close

తాజా వార్తలు

అభిమానులు మెచ్చిన ‘ఆల్‌రౌండర్‌’

పోటీ..! ఈ పదం వినిపించని చోటుందా?అందుకు ఏ రంగానికైనా మినహాయింపు ఉందా?ప్రస్తుతం ఏదో ఒక అంశంలో నైపుణ్యం ఉంటే సరిపోదు. అందుకే బృంద క్రీడైన క్రికెట్లో ఆల్‌రౌండర్లకు ఎనలేని ప్రాధాన్యం నెలకొంది. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనప్పుడు వారు బ్యాటుతో ఆదుకుంటారు. ప్రధాన బౌలర్లు ఇబ్బంది పడుతున్నప్పుడు బంతితో వికెట్లు తీస్తారు. జట్టు కూర్పును మరింత మెరుగుపరుస్తారు. సమతూకం పెంచుతారు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లోనూ కొందరు ఆల్‌రౌండర్లు ఇదే పనిచేస్తున్నారు. ఇంతకీ వారెవరు?ఏం సాధించారో ఓ సారి చూద్దామా!!

ఎదురు చూసిన ఆటగాడు

భారత క్రికెట్‌లో ఎంతోమంది బ్యాటు, బంతితో రాణించారు. అందులో ఎక్కువగా స్పిన్నర్‌ ఆల్‌రౌండర్లే ఉన్నారు. టీమిండియాకు తొలిసారి ప్రపంచకప్‌ అందించిన కపిల్‌దేవ్‌ తర్వాత ఆ స్థాయిలో ఫాస్ట్‌బౌలర్‌ ఆల్‌రౌండర్‌ కనిపించలేదు. ఇర్ఫాన్ పఠాన్‌లాంటి వాళ్లు వచ్చివెళ్లారు. వారిలో తీవ్రత తక్కువ. నిలకడ లేమి ఎక్కువ. అలా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జట్టుకు దొరికిన తురుపుముక్క హార్దిక్‌ పాండ్య. భీకర షాట్లతో విరుచుకుపడే అతడు భయపెట్టే బౌన్సర్లు వేయగలడు. ఈ ప్రపంచకప్‌లో 3 ఇన్నింగ్సుల్లో 89 పరుగులు చేశాడు. జట్టులో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ 167 అతడిదే. బౌలింగ్‌లో అంత ఆకట్టుకోలేదు గానీ పాక్‌ మ్యాచ్‌లో కీలక సమయంలో 2 వికెట్లు తీశాడు. అత్యంత ఒత్తిడిలో హోరాహోరీగా సాగిన ఆసీస్‌ మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 48 పరుగులు సాధించి స్కోరును 300 దాటించాడు. ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికాపై బౌలింగ్‌లో 0/31, బ్యాటింగ్‌లో 15*; ఆస్ట్రేలియాపై 48, 0/68; పాకిస్థాన్‌పై 26, 2/44 గణాంకాలు నమోదు చేశాడు.

అగ్రశ్రేణి ఆణిముత్యం

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో బెన్‌స్టోక్స్‌ అగ్రస్థానంలో ఉంటాడు. అతడి బౌలింగ్‌, బ్యాటింగ్‌ భీకరంగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యంత నిలకడగా రాణించగలడు. ప్రతి సందర్భంలోనూ ఇంగ్లాండ్‌కు అండగా నిలుస్తాడు. ఆ జట్టు 400పైగా స్కోర్లు సాధించడంలో అతడి పాత్ర కీలకం. ఈ ప్రపంచకప్‌లో 5 ఇన్నింగ్సుల్లో 5 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో టాప్‌ ఆర్డర్‌ నిలకడగా ఆడుతుండటంతో ఎక్కువ పరుగులు చేసేందుకు అవకాశం రాలేదు. అయినప్పటికీ 5 ఇన్నింగ్సుల్లో 30 సగటుతో 120 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాపై 89, 2/12; పాక్‌పై 0/43, 13, బంగ్లాపై 6, 3/23, విండీస్‌పై 0/25, 10*; అఫ్గాన్‌పై 2, 0/12తో రాణించాడు.

బంగ్లా ‘షేర్‌’

ప్రపంచ క్రికెట్లో నిఖార్సైన ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌. ఈ ఆటలో బంగ్లా సాధించిన పురోగతిలో అతడి పాత్ర ఎంతో కీలకం. పసికూనగా ఉన్నప్పుడే పెద్ద జట్లపై మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆడేవాడు. ఈ ప్రపంచకప్‌లోనూ ఆ జట్టు 300 పైచిలుకు లక్ష్యాలు ఛేదిస్తోందంటే కారణం షకిబే. అవసరమైన ప్రతిసారీ బంతితో రాణించాడు. ఇక 4 ఇన్నింగ్సుల్లో 128 సగటుతో 384 పరుగులు చేశాడు. ఛేదనలో రెండు శతకాలు చేశాడు. 5 వికెట్లు తీశాడు. మెగా టోర్నీలో దక్షిణాఫ్రికాపై 75, 1/50; న్యూజిలాండ్‌పై 62, 2/47; ఇంగ్లాండ్‌పై 0/71, 121; విండీస్‌పై 2/54, 124*తో అదరగొట్టాడు.

మోరిస్‌ ‘వేదన’

ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతోంది. బలమైన జట్టే అయినా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. అయితే క్రిస్‌ మోరిస్‌ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాడు. బంతితో ఎక్కువగా రాణిస్తున్నాడు. బ్యాటుతో ఇంకా మెరుగైన ప్రదర్శన చేయలేదు. తొలి మ్యాచ్‌కు ఎంపికవ్వని అతడు లుంగి ఎంగిడికి గాయం కావడంతో జట్టులోకి వచ్చాడు. 5 ఇన్నింగ్సుల్లో 9 వికెట్లు పడగొట్టాడు. సఫారీ బృందంలో అత్యధిక వికెట్లు తీసింది అతడే కావడం గమనార్హం. 3 ఇన్నింగ్సుల్లో 58 పరుగులు చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు భారత్‌పై 42 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బంగ్లాపై 2/73, 10; భారత్‌పై 42, 1/36; అఫ్గాన్‌పై 3/13; న్యూజిలాండ్‌పై 6*, 3/49తో రాణించాడు. విండీస్‌ మ్యాచ్‌ వర్షార్పణమైంది.

చాపకింద నీరు ‘డి’

ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరుమీదుంది న్యూజిలాండ్‌. ఆటగాళ్లందరూ సమష్టిగా రాణిస్తున్నారు. కివీస్‌లో బ్యాటు, బంతితో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో అతడి దూకుడు ఆకట్టుకుంది. కీలక సమయంలో ఒత్తిడి చంపేస్తున్నా 60 పరుగులు చేశాడు. వికెట్లు పడుతున్న సమయంలో సారథికి అండగా నిలిచాడు. 4 మ్యాచుల్లో అతడు 4 వికెట్లు పడగొట్టాడు. టాప్‌ఆర్డర్‌ రాణిస్తుండటంతో బ్యాటింగ్‌ అవకాశాలు రాలేదు. అయితే 2 ఇన్నింగ్సుల్లో 37 సగటుతో 75 పరుగులు చేశాడు. శ్రీలంకపై 1/14; బంగ్లాపై 1/39, 15; అఫ్గాన్‌పై 1/14; దక్షిణాఫ్రికా 1/33, 60 అదుర్స్‌ అనిపించాడు.

గమనిక: ఈ గణాంకాలు అన్నీ 19/06/2019 వరకే..


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.