మొఘల్‌ వైభవం ‘కళ్ల’కు కట్టేలా..

ప్రధానాంశాలు

Published : 18/09/2021 04:53 IST

మొఘల్‌ వైభవం ‘కళ్ల’కు కట్టేలా..

వజ్రాలు, పచ్చలే దర్పణాలు
వేలానికి అలనాటి కళ్లజోళ్లు

లండన్‌: ఆ కళ్లజోళ్లను చూడటానికి రెండు కళ్లు సరిపోవు. వాటి ధర చెబితే మాత్రం కళ్లు తేలేయాల్సిందే. 17వ శతాబ్దంలో నాటివిగా భావిస్తున్న ఈ సులోచనాలను సోథబేస్‌ సంస్థ వచ్చే నెలలో వేలానికి పెట్టనుంది. ఇవి మొఘల్‌ చక్రవర్తులకు సంబంధించినవిగా భావిస్తున్నారు. ఈ కళ్లజోళ్ల జత రూ.35 కోట్లు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటిలో దర్పణాలకు బదులు వజ్రం, పచ్చలను వాడారు. వేలం వేయడానికి ముందు న్యూయార్క్‌, హాంకాంగ్‌, లండన్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. దీన్ని ధరించినవారికి జ్ఞానోదయం కలగడంతోపాటు, దుష్టశక్తులు దరిచేరవని నాడు విశ్వసించేవారు. ఇవి చాలా అరుదైన కళ్లజోళ్లు. మొఘల్‌ హయాంలో ఆభరణాల తయారీ నిపుణుల కళాచాతుర్యానికి ఇవి దర్పణం పడుతున్నాయని సోథబేస్‌ సంస్థ మధ్యప్రాచ్యం, భారత్‌ ప్రాంత ఛైర్మన్‌ ఎడ్వర్డ్‌ గిబ్స్‌ తెలిపారు. ఇలాంటి కళ్లద్దాలు మరెక్కడా లేవని ఆయన చెప్పారు. ఇందులో ఒక కళ్లజోడును ‘హాలో ఆఫ్‌ లైట్‌’గా పేర్కొంటున్నారు. దీన్ని 200 క్యారెట్‌ వజ్రాన్ని కట్‌ చేసి దర్పణాలుగా మలిచారు. ఈ వజ్రం గోల్కొండ ప్రాంతం నుంచి సేకరించి ఉండొచ్చని భావిస్తున్నారు. పచ్చ అద్దాలు కలిగిన రెండో కళ్లజోడును ‘గేట్‌ ఆఫ్‌ పారడైజ్‌’గా పిలుస్తున్నారు. 300 క్యారెట్ల కొలంబియన్‌ పచ్చతో దీన్ని తయారుచేసినట్లు భావిస్తున్నారు. ఈ కళ్లజోళ్ల ఫ్రేముపైనా విలువైన రాళ్లను ఆకర్షణీయంగా పొదిగారు.
వీటి తయారీకి విలువైన రాళ్లను వాడటాన్ని బట్టి చూస్తే వాటిని మొఘల్‌ చక్రవర్తి లేదా ఆస్థానంలో అత్యున్నత స్థాయి వ్యక్తి వీటిని ధరించి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన