close

తాజా వార్తలు

Updated : 18/02/2019 04:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బోరు నీరు... ఉప్పు తయారు!

ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రపు నీటి నుంచి...మరి బోరు నీటి నుంచి ఉప్పు తయారవడం మీరెప్పుడైనా చూశారా?

భారతదేశం ఓ  ఉప్పుగని. విశాలమైన సముద్రతీరం ఉండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఉప్పు తయారవుతుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉప్పు సాగు ఉంది. తీరప్రాంత భూముల్లో వేలాది ఎకరాలను సముద్రపు నీటితో నింపుతారు. ఆ నీరంతా ఎండ తీవ్రతకు ఎండి ఉప్పు మిగులుతుంది. అలా తయారైన ఉప్పును యంత్రాలతో తీస్తారు. ఇది సాధారణంగా ఉప్పు తయారయ్యేవిధానం...

కానీ.. 
ప్రకాశం జిల్లా చినగంజాం, నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాల్లో చాలా భిన్నమైన పద్ధతిలో ఉప్పు తయారవుతుంది. బోర్ల నుంచి వచ్చే నీటితో ఉప్పు పండిస్తారు. ఈ ప్రాంతాల్లో కమతాల విస్తీర్ణం చాలా తక్కువ. సముద్రపు నీటిని తీసుకొచ్చి మడుల్లో నింపి ఉప్పు సాగు చేసే అవకాశం ఇక్కడ లేదు. దీంతో ఇక్కడ భిన్నమైన పద్ధతిని అనుసరించక తప్పలేదు. మోటార్ల ద్వారా భూగర్భ జలాలను తోడి ఆ నీటితో ఉప్పు తయారు చేస్తున్నారు.

ఏం చేస్తారంటే.. 
ఉప్పు తయారీకి లవణీయత ఎక్కువగా ఉన్న నీరు కావాలి. ఈ తీర ప్రాంతపు భూగర్భంలో ఇలాంటి నీరు పుష్కలంగా ఉంది. పైగా 40 నుంచి 50 అడుగుల లోపే ఇలాంటి జలం ఉంది. ఉప్పు పండే భూములను ఉప్పు కొఠారులంటారు. ఇక్కడ బోర్ల నుంచి నీటిని తోడినప్పుడు అందులో 5 నుంచి 7 శాతం లవణీయత ఉంటుంది. దాన్ని సన్నటి కాలువల ద్వారా గంజేర్లలోకి పంపుతారు. గంజేర్లు అంటే పైకప్పులేని రిజర్వాయర్లు. గంజేరులో ఎండ తీవ్రతనుబట్టి ఐదారు రోజులు ఉంచుతారు. అక్కడ నీటిలో ఉప్పుసాంద్రత 10 నుంచి 18 శాతానికి చేరుకుంటుంది. ఆ తర్వాత గంజేర్ల నుంచి ఎడమడి అనే మడుల్లోకి నీటిని పంపుతారు. అక్కడ కొద్దిరోజుల్లో ఉప్పు శాతం 24కు చేరుతుంది. అక్కడి నుంచి ఉప్పు తయారయ్యే పంట మడుల్లోకి ఈ నీటిని తరలిస్తారు. పంట మడిలో ఉప్పు శాతం 28కి చేరుతుంది. ఎడమడి నుంచి పంట మడికి నీరు తరలించిన కొన్న గంటల నుంచే ఉప్పు తయారు కావడం ప్రారంభమవుతుంది. పంట మడికి చేరిన ఆరేడు రోజుల్లోనే ఉప్పును తీస్తారు.

ఏమేమి చేస్తారు 
మిగిలిన ప్రాంతాల్లో ఉప్పు తయారీ సహజ ప్రక్రియ అయితే... ఇక్కడ ఉప్పు కొఠారుల్లోని పనులన్నీ మనుషుల శ్రమ, తెలివితేటలపై ఆధారపడి ఉంటాయి. నిరంతరం పర్యవేక్షణతో ఇక్కడ ఉప్పు తయారవుతుంది. దీంతో కొన్ని వేల మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఏటా నవంబరు నెలలో కొఠారు పనులు ప్రారంభిస్తారు. ఉప్పు సాంద్రతను హైడ్రోమీటరు ద్వారా రైతులు ఎప్పటికప్పుడు పరీక్షిస్తుంటారు. జనవరి నుంచి ఉప్పు తీతలు తీస్తారు. ఇదండీ మోటారు నీళ్ల ద్వారా ఉప్పు తయారీ కథ...

- పల్లపోలు పుండరీకాక్షయ్య, చిన్నగంజాం

Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని