యువతకూ టీకా ఇవ్వాలి

తాజా వార్తలు

Published : 17/04/2021 09:08 IST

యువతకూ టీకా ఇవ్వాలి

తీవ్ర అనారోగ్యాలున్నవారికి ప్రాధాన్యత

దిల్లీ: భారత్‌లో కరోనా 2.0 శరవేగంగా విజృంభిస్తోంది. వైరస్‌ ఉద్ధృతి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత మూడు రోజులుగా వెయ్యికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రెండో దశలో రోజుకు 1,750 మంది మృతి చెందే ప్రమాదం పొంచి ఉందని, జూన్‌ మొదటి వారం నాటికి ఆ సంఖ్య 2,320కి చేరుకోవచ్చని లాన్సెట్‌ కొవిడ్‌-19 కమిషన్‌ నివేదిక వెల్లడించింది. ‘మేనేజింగ్‌ ఇండియాస్‌ కొవిడ్‌-19 వేవ్‌: అర్జెంట్‌ స్టెప్స్‌’ శీర్షికన వెలువరించిన ఈ నివేదికలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలను ప్రస్తావించింది. యువతకూ టీకా ఇవ్వాలని పేర్కొంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. అంతేకాదు... పది కంటే ఎక్కువ మంది కలవకుండా వచ్చే రెండు నెలల్లో తాత్కాలికంగా నిషేధించాలని కూడా సిఫార్సు చేసింది.

40 రోజుల్లో 80వేలకు

రెండో దశ కరోనా.. టైర్‌ 2, టైర్‌ 3 నగరాలను తీవ్రంగా ప్రభావితం చేయనుందని నివేదిక తెలిపింది. భౌగోళికంగా కూడా తొలి దశకు, రెండో దశకు తేడాలున్నాయని వివరించింది. తొలి దశలో 40 జిల్లాల్లో 50 శాతం కేసులు నమోదైతే రెండో దశలో అది 20 జిల్లాలకు పరిమితమైంది. నివేదిక ప్రకారం.. 2020 ఆగస్టు-సెప్టెంబర్‌ మధ్య 60 నుంచి 100 జిల్లాల్లో 75 శాతం కేసులు నమోదయ్యాయి. ఈసారి అది 40 నుంచి 20 జిల్లాలకు పరిమితమైంది. రెండో దశలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ ప్రారంభానికి (దాదాపు 40 రోజుల్లో) రోజువారీ కొత్తకేసులు పదివేల నుంచి 80 వేలకు పెరిగాయి. అదే గతేడాది దీనికి 83 రోజులు పట్టింది.

భారీగా ఖర్చు చేయాల్సిందే

గతేడాది మార్చిలో కరోనా విజృంభణ ప్రారంభమైంది. ఆ దశలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. రెండో దశలో మాత్రం అది 0.87 శాతంగానే ఉండటం సానుకూలాంశం. ఏప్రిల్‌ 10 నాటికి మరణాల వారం రోజుల సగటు 664గా ఉంది. భ్శారీగా నమోదవుతున్న కేసుల కారణంగా సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. ఇవి మరిన్ని తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. అలాగే పరీక్షలు, వైద్య సేవల నిమిత్తం దేశంపై ఆర్థికంగా భారం పడుతుంది.

టీకా ఉత్పత్తిని పెంచాలి

ఏప్రిల్‌ 11, 2021 నాటికి 45 ఏళ్లు పైబడిన 29.6 శాతం మందికి కేంద్రం టీకా డోసులు పంపిణీ చేసిందని నివేదిక పేర్కొంది. అయితే యువతీ యువకులకు టీకా అందించాలని అభిప్రాయపడింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న టీకా కార్యక్రమం కింద కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలను వాడుతున్నారు. తక్కువ సమయంలో మరింత మందికి టీకాలు అందించేందుకు విదేశాల్లో ఇప్పటికే వినియోగంలో ఉన్న మోడెర్నా, ఫైజర్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాలను ఆమోదించాలని సూచించింది. టీకా తయారీని పెంచాలని తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని