైన గాయమై కోమాలోగా వెళ్లాడు. బుధవారం అతడు మృతిచెందినట్లు చైనా మీడియా వెల్లడించింది. ఈ ఛాంబర్‌కు సమీపంలోనే మరో కూలి ప్రాణాలతో ఉన్నాడని, మిగతా 10 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని పేర్కొంది. పేలుడు కారణంగా గనిలో పొగ దట్టంగా వ్యాపించడంతో కూలీలు ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు గని నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
చైనా మైనింగ్ పరిశ్రమలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో ఏడాదికి 5వేల మంది కూలీలు ప్రాణాలు కోల్పోతుండటం గమనార్హం. గతేడాది సెప్టెంబరులో చెంగ్కింగ్లో జరిగిన గని ప్రమాదంలో 39 మంది కూలీలు మరణించారు.
ఇదీ చదవండి..
కారెక్కాడు.. నగల దొంగ చిక్కాడు