
తాజా వార్తలు
అమరావతి : అసెంబ్లీ ఎన్నికలో భారీ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్న వైకాపా అధినేత జగన్‌కు పోలీసులు భద్రత పెంచారు. తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కొత్త ముఖ్యమంత్రి కోసం సరికొత్త కాన్వాయ్ కూడా సిద్ధమైంది. అధునాతన సౌకర్యాలు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలతో కూడిన నూతన వాహనశ్రేణి జగన్ నివాసానికి చేరుకుంది. మొత్తం 6 వాహనాలతో ఈ కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు. AP 18P 3418 నంబర్‌తో కొత్త వాహనాలను ఆయన ఇంటివద్ద సిద్ధంగా ఉంచారు. ఈ నెల 30 జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా పెంచారు.
మరోవైపు జగన్‌ను కలిసి అభినందించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివస్తున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది.