తీవ్రంగా కలత చెందా.. మౌనంగా ఉండలేను

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:35 IST

తీవ్రంగా కలత చెందా.. మౌనంగా ఉండలేను

జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌
ఆర్టికల్‌ 370 రద్దుకు రెండేళ్లు పూర్తి

శ్రీనగర్‌: ‘మౌలికమైన రాజ్యాంగ హక్కుల కోసం ప్రజలు సతమతం అవుతుంటే చూస్తూ ఉండలేను. గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా. ఓ రాజకీయ నాయకుడిగా ఎక్కువకాలం మౌనం పాటించలేను’ అంటూ జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) అగ్రనేత ఒమర్‌ అబ్దుల్లా బుధవారం మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని జమ్ము-కశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ కేంద్రం చేసిన ప్రకటనకు ఆగస్టు 5తో రెండేళ్లు పూర్తవుతాయి. ఈ రెండేళ్లలో ఏడు నెలలు తాము గృహనిర్బంధంలో గడిపిన రోజులను గుర్తుచేసుకొంటూ.. ‘అనూహ్యంగా, ఆకస్మికంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. దీంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు’ అని ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ కార్యకలాపాల నిర్వహణ నాకే కష్టంగా ఉంది. కానీ, సామెత చెప్పినట్టు.. ఇంద్రధనస్సు కావాలనుకుంటే, వర్షంలో తడవక తప్పదు. కాబట్టి, ప్రజలకు నా చేతనైనంత మంచి చేసేందుకు ప్రయత్నిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ‘జమ్మూకశ్మీర్‌ ప్రజల కోసం పోరాడుతూ మా పార్టీ కార్యకర్తలు, నేతలు వందలాదిగా ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలయ్యారు. నేను నిరాశకు గురైనపుడల్లా ఆ విషయం గుర్తొస్తుంది. ఇక చాలు అని పక్కకు వెళ్లలేను’ అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దును సుప్రీంకోర్టులో సవాలు చేయడంపై మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోదీతో ఇటీవల జరిగిన రాష్ట్ర నేతల సమావేశం ఫలితాల కోసం తాము ఎదురుచూస్తున్నట్లు ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. 

ఇది చీకటిరోజు : పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌

రెండేళ్ల కిందట జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన ‘ఆగస్టు 5’ను తాము చీకటిరోజుగా పాటిస్తామని, రాష్ట్ర చరిత్రలో ఇది అధికారం లాక్కొన్న రోజుగా గుర్తుండిపోతుందని పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్నాన్‌ అష్రఫ్‌ మిర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భారత సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన