close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. ధన యజ్ఞాన్ని పునరావృతం చేశారు: దేవినేని

రివర్స్ టెండరింగ్ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ధన యజ్ఞాన్ని పునరావృతం చేశారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. 2005లో పోలవరం ఎడమ కాల్వ సొరంగం టెండర్లు 21 శాతం తక్కువకు యూనిటీ ఇన్‌ఫ్రా సంస్థకు రూ.115 కోట్లకు ప్రభుత్వం అప్పగించిందన్నారు. కాగా 15 శాతం మట్టి పనులు చేసి ఆ సంస్థ మధ్యలో పనులు నిలిపి వేసిందని వివరించారు. దీనివల్ల 14 ఏళ్ళపాటు పనులు నిలిచి పోయాయన్నారు. ఇప్పుడు రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రూ.232 కోట్లకు మళ్లీ మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థకు ప్రభుత్వం కేటాయించిందని దేవినేని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విద్యాహక్కు చట్టాన్ని పునఃపరిశీలించండి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన గురుకులాలు విజయవంతంగా నడుస్తున్నాయని.. విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు మానేసి ప్రభుత్వ గురుకులాల్లో చేరుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నూతన విద్యావిధానంపై దిల్లీలో జరిగిన మంత్రుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. నూతన విద్యావిధానం ముసాయిదాపై సమావేశంలో సలహాలు, సూచనలు అడిగినట్లు తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్యకయ్యే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరించాలని సమావేశంలో కోరినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో ఈ రోజు కొన్ని చోట్ల, రేపు చాలా చోట్ల, ఎల్లుండి అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సూర్యాపేట జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్‌

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో నేటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. కోడ్‌ అమల్లో ఉన్నందున జిల్లాకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన ప్రకటనలూ చేయరాదని స్పష్టంచేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు కూడా చేపట్టరాదని ప్రభుత్వానికి సూచించారు. జిల్లాలో మంత్రులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదన్నారు. 2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రకారమే ఉపఎన్నిక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ విమానాల్లో సీట్లు ఖాళీగా ఉంచాల్సిందే

దిల్లీ-ఇస్తాంబుల్‌ మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సర్వీసులు దాదాపు ఐదో వంతు ప్రయాణికుల సంఖ్యను తగ్గించుకోనున్నాయి. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మార్గదర్శకాలను సూచించింది. ముఖ్యంగా ఇటీవల వాతావరణంలో మార్పుల కారణంగా పడమటి గాలులు బలంగా వీస్తుండటంతో భద్రతా ప్రమాణాల కోసం 15-20శాతం సీట్లను ఖాళీగా వదిలేయాలని ఆ విమానయాన సంస్థకు వెల్లడించింది. కొన్నాళ్ల క్రితం ఇదే విమానయాన సంస్థకు చెందిన ఒక విమానం ఈ మార్గంలో వెళుతూ ప్రయాణికుల సామగ్రిని తీసుకుపోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో డీజీసీఏ ఈ సూచన చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఒక ఉప ఎన్నిక.. 18వేల మందితో భద్రత

ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దంతెవాడ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబరు 21న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది. అయితే గత ఘటనల దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. పోలింగ్‌ సజావుగా నిర్వహించేందుకు ఏకంగా 18వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో గల దంతెవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, భాజపా నేత భీమా మండవి నక్సల్స్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఫ్లైట్‌ ఆలస్యం.. క్రికెటర్‌ ఆగ్రహం

టీమిండియాతో మూడు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు భారత్‌కు వస్తోన్న దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫాడుప్లెసిస్‌కి చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం అతడు ప్రయాణించిన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానం నాలుగు గంటలు ఆలస్యమవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విటర్‌లో పోస్టు పెట్టాడు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో అందుకోవాల్సిన ఇండియా ఫ్లైట్‌ మిస్సయ్యే అవకాశం ఉందని, తదుపరి విమానం పది గంటల తర్వాత ఉందని ట్వీట్‌ చేశాడు. కాగా ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చిరంజీవి, రామ్‌ చరణ్‌పై పోలీసులకు ఫిర్యాదు

టాలీవుడ్‌ అగ్ర హీరోలు చిరంజీవి, రామ్‌ చరణ్‌పై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరంజీవి కథానాయకుడిగా రూపుదిద్దుకుంటోన్న ‘సైరా’ చిత్రం కథ విషయంలో తమతో ఒప్పందం చేసుకొని, మోసం చేశారని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు. నరసింహారెడ్డి కథను తమనుంచి సేకరించి, తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెట్టారని వారు ఆరోపించారు. కథను తీసుకున్నందుకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని ఆరోపిస్తూ ఉయ్యాలవాడ వంశస్థులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రపంచ రెజ్లింగ్‌లో దీపక్‌ సంచలనం

భారత రెజ్లర్‌ దీపక్‌ పునియా సంచలనం సృష్టించాడు. ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ 86 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరుకున్నాడు. దాంతో పాటు 2020 టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ సాధించాడు. సెమీస్‌లో అతడు 8-2 తేడాతో స్విట్జర్లాండ్‌కు చెందిన స్టెఫాన్‌ రీచ్‌ముత్‌ను ఓడించాడు. ఆదివారం జరిగే తుది పోరులో దిగ్గజ ఆటగాడు హసన్‌ యాజ్‌దానితో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో దీపక్‌ గెలిస్తే స్వర్ణం సాధించిన సుశీల్‌ కుమార్‌ సరసన నిలుస్తాడు. క్వార్టర్స్‌లో కార్లోస్‌ అర్టురో (కొలంబియా)ను ఓడించడం ద్వారా దీపక్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా,  మరికొందరికి గాయాలైనట్టు సమాచారం. ఆగ్రాకు 100 కి.మీల దూరంలో ఏత్‌ జిల్లాలోని మిరేచి పట్టణంలో టాకియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా ఓ ఇంట్లో బాణసంచా పరిశ్రమను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.