చిక్కేదెవరికో..

ప్రధానాంశాలు

Updated : 28/03/2021 05:00 IST

చిక్కేదెవరికో..

చివరి వన్డే నేడే
సిరీస్‌పై భారత్‌, ఇంగ్లాండ్‌ కన్ను
మధ్యాహ్నం 1.30 నుంచి
పుణె

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలుత  వెనకబడింది.. టీ20 సిరీస్‌లోనూ అదే తీరు..! కానీ ఆఖరికి ఆ రెండు సిరీస్‌లనే టీమ్‌ఇండియానే సొంతం చేసుకుంది. అందుకు విరుద్ధంగా వన్డే సిరీస్‌ను విజయంతో ఆరంభించినా తర్వాత ఓటమితో పర్యటక జట్టుతో సమానంగా నిలిచింది. ఎలాగైనా ఈ సిరీస్‌ను చేజిక్కించుకుని ఇంగ్లాండ్‌ను వట్టి చేతుల్తో పంపించాలని టీమ్‌ఇండియా పట్టుదలగా ఉంటే.. రెండో వన్డే జోరును కొనసాగిస్తూ ఈ ఒక్క సిరీస్‌నైనా సొంతం చేసుకుని కాస్త ఊరట పొందాలని ఇంగ్లాండ్‌ తహతహలాడుతోంది. గత మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన ప్రత్యర్థిని అడ్డుకోవడం కోహ్లీసేనకు సవాలే. కానీ పుంజుకోవడమూ ఆతిథ్య జట్టుకు కొత్త కాదు. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే నేడే.
సిరీస్‌ హ్యాట్రిక్‌ సాధించాలనుకుంటున్న టీమ్‌ఇండియా ఆదివారం జరిగే చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. గత మ్యాచ్‌లో దెబ్బతిన్న భారత్‌.. తన ప్రణాళికల్లో మార్పులు చేయనుంది. బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌పై రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఏకంగా 20 సిక్స్‌లు బాదేశారు. 337 పరుగుల లక్ష్యఛేదన ఆ జట్టుకు నల్లేరుపై నడకే అయింది. స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్య ఘోరంగా విఫలమైన వేళ.. రవీంద్ర జడేజా లేని లోటు స్పష్టంగా కనిపించింది. బెయిర్‌స్టో, స్టోక్స్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో భారత స్పిన్నర్లను ఓ ఆటాడుకున్నారు. ఏకంగా ఎనిమిది సిక్స్‌లు సమర్పించుకున్న కుల్‌దీప్‌.. అత్యధిక సిక్స్‌లు ఇచ్చిన భారత బౌలర్‌గా అవాంఛనీయ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. తొలి వన్డేలో 64 పరుగులు ఇచ్చిన అతడు రెండో వన్డేలో ఏకంగా 84 పరుగులు ఇచ్చేశాడు. కృనాల్‌ అయితే కేవలం ఆరు ఓవర్లలోనే 72 పరుగులిచ్చాడు. ఈ నేపథ్యంలో భారత్‌.. చివరి మ్యాచ్‌కు వీళ్లిద్దరి స్థానంలో చాహల్‌, సుందర్‌లను తీసుకునే అవకాశముంది. ధాటిగా  ఆడగల కృనాల్‌ కొనసాగే అవకాశాలను కొట్టిపారేయలేం.  కానీ బంతితో అంతగా ప్రభావం చూపలేకపోతున్న అతణ్ని దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా పరిగణించకపోవచ్చు.
దూకుడు కావాలి..: ఇక రెండో వన్డేలో భారత్‌ బాగానే బ్యాటింగ్‌ చేసింది. ఎలాంటి పిచ్‌పై అయినా 336 పరుగుల స్కోరు తక్కువేమీ కాదు. కానీ ఇన్నింగ్స్‌ నిర్మిస్తున్న తీరును మార్చుకోవడంపై భారత్‌ దృష్టిసారించవచ్చు. చివరి 15 ఓవర్లలో వేగం పెంచే వ్యూహాన్ని టీమ్‌ఇండియా చాలా ఏళ్లుగా అనుసరిస్తూ వస్తోంది. చాలా సార్లు ఈ నమూనా పని చేసింది కూడా. కానీ బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌లపై మొదటి నుంచి చెలరేగుతున్న ఇంగ్లాండ్‌పై ఆసాంతం దూకుడు  తప్పదనిపిస్తోంది. టాప్‌ ఆర్డర్‌ మరిన్ని పరుగుల బౌండరీల ద్వారా రాబట్టడం అవసరం.  వరుసగా రెండు అర్ధసెంచరీలు సాధించిన కెప్టెన్‌ కోహ్లి.. ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచాల్సివుంది. అతడు శతక కొరతనూ తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లి చివరిసారి 2019 ఆగస్టులో వన్డే శతకం సాధించాడు. ఓపెనర్‌ ధావన్‌ కూడా దూకుడు పెంచాల్సివుంది. ఇక రాహుల్‌, పంత్‌, హార్దిక్‌ల ఫామ్‌ భారత్‌కు పెద్ద సానుకూలాంశం. అయితే బౌలర్‌గా హార్దిక్‌ సేవలను భారత్‌ ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటుందన్నది ప్రశ్న. ఇక భారత బౌలింగ్‌కు భువనేశ్వర్‌కు నాయకత్వం వహించనున్నాడు. జట్టు ఒకవేళ శార్దూల్‌కు విరామమివ్వాలనుకుంటే యార్కర్‌ స్పెషలిస్ట్‌ నటరాజన్‌ను తీసుకునే అవకాశముంది.
ఇంగ్లాండ్‌ హుషారుగా..: గత మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన ఇంగ్లాండ్‌ రెట్టించిన ఉత్సాహంతో ఆఖరి పోరుకు సిద్ధమైంది. స్టోక్స్‌ ఫామ్‌ను అందుకోవడం ఆ జట్టుకు పెద్ద సానుకూలాంశం. ఓపెనర్లూ జోరు మీదున్నారు. మార్క్‌వుడ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే.. టామ్‌ కరన్‌ స్థానంలో జట్టులోకి రావొచ్చు. మొత్తం మీద ఆఖరి సమరం ఆసక్తికరంగా సాగడం ఖాయం. టెస్టు, టీ20ల్లో మొదటి మ్యాచ్‌ ఓడిన జట్టు (భారత్‌) సిరీస్‌ గెలిచింది. వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఓడిపోయింది. మరి ఈసారి ఏం జరుగుతుందో?

పరుగులే పరుగులు..

పుణెలో బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌పై మరోసారి పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు కనీసం 350 పరుగులు చేస్తేనే విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు.

90

వన్డేల్లో ఆరు వేల పరుగుల మైలురాయిని అందుకున్న పదో భారత బ్యాట్స్‌మన్‌గా నిలవడానికి ధావన్‌ చేయాల్సిన పరుగులు.

303.20

పుణెలో గత అయిదు మ్యాచ్‌ల్లో సగటు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు. ఛేదించిన జట్టు మూడుసార్లు గెలిచింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన