సమర్థ పాలనకు 60 సూత్రాలు

ప్రధానాంశాలు

Updated : 20/10/2021 06:04 IST

సమర్థ పాలనకు 60 సూత్రాలు

మోదీ సర్కారు ప్రణాళిక

ఈనాడు, దిల్లీ: పరిపాలన ప్రక్రియను పదునెక్కించడానికి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) 60 సూత్రాల ప్రణాళికను సిద్ధం చేసింది. అన్ని మంత్రిత్వ శాఖల, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో జరిపిన సుదీర్ఘ సమావేశానంతరం ఈ కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. దీన్ని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు పంపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాలన సామర్థ్యాన్ని పెంచడం, సివిల్‌ సర్వీసులను మరింత ఆధునికీకరించడం, దేశంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని పెంపొందించడం- ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు. ప్రస్తుతం భారతీయ పౌరసత్వ నిర్ధారణకు సరైన ఆధార పత్రాలు లేవు. ఈ లోటును సరిచేయడానికి సాంకేతికతను ఉపయోగించి జనన ధ్రువీకరణ పత్రాన్ని పౌరసత్వంతో అనుసంధానించనున్నారు. అలాగే 10 నిర్దిష్ట రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించడానికి అవుతున్న ఖర్చును తగ్గించడానికీ ఉపక్రమించారు. వ్యాపారాలు చేపట్టదలచినవారికి ప్రభుత్వపరమైన అనుమతులను తక్షణం నోటిఫై చేయడం, అన్ని ప్రభుత్వ సేవలను ఏక గవాక్ష పద్ధతిలో పొందడం, వివిధ ప్రాజెక్టులకు, పరిశ్రమలకు సకాలంలో భూసేకరణ జరిపే రాష్ట్రాలకు సముచిత ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి ప్రణాళికలో అంతర్భాగాలు. రాష్ట్రాల్లో భూ రికార్డుల డిజిటలీకరణకు ప్రాధాన్యమిస్తారు. పర్యావరణ పరిరక్షణకు, నిర్వహణకు అమల్లో ఉన్న వేర్వేరు చట్టాలను ఒకే సమగ్ర చట్టం కిందికి తెస్తారు.

బడుగు విద్యార్థులకు లాప్‌టాప్‌లు

నూతన ప్రణాళికకు డిజిటలీకరణే ప్రాతిపదిక కాబట్టి, దాని అమలులో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ కీలక పాత్ర పోషించనున్నది. కేంద్ర పథకాలు, కార్యక్రమాలలో విధిగా డిజిటల్‌ సాంకేతికతను వినియోగించాలని కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా అన్ని శాఖల కార్యదర్శులకు తెలిపారు. విద్యార్థులకు ఉపకార వేతనాల చెల్లింపును కొత్త సాంకేతికతతో ఆధునికీకరించాలనీ, బడుగు విద్యార్థులకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన టాబ్లెట్‌లు, లాప్‌టాప్‌లు అందించాలనీ ప్రణాళిక లక్షిస్తోంది. మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన వివిధ అంశాల్లో అధికారులకు శిక్షణ ఇవ్వడం, ఉన్నత సివిల్‌ సర్వీసు అధికారులకు అధునాతన సాంకేతికతలను అలవర్చడం వంటివి చేపడతారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన