మూడో ప్రయత్నంలో విజేతలే అధికం

ప్రధానాంశాలు

Updated : 26/09/2021 05:04 IST

మూడో ప్రయత్నంలో విజేతలే అధికం

 సివిల్స్‌ సాధించే వారిలో 24% మంది వారే  

అబ్బాయిల కంటే అమ్మాయిలదే పైచేయి

ఈనాడు, హైదరాబాద్‌: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు మూడో ప్రయత్నంలో రాసినవారే అత్యధికంగా విజయం సాధిస్తున్నారు. ప్రాథమిక పరీక్ష రాసిన వారిలో 54.20 శాతం మంది మొదటిసారి దరఖాస్తు చేసిన వారే. అందులో 7.90 శాతమే చివరకు విజేతలుగా నిలిచారు. రెండో ప్రయత్నంలో 18 శాతం, మూడోసారి 24 శాతం, నాలుగోసారి రాసిన వారిలో 19.50 శాతం మంది విజయాన్ని సొంతం చేసుకున్నారు. విజేతల్లో 32.40 శాతం అంటే సుమారు మూడో వంతు మంది 25-26 వయసు వారే. యూపీఎస్‌సీ 70వ వార్షిక నివేదికలో సివిల్‌ సర్వీసెస్‌- 2018ని విశ్లేషించింది. అబ్బాయిల్లో 31.30 శాతం, అమ్మాయిల్లో 35.80 శాతం మంది 25-26 వయసులోనే విజేతలుగా నిలిచారు. ఈ వయసులో విజయం సాధిస్తున్న వారి శాతం ఏటా పెరుగుతోంది. ఈ వయోవర్గంలోని అబ్బాయిలు 2016లో 28.50 శాతం, 2017లో 31.70 శాతం విజేతలు కాగా, అమ్మాయిలు 2016లో 31.90 శాతం, 2017లో 33.10 శాతం ఎంపికయ్యారు. అబ్బాయిల కంటే అమ్మాయిల శాతం పెరుగుతోంది. మెయిన్‌ పరీక్ష 8,884 మంది అబ్బాయిలు రాసినా, 619 మంది (7 శాతం) మాత్రమే అత్యున్నత సర్వీసులు సాధించారు. అమ్మాయిలు కేవలం 1362 మంది మెయిన్‌ రాయగా, 193 మంది (14.20 శాతం) విజయం సాధించడం విశేషం.

ఇంజినీరింగ్‌ అభ్యర్థులే అధికం

* 2018 సివిల్స్‌లో మొత్తం 832 మందిని యూపీఎస్‌సీ ఎంపిక చేసింది. వారిలో 62.70% మంది ఇంజినీరింగ్‌ చదివినవారే. మానవీయ శాస్త్రాల (హ్యుమానిటీస్‌)కు చెందిన వారు 24.50%, సైన్స్‌- 6.90%, మెడికల్‌ సైన్స్‌ పూర్తి చేసిన వారు 5.90% ఉన్నారు.

* విజేతల్లో 85.10 శాతం మంది వారి మాతృభాషలతో పాటు మానవీయ శాస్త్రాలు ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న వారే.

* అత్యధికంగా జాగ్రఫీ, తర్వాత పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీలను ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకున్నారు. కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ ఎంచుకున్న వారిలో అత్యధికంగా 14.50 శాతం విజేతలుగా నిలిచారు. ఆ తర్వాత స్థానంలో న్యాయవిద్య (13.40 శాతం), ఆర్థికశాస్త్రం( 11.50 శాతం) అభ్యర్థులున్నారు.

* తెలుగులో ఇంటర్వ్యూకు హాజరైన వారు ముగ్గురు. తమిళం, కన్నడం ఆరుగురు చొప్పున, మరాఠీ 23 మంది, హిందీ 204 మంది...ఇలా మొత్తం 250 మంది హాజరయ్యారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన