Twitter: అవును.. మేం నిబంధనలు అమలుచేయలేదు

తాజా వార్తలు

Published : 06/07/2021 13:02 IST

Twitter: అవును.. మేం నిబంధనలు అమలుచేయలేదు

హైకోర్టులో అంగీకరించిన ట్విటర్‌

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలను ఇంకా అమలు చేయలేదని ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు మంగళవారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే కొత్త నిబంధనలకు అనుగుణంగా అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొంది. 

భారత ప్రభుత్వం రూపొందించిన కొత్త ఐటీ నిబంధనలను ట్విటర్‌ పాటించడం లేదంటూ న్యాయవాది అమిత్‌ ఆచార్య పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ‘‘నూతన ఐటీ నిబంధనలను ట్విటర్‌ ధిక్కరించాలనుకుంటోందా?’’ అని సామాజిక మాధ్యమ సంస్థను న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి ట్విటర్‌ బదులిస్తూ.. ‘‘ఇప్పటివరకు మేం కొత్త నిబంధనలను అమలు చేయలేదు. అయితే ఆ ప్రక్రియను మొదలుపెట్టాం’’ అని తెలిపింది. 

ఫిర్యాదులు స్వీకరించే అధికారిని నియమించగా.. ఆయన రాజీనామా చేశారని, కొత్త గ్రీవెన్స్‌ అధికారిని నియమించాల్సి ఉందని ట్విటర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ప్రస్తుతం నియామక ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానం అసహనానికి గురైంది. ‘‘మీ నియామక ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది? మీకు నచ్చినన్ని రోజులు తీసుకుంటాం అంటే కుదరదు. దీనికి న్యాయస్థానం అంగీకరించదు’’ అని జస్టిస్‌ రేఖా పల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రశ్నపై స్పందించేందుకు తమకు ఒక రోజు సమయం ఇవ్వాలని ట్విటర్‌ కోర్టును కోరింది.

అయితే అప్పటిదాకా ట్విటర్‌కు ఎలాంటి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. కంపెనీపై కేంద్రానికి చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొంది. ‘‘మీకు ఇంతకుముందే చెప్పాం. భారత్‌లో ట్విటర్‌ కార్యకలాపాలు సజావుగా కొనసాగాలంటే ఏం చేయాలో మీకు తెలుసు’’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని