ఆయువుపట్టుపై కరోనా దెబ్బ

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:28 IST

ఆయువుపట్టుపై కరోనా దెబ్బ

మహమ్మారి వల్ల పడిపోయిన సగటు ఆయుష్షు

లండన్‌: కొవిడ్‌-19తో ప్రపంచానికి వచ్చిపడ్డ చిక్కులపై రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఈ మహమ్మారితో మానవుల సగటు ఆయుర్దాయం పడిపోయిందని తాజాగా వెల్లడైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. అమెరికాలో పురుషుల సగటు ఆయుష్షు ఏకంగా 2.2 ఏళ్లు తగ్గిపోయింది. 2020లో సంభవించిన మరణాల ఆధారంగా బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం చేపట్టిన అధ్యయనంలో ఈ చేదు నిజాలు వెలుగు చూశాయి. ఆయుర్దాయాన్ని పెంచేందుకు ఏన్నో ఏళ్లుగా చేస్తున్న కృషిని కరోనా తుడిచిపెట్టేసిందని వెల్లడైంది. 29 దేశాల్లో సంభవించిన మరణాల సమాచారాన్ని విశ్లేషించి పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఐరోపాలోని అనేక దేశాలతోపాటు అమెరికా, చిలీపై ప్రధానంగా దృష్టి పెట్టారు. 2020కి సంబంధించి మరణాల అధికారిక నమోదును పరిశీలించారు. అధ్యయనంలో వెల్లడైన ముఖ్యాంశాలివీ..

* పరిశీలించిన 29 దేశాలకు గాను 27 దేశాల్లో సగటు ఆయుర్దాయం తగ్గిపోయింది.

* 2015తో పోలిస్తే 2020లో 15 దేశాల్లోని మహిళలు, 10 దేశాల్లోని పురుషులకు ఆయుర్దాయం తగ్గింది. 

* స్పెయిన్‌, ఇంగ్లాండ్‌- వేల్స్‌, ఇటలీ, బెల్జియం వంటి పశ్చిమ ఐరోపా దేశాల్లో చివరిసారి ఒక ఏడాదిలో ఈ స్థాయిలో ఆయుర్దాయం పడిపోవడం.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే జరిగింది.

* సగటు ఆయుర్దాయంలో మార్పులు అన్ని దేశాల్లో ఒకేలా లేవు. 22 దేశాల్లోని ప్రజలు సగటున ఆరు నెలల కన్నా ఎక్కువ ఆయుష్షును కోల్పోయారు. 8 దేశాల్లోని మహిళలు, 11 దేశాల్లోని పురుషులు ఏడాదికి పైగా జీవితకాలాన్ని నష్టపోయారు.

* ఏడాది ఆయుర్దాయాన్ని పెంచడానికి ఈ దేశాలకు సగటున 5.6 సంవత్సరాల సమయం పట్టింది.

* అధ్యయనం నిర్వహించిన మొత్తం 29 దేశాల్లో పురుషుల ఆయుర్దాయం మహిళలతో పోలిస్తే తగ్గిపోయింది. అత్యధికంగా అమెరికాలో పురుషుల సగటు జీవితకాలం 2019తో పోలిస్తే 2.2 ఏళ్లు తగ్గింది. లిథువేనియాలో 1.7 ఏళ్ల ఆయుష్షును పురుషులు కోల్పోయారు. పనిచేసే వయసులో ఉన్న వారు ఎక్కువగా చనిపోవడం వల్లే అమెరికాలో ఆయుర్దాయం భారీగా పడిపోయింది.

* అమెరికాలో 60 ఏళ్ల లోపు వారిలో మరణాల రేటు అధికంగా నమోదైంది. ఐరోపాలో మాత్రం 60 ఏళ్ల పైబడిన వారిలో ఈ రేటు ఎక్కువగా ఉంది. ఆయుర్దాయం తగ్గడానికి చాలా వరకు కరోనా మరణాలే కారణం.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన