మూడో ఉద్ధృతి వచ్చిందనడం తొందరపాటే!

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:35 IST

మూడో ఉద్ధృతి వచ్చిందనడం తొందరపాటే!

ఇంకా రెండోదే కొనసాగుతోంది..
సరిగా జాగ్రత్తలు పాటిస్తే మరో వేవ్‌ ఉండకపోవచ్చు
కేసులు పెరుగుతుండటంపై నిపుణుల అభిప్రాయం

దిల్లీ: చూస్తున్నాం కదా! చాలామంది మాస్కులను సరిగ్గా ధరించడం లేదు. దూరం అస్సలే పాటించడం లేదు. మార్కెట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. వ్యాక్సిన్ల కొరత ఉండనే ఉంది.  ఈ తరుణంలో చాలాచోట్ల కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్‌ వ్యాప్తిని సూచించే ‘ఆర్‌’ విలువ కూడా ఎక్కడికక్కడ హెచ్చరిక సంకేతాలిస్తోంది. అంటే... కరోనా మూడో ఉద్ధృతి ప్రారంభమైనట్టేనా? ఇది కూడా రెండో ఉద్ధృతి మాదిరే ప్రమాదకరంగా ఉంటుందా? అంతకుమించి కష్టాలు తెచ్చిపెడుతుందా? ఈ విషయాలపై నిపుణులు ఏమంటున్నారంటే...

దేశంలో కరోనా మూడో ఉద్ధృతి ప్రారంభమైందని ఇప్పుడే చెప్పడం సరికాదని నిపుణులు స్పష్టం చేశారు. రెండో దశ వ్యాప్తి ఇంకా ముగియలేదని హరియాణాలోని అశోకా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ గౌతమ్‌ మేనన్‌ పేర్కొన్నారు. ‘‘కేసులు పెరుగుతున్నా, మూడో వేవ్‌ ప్రారంభమైందని చెప్పడం తొందరపాటే అవుతుంది. వచ్చే కొద్ది వారాలే చాలా కీలకం. కేసుల పెరుగుదల ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమవుతుందా? లేక దేశ వ్యాప్తంగా ఉంటుందా అనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. కేరళలోని సెరో సర్వేను గమనిస్తే- ఆ రాష్ట్రంలో చాలామందికి వైరస్‌ ముప్పు ఉందని స్పష్టమవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు’’ అని మేనన్‌ చెప్పారు. ఐసీఎంఆర్‌ నిర్వహించిన సెరో సర్వే... కేరళలో తక్కువ మందిలోనే యాంటీబాడీలు ఉన్నట్టు తేల్చింది.

మూడో వేవ్‌ రాకపోవచ్చు!

*ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ సహా ఈశాన్య రాష్ట్రాల్లో మెజారిటీ జనాభాకు ఇప్పటికే కరోనా సోకింది. కాబట్టి వైరస్‌ విజృంభణ నెమ్మదిస్తుందని, మరో ఉద్ధృతి రాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ వచ్చినా, భీతావహ పరిస్థితులు ఉండవన్నది వారి అంచనా. వ్యాక్సినేషన్‌ పరిమితంగానే జరుగుతున్నా, కేసులు తగ్గడంలో టీకాల పాత్ర గణనీయంగా ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు.

ఆర్‌’ ఫ్యాక్టర్‌ సంగతి?

* కరోనా వ్యాప్తిని సూచించే ‘ఆర్‌’ ఫ్యాక్టర్‌... మే 7 తర్వాత తొలిసారి ఒకటి దాటినట్టు చెన్నైలోని మేథమెటికల్‌ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు చెప్పారు. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విలువ 1 కన్నా ఎక్కువగా (వైరస్‌ ఒకరి నుంచి ఒకరి కంటే ఎక్కువమందికి సోకడం) ఉన్నట్టు వివరించింది. ఆయా చోట్ల కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయడమే తక్షణ పరిష్కారమని దిల్లీకి చెందిన అంటువ్యాధుల నిపుణుడు చంద్రకాంత్‌ లహారియా చెప్పారు. కేసులు పెరగడాన్నే పరిగణనలోకి తీసుకోవాలి తప్ప, అది ఎన్నో ఉద్ధృతి అన్నది ప్రాధాన్యం కాదన్నారు.

కేసుల్లో పెద్దగా మార్పు లేదు

*మూడోదశ ప్రారంభమైనట్టు చెప్పలేమని శివ్‌నాడార్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ నేచురల్‌ సైన్సెస్‌ డీన్‌ సంచ్కీజీజివ్‌ గలాండే పేర్కొన్నారు. ‘‘దేశంలో వారం వారం నమోదవుతున్న సగటు కేసుల్లో పెద్ద మార్పులేదు. కాబట్టి కొత్త వేవ్‌ ప్రారంభమైందని ఇప్పుడే చెప్పలేం. జులై 19న కొత్త కేసులు 30 వేల దిగువకు వచ్చాయి. కొన్నిచోట్ల కేసులు పెరగడంతో 40 వేల మార్కు దాటుతున్నాయి’’ అని గలాండే పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన