జడ్జీలు బయటి ఒత్తిళ్లకు ప్రభావితం కారాదు

ప్రధానాంశాలు

Updated : 19/08/2021 05:15 IST

జడ్జీలు బయటి ఒత్తిళ్లకు ప్రభావితం కారాదు

నైతికత, చట్టబద్ధత నడుమ న్యాయమూర్తులకు నిత్యం ఊగిసలాట
జస్టిస్‌ సిన్హా వీడ్కోలు సమావేశంలో సీజేఐ జస్టిస్‌ రమణ

దిల్లీ: న్యాయమూర్తులు బయటి ఒత్తిళ్లకు ప్రభావితం కారాదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. ‘న్యాయం చేయాలనే తపనలో జడ్జీలు తరచూ నైతికత, చట్టబద్ధత మధ్య ఊగిసలాటకు గురవుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఒక అభిప్రాయానికి రావాలంటే నైతికంగా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆ అభిప్రాయం చాలామందికి రుచించకపోవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌ సిన్హా పదవీ విరమణ సందర్భంగా బుధవారం ‘సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌’ (ఎస్‌సీబీఏ) నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో సీజేఐ మాట్లాడారు.

ఆనందంగా మోసే భారం 

‘‘నైతిక నిష్ఠ, బలమైన విలువలు కలిగి, నమ్ముకున్న సిద్ధాంతానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే వ్యక్తి జస్టిస్‌ సిన్హా. ఒకసారి జడ్జీ పాత్రలోకి వెళ్లాక మన దురభిమానాలను, పక్షపాతాన్ని పక్కనపెట్టడానికి నిరంతరం ప్రయత్నించాలి. మన ముందున్న ప్రతి కేసుకూ సామాజిక కోణాలు ఉంటాయన్నది మరిచిపోకూడదు’’ అని జస్టిస్‌ రమణ చెప్పారు. సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలన్నీ జస్టిస్‌ సిన్హాలో ఉన్నాయని, అన్నింటినీ ఆయన సునాయాసంగా సమతుల్యం చేసుకుంటూ వచ్చేవారని కొనియాడారు. నైతికత, చట్టబద్ధత మధ్య మీమాంస తలెత్తినప్పుడు జడ్జీలు అనేకసార్లు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తులకు ఆ పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు. న్యాయాన్ని అందించడం ఒక పవిత్ర కర్తవ్యమే కాకుండా ఆనందంగా మోసే భారమని పేర్కొన్నారు. ఇలాంటి భారాన్ని జస్టిస్‌ సిన్హా అలవోకగా మోసేవారని చెప్పారు. ఎంతో విలువైన సహచరుడు తనకిప్పుడు దూరమవుతున్నారని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన