
తాజా వార్తలు
ఎన్టీఆర్ వల్ల నా జీవితంలో ఆ అద్భుతాలు జరిగాయి
పూలు.. పండ్లు.. అవి చెట్టు మీద ఉన్నప్పటి కంటే ఆయన చేతిలో పడినప్పుడే మరింత అందంగా కనపడతాయి.
కథ.. కథనం పేపర్‌పై ఉన్నప్పటి కంటే ఆయన ద్వారా వెండితెరపైకి ఎక్కినప్పుడే వాటి విలువ పెరుగుతుంది.
అందం.. అభినయం ఆయన తెర వెనుక ఉంటూ తెర ముందున్న ప్రేక్షకులకు రసవత్తరంగా చూపిస్తారు.
ఒక్క మాటలో చెప్పాలంటే కళామ్మతల్లి వెలిగించిన ‘జ్యోతి’ ఆయన.
దర్శకత్వం అనే పదానికి దర్శనం.. నిదర్శనం.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి సరదా సంగతులు, తన సినీ అనుభవాలు ఎన్నో పంచుకున్నారు.
డైరెక్టర్ గారూ ఎలా ఉన్నారు?
కె.రాఘవేంద్రరావు: చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే, ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమం గురించి అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ కూడా చెబుతుంటారు. ఈ కార్యక్రమాన్ని అస్సలు మిస్ కాకుండా చూస్తారట.(మధ్యలో ఆలీ అందుకుని.. మీ రాక వల్ల తొలిసారి ఈ సెట్లో పూలు, పళ్లు వచ్చాయి.. నవ్వులు) వీటికయ్యే ఖర్చును నేను కట్టాలా ఏంటీ.. (నవ్వులు)
మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలై ఉంటుంది?
కె.రాఘవేంద్రరావు: అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించి దాదాపు 50ఏళ్లు పూర్తయ్యాయి. దర్శకుడిగా నా తొలి చిత్రం ‘బాబు’. బహుశా 44ఏళ్లు అనుకుంటా.
ఆ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
కె.రాఘవేంద్రరావు: మా తండ్రిగారు దర్శకత్వం వహించిన రెండు చిత్రాలకు సహాయకుడిగా పనిచేశా. అప్పుడు శోభన్‌బాబు చాలా సన్నిహితంగా ఉండేవారు. నా ఆలోచనలను నిర్మాతలు, శోభన్‌బాబు గమనించారు. అప్పుడే తన తర్వాతి చిత్రం నాతో చేస్తానని మాటిచ్చారు. ముఖ్యంగా రామానాయుడు గారు గ్రేట్ మ్యాన్. చాలా మందికి అవకాశం ఇచ్చారు. నాకు కూడా అవకాశం ఇస్తానని మా ఫాదర్‌తో చెబితే, ‘వాడికి ఇంకా అనుభవం సరిపోదు. ఇంకొకరికి ఇస్తే బాగుంటుంది’ అని ఆయన రామానాయుడుకు ఫోన్ చేసి చెప్పారట. మా నాన్న అలా చెప్పడం నాకు చాలా ఉపయోగపడింది. దాంతో మా ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా సినిమా చేద్దామనుకున్నాం. మేం ఏం చేస్తామో తెలియకుండానే శోభన్‌బాబు మాకు అవకాశం ఇచ్చారు. ఆయన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. అందులో వాణిశ్రీ, లక్ష్మి, అరుణా ఇరాని ముగ్గురు హీరోయిన్లు. ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది.
ఆ తర్వాత ‘జ్యోతి’ సూపర్‌హిట్ కదా!
కె.రాఘవేంద్రరావు: అవును! 28రోజుల్లో, అతి తక్కువ బడ్జెట్లో తీశాం. అప్పుడే ఈ గడ్డం పెంచడం ప్రారంభించా.
ఈ సినిమా నుంచే గడ్డం ఎందుకు పెంచాల్సి వచ్చింది?
కె.రాఘవేంద్రరావు: నా మొదటి చిత్రం యావరేజ్‌గా ఆడటంతో రెండో చిత్రం ప్రారంభించే ముందు తిరుపతికి వెళ్లి గడ్డం ఇచ్చేసి, అక్కడి నుంచి సినిమా చేయడం మొదలు పెట్టా. సినిమా పూర్తయ్యే వరకూ మధ్యలో ఎక్కడా గడ్డం చేసుకోలేదు. ఆ సెంటిమెంట్ ఇంకా ప్రతి సినిమాకీ కొనసాగుతూనే ఉంది. ఈ 45ఏళ్లలో తిరుపతిలో తప్ప ఎక్కడా గడ్డం చేయించలేదు. అలా దర్శకుడిగా నా జర్నీ మొదలైంది. అయితే అదృష్టం అనేది ‘అడవిరాముడు’తో కలిసొచ్చింది.
కె.రాఘవేంద్రరావు పేరు చివరిన బి.ఎ. అని ఎందుకు ఉంటుంది?
కె.రాఘవేంద్రరావు: నేను బి.ఎ. పట్టుదలతో చదివా. ‘దర్శకుడు కావాలంటే పీయూసీ చదివితే సరిపోతుంది’ అని మా నాన్న చెప్పారు. ఒక వేళ దర్శకుడిగా ఫెయిల్ అయితే, ఉద్యోగం అడగటానికి ఒక డిగ్రీ ఉండాలి కదా! ఆ ఉద్దేశంతో బి.ఎ. వరకూ చదివా. ఎందుకంటే సినిమా ఫీల్డ్‌లో ఒకసారి ఫెయిల్ అయితే మళ్లీ కనిపించే ప్రసక్తే ఉండదు. (మధ్యలో ఆలీ అందుకుని.. మీ బి.ఎ. వెనుక వేరే అర్థం ఉందని ఇండస్ట్రీలో టాక్. బి అంటే బొడ్డు.. ఎ అంటే యాపిల్ అనుకుంటారట.. నవ్వులు)
ఒక సినిమా టైటిల్లో మీ పేరు వెనుక బి.ఎ.లేకపోవడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందట నిజమేనా?
కె.రాఘవేంద్రరావు: నేను పనిచేసిన సినిమాలకు కథ, కథనం అందించినా నా పేరు వేసుకోను. కేవలం దర్శకత్వానికి మాత్రమే నా పేరు వేసుకుంటా. పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్‌గారు ‘కె.రాఘవేంద్రరావు బి.ఎ.’ అని నాలుగైదు సినిమాలకు వేశారు. నేనూ పెద్దగా పట్టించుకునే వాడిని కాదు. ఆ తర్వాత ఒక సినిమాకు వేయలేదు. అది ఫ్లాప్ అయింది. దీంతో ఆయన వద్దకు వెళ్లి, నా పేరు చివరిలో బి.ఎ. ఉండేలా చూడమని రిక్వెస్ట్ చేశా. పబ్లిసిటీ కోసం చేసింది కాదు.. కేవలం సెంటిమెంట్ వల్లే అలా చేశా. ఎందుకంటే దర్శకుడు ఫెయిల్ అయితే, నిర్మాత ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. పైగా ఇంకొక విషయమేంటంటే, నా స్నేహితుడి పుస్తకాలు తీసుకుని నేను బి.ఎ. చదివి పాసయ్యా.. వాడేమో ఫెయిల్ అయ్యాడు.. అందుకు వాడికి ఇప్పటికీ నేను రుణపడి ఉంటా.(నవ్వులు)
‘అడవిరాముడు’ కథ ఎన్టీఆర్ కోసమే రాశారా?
కె.రాఘవేంద్రరావు: ఎన్టీఆర్ అప్పటికే పెద్ద పెద్ద దర్శకులతో చేశారు. నిర్మాత వచ్చి ‘ఎన్టీఆర్ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు’ అని చెప్పగానే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఆయన నటించిన ‘పాండవ వనవాసం’ చిత్రానికి క్లాప్ కొట్టడం ద్వారానే నా సినీ కెరీర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి నాన్నగారు తీసిన సినిమాలకు ఆయనతో కలిసి పనిచేశా. నేను దర్శకత్వం చేస్తున్నానని తెలిసి ‘ఓకే బ్రదర్’ అన్నారు. అప్పుడు ఆయన నటించిన సినిమాలన్నీ మళ్లీ ఒకసారి వేసుకుని చూశా. ఎందుకంటే పరిచయ సన్నివేశాన్ని వెరైటీగా తీద్దామని అనుకున్నా.
‘అడవిరాముడు’ కథ శోభన్‌బాబు కోసం రాసుకున్నారని విన్నాం నిజమేనా?
కె.రాఘవేంద్రరావు: అందులో నిజం లేదు. శోభన్‌బాబు సైకిల్ ఎక్కాలి. ఎన్టీఆర్ ఏనుగు ఎక్కాలి. అప్పుడే ఆడియన్స్ కోరుకునేది అందించగలం. శోభన్‌బాబుకు జోడీగా చక్కటి హీరోయిన్లు ఉండాలి.(నవ్వులు)
తెలుగు చిత్ర పరిశ్రమలో రూ.కోటి వసూలు చేసిన మొదటి చిత్రం అదేనట!
కె.రాఘవేంద్రరావు: అవును! అదొక హిస్టరీ. అప్పుడు రీల్‌తో నడిచే ప్రొజెక్టర్లు ఉండేవి. ఆపరేటర్లు షిఫ్ట్‌లు మారుతూ 24గంటలూ సినిమా ఆడించారు. షో పడకపోతే జనం కొట్టేవారు. థియేటర్లకు అలా వస్తూనే ఉండేవారు. ఇప్పటివరకూ అలా ఎప్పుడూ జరగలేదు. చివరి రోజుల్లో ‘ఆరేసుకోబోయి...’ పాటను మళ్లీ మళ్లీవేయమని అడిగేవారు. ఎన్టీఆర్ వల్ల నా జీవితంలోనే కాదు, సినిమా ఇండస్ట్రీలోనూ రెండు మూడు అద్భుతాలు జరిగాయి. అప్పటివరకూ ఎన్టీఆర్ చిత్రాలకు కేవలం హారతి ఇచ్చేవారు. లేదా పూలు చల్లేవారు. ‘అడవిరాముడు’ నుంచి డబ్బులు వేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ‘వేటగాడు’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రాలకు కూడా ఇలాగే చేశారు. ‘వేటగాడు’ జితేంద్రతో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు ఆయన వచ్చి థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్నారు. ‘ఆకు చాటు పిందె తడిసే’ పాట రాగానే వెనుక నుంచి డబ్బులు విసరడం ప్రారంభించారు. ‘రాఘవేంద్రరావు నిజం చెప్పు.. నువ్వే మనుషుల్ని పెట్టి డబ్బులు వేయించావు కదా’ అన్నారు. ‘కావాలనుకుంటే మళ్లీ రేపు కూడా వెళ్లి చూడండి’ అని చెప్పా. అదొక వండర్. ఏ దర్శకుడికీ జరగని అద్భుతాలు నా జీవితంలో జరిగాయి.
(మధ్యలో ఆలీ అందుకుని ‘అడవిరాముడు’ చిత్రాన్ని రాజమండ్రి ఊర్వశి థియేటర్లో దాదాపు 10సార్లు చూసి ఉంటా. టికెట్లు దొరికేవి కావు. దీంతో మూగవాడిలా నటించి మహిళలను అడిగి టికెట్లు తీసుకునేవాడిని. ఒకసారి అలా చూస్తూ ఎన్టీఆర్ ఫైట్ సీన్ చూసి అరుస్తూ, ఈలలు వేయడం మొదలు పెట్టా. నాకు టికెట్ ఇచ్చిన ఆడవాళ్లు అది చూసి ‘ఒసేయ్ అక్కా.. వీడు మూగవాడు కాదే’ అని వీపు మీద ఒక్కటి కొట్టారు.. నవ్వులు)
అప్పటివరకూ పౌరాణిక పాత్రలను చేసిన ఎన్టీఆర్‌కు ఒక్కసారిగా మాస్ ఇమేజ్ను తెచ్చిన ఈ సినిమా హిట్టయిన తర్వాత ఆయన ఎలా ఫీలయ్యారు?
కె.రాఘవేంద్రరావు: ‘జ్యోతి’ సినిమాకు మంచి పేరు వచ్చింది. అయితే, ఎన్టీఆర్‌తో చేస్తే డబ్బులు కూడా రావాలి. లేకపోతే మరో సినిమా చేసే అవకాశం ఉండదు. ‘అడవిరాముడు’లో అష్టదిగ్బంధనం చేయాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ‘రామారావులాంటి నటుడు ఉన్నా వీడు ఫెయిల్ అయ్యాడంటే ఎందుకూ పనికిరాడు’ అని అంటారు. అందుకే కథలో అన్ని ఫార్ములాలు పెట్టాను. ఎన్టీఆర్ అప్పటివరకూ చేయని పాత్ర ఆయనతో చేయించా. నాగేశ్వరరావుగారి పాటలు వస్తే అభిమానులు విజిల్స్ వేసేవారు. కానీ, ఎన్టీఆర్ పాటలకు ఆ అవకాశం ఉండేది కాదు. ఆ ముద్ర చెరిపేయాలని అనుకున్నా. అందుకు తగినట్లు సన్నివేశాలు క్రియేట్ చేశాం. అలా ‘ఆరేసుకోబోయి’ పాటను పెడితే అది పెద్ద హిట్టయింది. దీంతో పాటు ఆయన గత చిత్రాల ముద్ర ఉండాలని ‘కృషి ఉంటే...’ పాటలో అన్ని గెటప్‌లు వేయించాం. హిట్టయిందని తెలిసిన తర్వాత అంతా చాలా సంతోషంగా ఫీలయ్యారు.
ఆయనతో ఎన్ని సినిమాలు తీశారు?
కె.రాఘవేంద్రరావు: 12 సినిమాలు చేశా. ఎన్టీఆర్‌తో పోలిస్తే చిరంజీవితో ఒక్క సినిమా ఎక్కువ తీశా అంతే. కాకపోతే చిరు విలన్‌గా కూడా చేశారు. ఆయనతో నా మొదటి చిత్రం ‘అడవిరాముడు’, ఆయన చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ రెండూ తీసే అవకాశం నాకు వచ్చింది. ‘ఆరేసుకోబోయి’, ‘కృషి ఉంటే..’, ‘పుణ్యభూమి నాదేశం..’ పాటలు ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. సురేంద్రబాబు అనే ఐపీఎస్ అధికారి ‘కృషి ఉంటే..’ పాటను స్ఫూర్తిగా తీసుకునే పోలీస్ అయ్యారట. ఆయనను కలిసినప్పుడు ఈ విషయాన్ని చెప్పారు. ఇలా ఎంతోమందిలో ఆ పాట స్ఫూర్తిని నింపింది.
ఇప్పటివరకూ అన్ని పళ్లు వాడేశారు. ఇప్పటివరకూ వాడని పండు ఏంటి?
కె.రాఘవేంద్రరావు: పనస పండు. ఒకసారి నువ్వు(ఆలీ) ‘ఈ పండు ఏ హీరోయిన్ బొడ్డు మీద వేస్తారు?’ అని అడిగితే ‘నీ బొడ్డుమీదే వేస్తా’నని చెప్పా(నవ్వులు) నేను ఏ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈ ప్రశ్న తప్పకుండా అడుగుతారు. ఎందుకంటే ఆ సన్నివేశాలన్నీ వాళ్ల మనసులో గుర్తుండిపోయాయి. ఎవరైనా అసహ్యించుకుంటే వాటి గురించి అడగరు కదా! ఒకసారి దీనిపై చర్చ పెడితే వెళ్లా.. ‘ఆడవాళ్లపైనే ఎందుకు పళ్లు వేస్తారు’ అని అడిగారు. ‘మగవాళ్లపై వేస్తే బాగుండదు కదా’ అని చెప్పా. అమెరికాలో ఇలాగే అడిగితే వారికి కూడా నా శైలిలో సమాధానం చెప్పా. ‘విమానం ల్యాండ్ కావాలంటే రన్‌వే కావాలి. అలాగే పండు ల్యాండ్ కావడానికి కూడా మంచి ప్లేస్ ఉండాలి’ అని చెప్పా. ‘మనం చిన్నప్పుడు చదివిన పాఠాలు గుర్తుంచుకోవాలి. చెట్టు నుంచి యాపిల్ పండు కింద పడినప్పుడు న్యూటన్ గ్రావిటీ సిద్ధాంతాన్ని కనిపెడితే, నేను ఎక్కడ పడాలో కనిపెట్టాను’ అని మరో సందర్భంలో వివరణాత్మకంగా చెప్పా(నవ్వులు)
మీరు పరిచయం చేసిన ఒక హీరోయిన్ ఒక హిందీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సౌత్‌లో కె.రాఘవేంద్రరావు అనే దర్శకుడు ఉన్నారు. ఆయన పళ్లు, పూలు ఎక్కువగా వాడతారు’ అని కాస్త వ్యంగ్యంగా మాట్లాడింది అది మీరు విన్నారా?
కె.రాఘవేంద్రరావు: వినడమేకాదు.. చూశాను కూడా. ఆ హీరోయిన్ తాప్సి. అప్పుడు అలా మాట్లాడినందుకు ఆ తర్వాత వచ్చి సారీ చెప్పింది కూడా. ‘వాళ్లను ఎంటర్టైన్మెంట్ చేయడానికి అలా చెప్పాను తప్ప.. వేరే ఉద్దేశం లేదు’ అని చెప్పుకొచ్చింది. ఇలాంటి వాటిపై ఎవరేమన్నా పట్టించుకోను. నా పని నేను చేసుకుని వెళ్లిపోతా. ఇటీవల విజయవాడ దుర్గగుడికి వెళ్తే, అక్కడ పూలతో అలంకారం చేశారు. అక్కడున్న భక్తులు ‘ఏవండీ రాఘవేంద్రరావుగారు.. చూశారా.. మీ సెట్టింగ్‌లే ఇక్కడ వేశారు’ అని అన్నారు. మనం తీసే విధానం బట్టే ఏ సన్నివేశమైనా వస్తుంది.
భక్తి సినిమాల్లో కూడా రక్తిని పెట్టడానికి కారణం?
కె.రాఘవేంద్రరావు: ‘అన్నమయ్య’ రాసిన పాటల్లో ఉన్న శృంగారం చదివితే కానీ తెలియదు. ఆయన చాలా భక్తితో అవన్నీ రాశాడు. మేము చాలా తక్కువ సన్నివేశాల్లో పెట్టాం. ఎవరైనా రక్తిలోంచి భక్తిలోకి మారతారని చరిత్ర చెబుతుంది. నిజ జీవితంలో కూడా స్టూడెంట్‌గా ఉన్నప్పుడు గుడికి వెళ్లమంటే ఆసక్తి చూపించరు. పిల్లలు, బాధ్యతలు పెరిగిన తర్వాత కష్టాలు రాకుండా చూడూ స్వామీ అని మొక్కుకునేందుకు తప్పకుండా గుడికి వెళ్తారు.
హిట్ అనుకున్న సినిమా ఫ్లాప్ అయితే మీరు ఎలా తీసుకుంటారు?
కె.రాఘవేంద్రరావు: ‘నిండు నూరేళ్లు’ చేస్తున్నప్పుడు చాలా నమ్మకం ఉండేది. అది ఫ్లాప్ అయింది. ఎప్పుడైనా ఓడిపోతేనే కసి పెరుగుతుంది. అదే సమయంలో ఓటమికి కారణం కనిపెట్టాలి. ఆ తర్వాత ఒక సినిమా చేస్తుండగా, ఒక లైట్ బాయ్ వచ్చి ‘సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే సినిమా తీస్తున్నప్పుడు మేము చూశాం కదా. ఖాళీ కుర్చీతో సత్యనారాయణగారు మాట్లాడుతూ ఉంటారు. మాకే ఫీలింగ్ కలగలేదు. ఇక ప్రేక్షకుడికి ఏం కలుగుతుంది’ అని అన్నాడు. మనకు ఎన్ని తెలివితేటలు ఉన్నా, ప్రేక్షకుడి దృష్టికోణం నుంచి ఆలోచించాలి. అలాగే ‘నిప్పులాంటి నిజం’ సినిమా విషయంలోనూ జరిగింది.
‘పెళ్లి సందడి’ సినిమాకు డ్యాన్స్ మాస్టర్‌తో సంబంధం లేకుండా అన్ని పాటలూ మీరే చేసేశారు. ఎలా సాధ్యమైంది.
కె.రాఘవేంద్రరావు: ఈ షోలో నువ్వు(ఆలీ)కాకుండా రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, అనుష్క, రాశీఖన్నా ఉంటే నేను ఎలా స్టెప్లు వేశానో చేసి చూపించేవాడిని(నవ్వులు) సినిమా చేసేటప్పుడు నేనూ, కీరవాణి అనుకున్నాం. నాకు కావాల్సినట్లు డ్యాన్స్ మాస్టర్లకు సూచనలు చేసేవాడిని. వాళ్లు కూడా సహకరించేవారు. సాధారణంగా గ్రూప్ సాంగ్ అంటే హీరో-హీరోయిన్ల మధ్యలో 40మంది వచ్చేవారు. అందరూ కనపడాలంటే లాంగ్ ఫ్రేమ్ పెట్టాలి. అప్పుడు అక్కడ డ్యాన్స్ చేసేది ఎవరో తెలిసేది కాదు. అందుకే ఒక సినిమా అసలు డ్యాన్స్ మాస్టర్లు లేకుండా కేవలం హీరో-హీరోయిన్ల మధ్య మాత్రమే సాంగ్స్ తీయాలనుకున్నా. డ్యాన్స్ మాస్టర్ లేకుండా తీస్తే, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు వచ్చింది. అందుకు ప్రోత్సహించిన డ్యాన్స్ మాస్టర్లకు కృతజ్ఞతలు.
(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేక వీడియో ద్వారా అడిగిన ప్రశ్న)
మీరు గడ్డంతో ఉంటూ, క్రీమ్ కలర్ షర్ట్ వేసుకోవడానికి కారణం ఏంటి?
కె.రాఘవేంద్రరావు: ఏ పాటను ఎలా పాడాలో బాలూకి బాగా తెలుసు. నీ ద్వారానే మొదటిసారి ‘సౌందర్య లహరి’లో మాట్లాడటం మొదలుపెట్టా. పాటైనా, మాటైనా నీతోనే మొదలవుతుంది. గడ్డం సంగతి నీకు తెలిసిందే. వేంకటేశ్వరస్వామికి మొక్కుకుని సినిమా పూర్తయిన తర్వాత మొక్కు చెల్లించుకుంటా. ఇక ఈ షర్ట్ గురించి చెప్పాల్సి వస్తే, అప్పట్లో నేను ఎక్కువగా వైట్ అండ్ వైట్ వేసేవాడిని. కెమెరామెన్ ప్రకాష్ ఒకసారి ఈ క్రీమ్ కలర్ షర్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పటి నుంచి అదే కొనసాగిస్తున్నా. ‘రాఘవా..’ అంటూ నువ్వు ప్రేమతో పిలవడం నా చెవుల్లో మార్మోగుతూ ఉంటుంది. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా.
అదేవిధంగా ఆలీతో కూడా నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. తనని చిన్నప్పుడు నా ఒడిలో కూర్చోబెట్టుకుని షూటింగ్ చేసేవాడిని. చాలా ముద్దుగా ఉండేవాడు. ‘ముద్దుల ప్రియుడు’ షూటింగ్ చేస్తుండగా ఒక ఆర్టిస్ట్ రాకపోయే సరికి ఆలీని పిలిపించాం. ఆ రోజునే తనకి పెళ్లయింది. నేను ఫోన్ చేస్తే వెంటనే షూటింగ్‌కు వచ్చాడు. ఇండస్ట్రీలో ఆలీని ప్రేమించని వాళ్లు ఉండరు.
* రాఘవేంద్రరావుకు కోపం వస్తే, సెట్లో కళ్ల జోడు ఎందుకు పగలగొడతారు?
* ‘రమ్యకృష్ణది ఐరన్‌లెగ్.. సినిమాలో పెట్టుకుంటే ఫ్లాప్..’ అన్నారు. అలాంటి ఆమెను గోల్డెన్‌లెగ్ ఎలా చేశారు?
* మీ తండ్రిగారు సినిమా చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఫ్రీగా వదిలేశారా? భయం ఉండేదా?
* మీరు దర్శకత్వం వహించిన సినిమాల్లో మీ మనసుకు నచ్చింది ఏది?
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు రాఘవేంద్రరావు సమాధానాలు వచ్చే వారం కార్యక్రమంలో...!
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- బంపర్ ఆఫర్ కొట్టేసిన షాలినీ పాండే
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- 2019లో గూగుల్‌లో అధికంగా సెర్చ్ చేసినవివే..
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
