close

తాజా వార్తలు

అదిరే.. అదిరే బోణీ అదిరే

ఐపీఎల్‌ ప్రతి సంవత్సరం వచ్చేదే.. అయినా షెడ్యూల్‌ విడుదల మొదలు సీజన్‌ ముగింపు వరకు అభిమానుల కోలాహలం అంతాఇంతా ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే క్రికెట్‌ అభిమానులకు ఐపీఎల్‌ ఓ పండుగ. సాధారణంగా సీజన్‌ మొదటి మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్లు బరిలోకి దిగుతాయి. అందుకే మొదటి మ్యాచ్‌పై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. మరి 11 సీజన్ల ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ జరిగిన మొదటి మ్యాచ్‌లేంటి..? ఆ మ్యాచ్‌లో ఛాంపియన్లను మట్టికరిపించిందెవరు..? తదితర వివరాలన్నీ మీకోసం..

ఆరంభం అదుర్స్‌

2008, ఏప్రిల్ 8న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్‌ ప్రారంభమైంది. రాహుల్‌ ద్రవిడ్‌ సారథ్యంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గంగూలీ సారథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు పోరుకు సిద్ధమయ్యాయి. టాస్‌ గెలిచిన బెంగళూరు కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ బ్రెండన్‌ మొక్కల్లమ్‌ మొదటి మ్యాచ్‌లోనే అభిమానలకు అసలైన ఐపీఎల్‌ మజాను రుచి చూపించాడు. కేవలం 73 బంతుల్లో 13 సిక్సర్లు, 10 ఫోర్లతో 158 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా 222 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 82పరుగులకే చాపచుట్టేసింది. ప్రవీణ్‌కుమార్‌(10) తప్ప మరే బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు చేయలేదు. దీంతో ఆ మ్యాచ్‌లో కోల్‌కతా 140 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.    

ముంబై బోణీ

2009, ఏప్రిల్18న.. రన్నరప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన చెన్నై బౌలింగ్‌ ఎంచుకుంది.  మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ జట్టు సారథి సచిన్‌ తెందూల్కర్‌ 49 బంతుల్లో 59 పరుగులు చేయడంతో ముంబై 166 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఛేదనలో చెన్నై బ్యాట్స్‌మెన్‌ తడబడటంతో 146పరుగుల మార్కు మాత్రమే చేరుకోగలిగింది. ముంబయి ఇండియన్స్‌ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. సచిన్‌ను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వరించింది.

కోల్‌కతా రెండో బోణీ

2010 మార్చి 12న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ దక్కన్‌ ఛార్జర్స్‌ హైదరాబాద్‌, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 161 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టులో కెప్టెన్‌ గిల్‌క్రిస్ట్‌ 54 పరుగులు మినహా ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో ఏడు వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. 11 పరుగుల తేడాతో హైదరాబాద్‌ ఓడిపోయింది. 46 బంతుల్లో 58 పరుగులు చేసిన మ్యాథ్యూస్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఉత్కంఠపోరులో చెన్నై విజయం

2011, ఏప్రిల్‌ 8న డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన చెన్నై బ్యాటింగ్‌కు దిగింది. 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో కోల్‌కతా 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. దీంతో స్వల్ప తేడాతో చెన్నై గెలిచింది.

డిఫెండింగ్‌ను ఓడించిన ముంబయి

2012, ఏప్రిల్‌ 4న మళ్లీ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సీఎస్‌కే, ముంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌. టాస్‌ గెలిచిన ముంబయి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ముంబయి బౌలర్లు విజృంభించడంతో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై 112 పరుగులకే చాపచుట్టేసింది. తర్వాత 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.5 ఓవర్లలో ముంబయి విజయం సాధించింది.

కోల్‌కతా ముచ్చటగా మూడు

2013, ఏప్రిల్‌ 3న అప్పటి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా, దిల్లీ డేర్‌ డెవిల్స్‌ మధ్య మ్యాచ్‌. టాస్‌ గెలిచిన కోల్‌కత ప్రత్యర్థికి మొదటి బ్యాటింగ్‌ చేసేందుకు అవకాశమిచ్చింది. దిల్లీ బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించకపోవడంతో 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.  నాలుగు వికెట్లు తీసిన సునీల్‌ నరైన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

కోల్‌కతా నాలుగోసారి

2014, ఏప్రిల్ 16న అబుదాబిలోని షేక్‌ జయిద్‌ మైదానంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, మాజీ ఛాంపియన్‌ కోల్‌కతా నైడరైడర్స్‌ జట్ల మధ్య పోరు మొదలైంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్‌ ఎంచుకుంది. 164 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఛేదనలో ముంబయి బ్యాట్స్‌మెన్‌ 122 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో కోల్‌కతా 41పరుగులతో విజయం సాధించింది. 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేసిన కల్లీస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. 

కోల్‌కతా ఐదోసారి

2015, ఏప్రిల్‌ 8న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్, మాజీ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా సారథి గౌతం గంభీర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి జట్టులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెచ్చిపోయి 65 బంతుల్లోనే 12ఫోర్లు, 4 సిక్సర్లతో 98 పరుగులు చేశాడు.  దీంతో ము 169 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతాకు నిర్దేశించింది. ఛేదనకు దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలోనే విజయం సాధించింది. 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన మోర్నీ మోర్కెల్‌ను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

లేటుగా వచ్చినా లేటెస్టు విజయం

2016, ఏప్రిల్‌ 9 డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, అప్పుడే కొత్తగా లీగులో ప్రవేశించిన రైసింగ్‌ పుణె మధ్య మ్యాచ్‌ మొదలైంది. ఆ మ్యాచ్‌లో ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన పుణె.. ఛాంపియన్‌ జట్టు ముంబయిని 9 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ కేవలం 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పుణె బ్యాట్స్‌మన్‌ రహానే చెలరేగడంతో కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో 66 పరుగులు చేసిన అజింక్య రహానే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఛాంపియన్‌లా సన్‌రైజర్స్‌

2017, ఏప్రిల్‌ 5 డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, ఇంతవరకూ ట్రోఫీ గెలవని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్. టాస్‌ గెలిచిన బెంగళూరు సారథి షేన్‌ వాట్సన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌సింగ్‌ చెలరేగి 27 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు.  బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో హైదరాబాద్ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. ఛేదనకు దిగిన 35పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛేదనలో బెంగళూరు 172 పరుగులు మాత్రమే చేయడంతో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఉత్కంఠ రేపిన ఛాంపియన్ల పోరు

2018, ముంబయి వేదికగా అప్పటికే మూడు సార్లు కప్పు గెలిచిన ముంబయి, రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన చెన్నై ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 165 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై 9 వికెట్లు కోల్పోయి ఆఖరి ఓవర్లో ఐదో బంతికి విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో 68 పరుగులు చేసిన డ్వేన్‌ బ్రావో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.