కల చెదిరింది

ప్రధానాంశాలు

Published : 04/08/2021 02:42 IST

కల చెదిరింది

హాకీ సెమీస్‌లో బెల్జియం  చేతిలో భారత్‌ ఓటమి
ఇక జర్మనీతో కాంస్య పతక పోరు

హాకీలో ఒలింపిక్‌ స్వర్ణం.. ఒకప్పుడు భారత్‌ను దాటి మరొకరికి దక్కేది కాదు. ఇప్పుడు ఎంత పోరాడినా అది అందడం లేదు. పసిడి పతకం ఇంకోసారి కలగానే మిగిలిపోయింది. సెమీఫైనల్‌ చేరి ఆశలు రేపిన భారత పురుషుల జట్టు ఫైనల్‌ చేరడంలో విఫలమైంది. బెల్జియం అడ్డంకిని అధిగమించలేకపోయింది. ఆఖర్లో తడబడే బలహీనతను మరోసారి బయటపెట్టిన ఆటగాళ్లు సెమీస్‌లో ఓటమితో కాంస్య పోరుకు సిద్దమయ్యారు. 41 ఏళ్లుగా పతకం కోసం నిరీక్షిస్తున్న అభిమానులకు ఆ ఆనందమైనా దక్కుతుందేమో చూడాలి.

టోక్యో

భారత పురుషుల హాకీ జట్టు కల చెదిరింది..!  సెమీఫైనల్లో పోరాడినా ప్రపంచ ఛాంపియన్‌ బెల్జియం చేతిలో మన్‌ప్రీత్‌ సేన 2-5 గోల్స్‌తో ఓడిపోయింది. ఇక జర్మనీతో టీమ్‌ఇండియా కాంస్యం కోసం తలపడనుంది. సెమీస్‌లో మ్యాచ్‌ ఆరంభమైన రెండో నిమిషంలోనే (లుపెర్ట్‌) గోల్‌ కొట్టిన బెల్జియం భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. అయితే వెంటనే పుంజుకున్న మన్‌ప్రీత్‌ బృందం రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఏడో నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేస్తూ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌ కొట్టగా... ఆ తర్వాత నిమిషంలో అమిత్‌ నుంచి పాస్‌ అందుకున్న మన్‌దీప్‌ సింగ్‌ బంతిని గోల్‌పోస్టులోకి పంపాడు. అయితే భారత ఆధిక్యం ఎంతోసేపు నిలవలేదు. హెండ్రిక్స్‌ (19వ ని) గోల్‌ చేయడంతో స్కోరు 2-2తో సమం చేసిన బెల్జియం నెమ్మదిగా దాడులు పెంచింది.వాటిని సమర్థంగానే అడ్డుకున్న భారత్‌.. బెల్జియంను మరో గోల్‌ కొట్టనీయలేదు.

ఆ 15 నిమిషాలు: చివరి పదిహేను నిమిషాల్లో ఆట మొత్తం మారిపోయింది. అప్పటి వరకు పోరాడిన మన్‌ప్రీత్‌ బృందం ఉన్నట్టుండి నిస్తేజంగా మారింది. డిఫెన్స్‌లో లొసుగులు కనిపించాయి.. అటాకింగ్‌లో పదును లోపించింది. ఈ స్థితిలో అప్పటివరకు ఆడింది ఒక ఎత్తు.. నాలుగో క్వార్టర్‌లో ఆట మరో ఎత్తు అన్నట్టుగా చెలరేగిన బెల్జియం భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. భారత డిఫెన్స్‌లో లోపాలను ఆసరాగా చేసుకుంటూ ఆ జట్టు ఆటగాళ్లు దూసుకెళ్లగా.. దాడులు చేయడం మాని ఎంతసేపూ ప్రత్యర్థిని అడ్డుకోవడానికే భారత ఆటగాళ్లకు సమయం సరిపోయింది. 49వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన హెండ్రిక్స్‌ జట్టును 3-2తో ఆధిక్యంలో నిలబెట్టాడు. ఆ గోల్‌ దెబ్బ నుంచి కోలుకోకముందే పెనాల్టీ స్ట్రోక్‌ను సద్వినియోగం చేస్తూ హెండ్రిక్స్‌ (53వ ని) భారత గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ను బోల్తా కొట్టించడంతో 4-2తో ఆధిక్యంలోకి వెళ్లిన బెల్జియం చివర్లో జాన్‌ (60వ ని) గోల్‌ కొట్టడంతో 5-2తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ పోరులో ప్రత్యర్థికి భారత్‌ 14 పెనాల్టీ కార్నర్లు ఇవ్వగా...అందులో నాలుగింటిని బెల్జియం సద్వినియోగం చేసుకుంది.


‘‘సెమీఫైనల్లో కచ్చితంగా గెలవాలనే పట్టుదలతోనే ఆడాం. కానీ దురదృష్టవశాత్తూ నెగ్గలేకపోయాం. నిరాశపడే సమయం కాదిది. ఇప్పుడు మా దృష్టంతా కాంస్య పతక పోరుపైనే ఉంది. భారత్‌ కోసం ఆ పతకాన్ని గెలవడమే ప్రస్తుత లక్ష్యం’’ - మన్‌ప్రీత్‌


ప్చ్‌.. సోనమ్‌

బౌట్లో చివరి 35 సెకన్ల వరకూ ఆమెదే పైచేయి.. పైగా రెండు పాయింట్ల ఆధిక్యం! ఈ స్థితిలో ఎవరైనా ఆ రెజ్లర్‌ ఓడిపోతుందని ఊహిస్తారా.. కానీ భారత యువ కెరటం సోనమ్‌ మలిక్‌కు ఈ అనుభవం ఎదురైంది. కెరీర్‌లో తొలి ఒలింపిక్స్‌ ఆడుతున్న 19 ఏళ్ల సోనమ్‌ (62 కిలోలు) తొలి రౌండ్లో పోరాడి ఓడింది. ఆసియా ఛాంపియన్‌షిప్‌ రజత పతక విజేత కురెల్‌కు (మంగోలియా) చేతిలో ఓడింది. ఆరంభంలో దూకుడుగా ఆడి 2-0 ఆధిక్యంలో నిలిచిన సోనమ్‌.. ఆఖరి సెకన్లలో పట్టు కోల్పోయింది. కురెల్‌కు 2-2తో స్కోరు సమం చేసింది. చివరి పాయింట్‌ దక్కించుకున్నందుకు కురెల్‌కును రిఫరీ విజేతగా ప్రకటించాడు.


తూర్‌ విఫలం

షాట్‌పుట్‌లో తజిందర్‌ పాల్‌సింగ్‌ తూర్‌ విఫలమయ్యాడు. క్వాలిఫికేషన్‌లో గుండును 19.99 మీటర్ల దూరం విసిరిన అతడు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. 16 మంది పాల్గొన్న పోటీలో 13వ స్థానంలో నిలిచాడు. జావెలిన్‌ త్రోలో అన్నురాణి కూడా ఫైనల్‌ చేరలేకపోయింది. క్వాలిఫికేషన్‌లో జావెలిన్‌ను 54.04 మీటర్ల దూరమే విసిరిన ఆమె.. 14వ స్థానంతో పోటీని ముగించింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన