close

తాజా వార్తలు

ఎదుగుదాం.. వెలుగుదాం!

వేసవి సెలవులంటే విద్యార్థులందరికీ ఇష్టం. తెల్లారకముందే హడావుడిగా నిద్రలేచి స్కూలుకో, కాలేజీకో పరుగులు పెట్టనవసరం లేదు. సరదాగా, సంతోషంగా, తీరిగ్గా కబుర్లతో, ఆటపాటలతో గడిపేయవచ్చు. అయితే... వినోదానికి చోటిస్తూనే బహుముఖ వికాసానికి ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. వ్యక్తిగత అభిరుచులను బట్టి  కొత్త వాటిపై దృష్టిపెట్టడం, పరిజ్ఞానం సాధించడం, మెరుగులు దిద్దుకోవడం.. ఇలా ఎన్నెన్నో చేయవచ్చు! సెలవులను గరిష్ఠంగా సద్వినియోగం చేసుకున్నామనే తృప్తినీ మిగుల్చుకోవచ్చు!

సెలవుల్లో మొదటి రెండు వారాలూ బాగానే అనిపిస్తాయి కానీ, తర్వాత బోర్‌ మొదలవుతుంది. స్నేహితులతో రోజంతా ఆటలాడుతూ ఉండలేం. వారాలకొద్దీ విహారయాత్రలూ కష్టమే. గంటలకొద్దీ నిద్రపోవటమూ విసుగెత్తించేదే. అందుకే... మన ఖాళీ సమయాన్ని కెరియర్‌కు ఉపయోగపడేలా చేసుకోవటం తెలివైన పని కదా? వేసవి సెలవుల్లో చేయదగ్గ కార్యకలాపాలను నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు. 1) నైపుణ్యాలు 2) ఇంటర్న్‌షిప్పులు 3) పర్యటన 4) స్వచ్ఛంద సేవ. వీటిలో కొన్నిటిలోనైనా పాల్గొంటే, శ్రద్ధగా నేర్చుకుంటే వ్యక్తిగతంగా ఎంతో మేలు జరుగుతుంది. బిడియం తగ్గించుకోవటం, కొత్త వ్యక్తులను చొరవగా స్నేహితులుగా చేసుకోవటం, తెలియని సంగతులు తెలుసుకోవటం.. ఇవన్నీ ప్రయోజనాలే!


నైపుణ్యాలు

సంగీత వాద్యాలు: ఏదైనా సంగీతవాద్యంలో ప్రవేశం ఉండటమనేది కళాశాలలో అందరు విద్యార్థుల్లోనూ ప్రత్యేకంగా నిలిపే నైపుణ్యం. దీన్ని ప్రదర్శించి నలుగురి మెప్పునూ పొందటం విజయంలోని రుచిని అనుభవంలోకి తెస్తుంది. ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచుతుంది.  గిటార్‌, డ్రమ్స్‌, పియానోలాంటివి నేర్పడానికి చాలా సంస్థలు వేసవిలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంటాయి. మ్యూజిక్‌ పుస్తకాలూ, వీడియోలను కూడా ఉపయోగించుకోవచ్చు. వెసులుబాటు ఉన్నవారు నలుగురైదుగురు మిత్రులతో కలిసి ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించుకుని అభ్యసించవచ్చు. 


క్రీడలు: శారీరకంగా ఫిట్‌నెస్‌ పెంచుకోవడంపై యువతలో అవగాహన పెరిగింది. టెన్నిస్‌, ఈత లాంటి వ్యక్తిగత క్రీడలు నేర్చుకుంటే ఆరోగ్యం, శారీరకంగా దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. పైగా ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌పై ఆసక్తి కూడా ఏర్పడుతుంది. క్రీడా నైపుణ్యం వల్ల విద్యార్థి బయోడేటాకు అదనపు విలువ వస్తుంది. శారీరక సామర్థ్యం పెరగడం వల్ల చదువుపై ఏకాగ్రత ఎక్కువవుతుంది. 


ఆర్ట్స్‌- క్రాఫ్ట్స్‌: సృజనాత్మకతకు సాన పెట్టుకోవాలంటే వీటిపై మొగ్గు చూపడం మేలు. ఆసక్తిని బట్టి ఫొటోగ్రఫీ,  కొవ్వొత్తుల ఉత్పత్తి, ఒరిగామి (కాగితంతో డెకరేటివ్‌ కళాకృతుల తయారీ) లాంటివెన్నో నేర్చుకోవటానికి అవకాశమిచ్చే తరుణమిది. పెద్దగా ఖర్చు కాకుండా స్వల్పవ్యవధిలోనే ఇవి నేర్చుకోగలిగినవి. సమ్మర్‌ ఆర్ట్స్‌- క్రాఫ్ట్స్‌ తరగతులు స్థానిక గ్రంథాలయాల్లో, పార్కుల్లో, రిక్రియేషన్‌ క్లబ్బుల్లో నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్లో నేర్పే ట్యుటోరియల్స్‌ కూడా చాలా ఉంటాయి. 


వెబ్‌సైట్‌: యువతరం ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో గంటలతరబడి కూరుకుపోవటం మామూలే కదా?ఈ సెలవుల్లో కొంచెం మార్పు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఏమీ లేకుండా కూడా WordPress.com లాంటి వేదికల సాయంతో వెబ్‌సైట్‌ను సొంతంగా తయారుచేసుకోవచ్చు. ఆన్‌లైన్లో ఉచిత ట్యుటోరియల్స్‌ చూసీ, లేదా యూట్యూబ్‌ వీడియోల ద్వారా వెబ్‌సైట్‌ తయారీ ప్రాథమిక సూత్రాలు ఇట్టే తెలుసుకోవచ్చు. demy, Coursera లాంటి విద్యాపరమైన వెబ్‌సైట్లు ‘హౌటు క్రియేట్‌ ఎ వెబ్‌సైట్‌?’ అనే అంశంపై బేసిక్‌ కోర్సులను అందిస్తున్నాయి. వాటిలో చేరి తగిన పరిజ్ఞానం పొందవచ్చు. సొంత ఆలోచనలకు తగిన విధంగా ఒక చిన్న వెబ్‌సైట్ను తయారు చేసుకోవచ్చు. ఇలాంటి సృజనాత్మక నైపుణ్యాలు భవిష్యత్తులో ఉద్యోగాలను సులువుగా పొందడానికి సహకరిస్తాయి.


ఇంటర్న్‌షిప్‌లు

విద్యార్థి దశలోనే పరిశ్రమ, అక్కడి పని వాతావరణాల గురించి తెలుసుకునే అవకాశం కల్పించేవే ఇంటర్న్‌షిప్‌లు. కోర్సు తర్వాత చేయదలిచిన ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్న్‌షిప్‌లు చేస్తే ఉపయోగకరం. సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లను హైస్కూలు, కళాశాల దశల్లో చేయవచ్చు. స్టైపెండ్‌లాంటివి రాకపోయినా ఇంటర్న్స్‌గా గడించిన అనుభవానికి ఎంతో విలువ ఉంటుంది. 

గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించడానికి తోడ్పడే మార్గం కూడా! ఇంజినీరింగ్‌ విద్యార్థుల విషయానికొస్తే.. ఏఐసీటీఈ దీన్ని తప్పనిసరి కూడా చేసింది. అలాగే వారికి సాయమందించేలా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఎక్కడున్నాయో కూడా తెలియజేస్తోంది.


కొత్త భాషలు: ఆసక్తి ఉన్న కొత్త భాషను నేర్చుకోవటం ఉత్తేజకరంగా ఉంటుంది. ఆ భాషా కోర్సులో పేరు నమోదు చేసుకోవటం మరీ రొటీన్‌ అనిపిస్తే... ఆ భాష నేర్పే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, సొంతంగా ప్రాథమిక పాఠాలు పూర్తిచేసుకోవచ్చు. ఆ భాషలో సినిమాలూ, షార్ట్‌ ఫిల్ములూ చూస్తే, మీ అవగాహన స్థాయి అంచనా వేసుకోవచ్చు. కొత్త పదాల సహజ వాడకం తెలిసొస్తుంది. ఆ భాషలో నిర్వహించే కార్యక్రమాలకు హాజరవటం వల్ల  స్నేహాలూ పెరుగుతాయి.


టీఐటీఏ డిజిథాన్‌: తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీఐటీఏ) నాణ్యమైన శిక్షణ, పరిజ్ఞానం, అనుభవం కోసం ఇంటర్న్‌షిప్‌లను ఎంచుకునే ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది.  సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ అంశాల్లో ఇంటర్న్‌షిప్‌ అందిస్తోంది. యూఎస్‌, సింగపూర్‌, దక్షిణాఫ్రికా, కెనడాల్లో చేసే అవకాశాలనూ కల్పిస్తోంది. bit.ly/tita_internship లో నమోదు కావాల్సి ఉంటుంది. http://tita.rf.gd/digithon/


ఏఐసీటీఈ పోర్టల్‌: ఇంటర్న్‌షిప్‌ల కోసం వివిధ వెబ్‌సైట్లపై ఆధారపడకుండా ‘ఏఐసీటీఈ ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంటర్న్‌షిప్‌ అవకాశాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దీనిలో విద్యార్థి తన వివరాలను నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులతోపాటు ఫ్యాకల్టీకీ ఇంటర్న్‌షిప్‌ అవకాశముంది. విద్యార్థి నేరుగా అయినా, తన విద్యాసంస్థ ద్వారా అయినా నమోదు కావొచ్చు. నమోదైనవారికి దేశీయ, అంతర్జాతీయ, ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, నగరాలు, కేటగిరీల వారీగా అందుబాటులో ఉన్న ఇంటర్న్‌షిప్‌ అవకాశాల గురించి తెలుసుకునే వీలుంటుంది. ఇందుకుగానూ ఏఐసీటీఈ ఇంటర్న్‌శాలతో ఒప్పందం కూడా చేసుకుంది. విద్యార్థులు తమ ఆసక్తి మేరకు ఇంటర్న్‌షిప్‌లను నచ్చినవిధంగా ఎంచుకోవచ్చు. http://www.internship.aicte-india.org/


పర్యటనలు

చారిత్రక ప్రాంతాల సందర్శన: విద్యార్థులకు తాము పుట్టి పెరిగిన ప్రాంతం చరిత్ర, అక్కడి భౌగోళిక పరిస్థితులు, పంటలు, సహజ వనరుల గురించి తెలిసివుండాలి. సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూల్లో అభ్యర్థి స్థానికతపై సాధారణంగా ప్రశ్నలు తప్పనిసరిగా వస్తుంటాయి. ఈ సెలవుల్లో మీ జిల్లాలోనూ, చుట్టుపక్కలా ఉన్న చారిత్రక ప్రదేశాలను సందర్శించి వాటి విశేషాలను గ్రహించండి. పురావస్తు ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలు చూసి.. వాటి చరిత్ర, కట్టడాల, శిల్పాల ప్రత్యేకతలను వివరంగా తెలుసుకోండి.
వీలుంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న పర్యటక ప్రదేశాలకూ వెళ్లటం, అక్కడి జనజీవన శైలిని గమనించటం చేస్తే పరిశీలనా శక్తి పెరుగుతుంది. ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది.
ప్రసిద్ధ మ్యూజియంలకు వెళ్లి అక్కడున్న వస్తువుల, శిల్పాల, చిత్రాలను పరిశీలించటం, నాటి చరిత్రను తెలుసుకోవటం ఆహ్లాదకరమూ, విజ్ఞానదాయకం కూడా. సందర్శించిన ప్రదేశాల ఘనతనూ, శిల్పకళా విశేషాలనూ ఆసక్తికరంగా ‘ట్రావెలాగ్స్‌’ రాయటం మంచి అలవాటు.వాటికి ఫొటోలు జోడించి సొంత వెబ్‌సైట్‌/బ్లాగులో పెట్టటం వల్ల అందరి ప్రశంసలూ లభిస్తాయి. 


స్వచ్ఛంద సేవ

పర్యావరణం: పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన ఉంటే సరిపోదు. ప్రజల్లోనూ తగిన అవగాహన పెంచాలి. దీనికి ఆచరణాత్మకంగా ఈ సెలవుల్లో కృషి చేయవచ్చు. పరిసరాల పరిశుభ్రతలో అందరినీ భాగస్వామ్యం చేసి, ఉత్సాహంగా పాల్గొనవచ్చు. ప్లాస్టిక్‌, క్యారీ బ్యాగుల వినియోగం తగ్గించే ప్రచారం, సహజ వనరుల పరిరక్షణ (జల సంరక్షణ..)పై చైతన్యపరిచే కార్యక్రమాలు, స్థానిక స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల్లో భాగం కావటం మొదలైనవి. స్నేహితులతో కలిసి మొక్కలను నాటటం, చెట్ల సంరక్షణ, నీటి వృథాను అరికట్టటం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. వారిలోనూ అవగాహన పెరుగుతుంది.
వృద్ధాశ్రమాలను సందర్శించి అక్కడున్నవారికి మిత్రబృందంతో కలిసి సేవాకార్యక్రమాలు నిర్వహించవచ్చు. అనాధ పిల్లల ఆశ్రమాలకు వెళ్ళి వారికి ఉపయోగపడే సాయం చేయవచ్చు. దీని వల్ల పిల్లల్లో సామాజిక బాధ్యత పెరుగుతుంది. సమాజం పట్ల ఏ విధంగా స్పందించాలో అర్థమవుతుంది. మంచి పౌరులుగా ఎదుగుతారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.